Begin typing your search above and press return to search.

ప్రభుత్వ నిర్లక్ష్యం.. పేదలకు శాపం

By:  Tupaki Desk   |   16 Dec 2018 6:45 AM GMT
ప్రభుత్వ నిర్లక్ష్యం.. పేదలకు శాపం
X
పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో సదాశయంతో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. దానికి అనుబంధంగా 108 - 104 సర్వీసులను ప్రవేశపెట్టి ఎందరో రోగులకు కల్పతరువుగా మారారు. ఆయన ప్రవేశపెట్టిన ఈ పథకం జనాల అభిమానాన్ని చూరగొంది. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అవసాన దశకు పథకం చేరింది.. దీంతో రోగులు అష్టకష్టాలు పడుతున్నారు.

తాజాగా ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు రేపటి నుంచి నిలిచిపోతున్నాయి. ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు బకాయిలు విడుదల చేయకపోవడం.. వైద్యానికి అనేక ఆంక్షలు విధిస్తుండడంతో ఆస్పత్రి యాజమాన్యాల అసోసియేషన్ (ఆశా) ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. తమకు బాయిపడ్డ 500 కోట్ల రూపాయలు విడుదల చేసే వరకు సేవలందించమని 450 ఆస్పత్రులు స్పష్టం చేశాయి.

ఆస్పత్రి యాజమాన్యాల సమ్మెతో రేపటి నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ కృష్ణ విమర్శించారు. ఆస్పత్రులకు సంబంధించి 80వేల క్లెయిమ్ లను ఏపీ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పెండింగ్ లో పెట్టిందని ఆరోపించారు. ప్రజారోగ్యం విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యానికి నిరసనగానే ఇలా సమ్మెకు దిగినట్టు ఆయన పేర్కొన్నారు.