Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు ఒళ్లు మండేలా చేసిన బాబు

By:  Tupaki Desk   |   20 Jun 2018 5:15 AM GMT
కేసీఆర్‌ కు ఒళ్లు మండేలా చేసిన బాబు
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌ల‌ల పంట‌గా కాళేశ్వ‌రం ప్రాజెక్టుగా చెప్పాలి. రాష్‌ట్ర బ‌డ్జెట్‌కు సంబంధించి భారీ మొత్తాన్ని ఈ ప్రాజెక్టు కోసం వినియోగిస్తున్న వైనం తెలిసిందే. తాజాగా ప్ర‌ధాని మోడీని క‌లిసిన సంద‌ర్భంలోనూ కాళేశ్వ‌రం ప్రాజెక్టు కోసం నిధులు ఇవ్వాల‌ని కోరారు. కాళేశ్వ‌రం త‌న విజ‌యంగా ప్ర‌క‌టించుకుంటున్న కేసీఆర్‌.. ఈ ప్రాజెక్టును రాత్రి.. ప‌గ‌లు అన్న తేడా లేకుండా ప‌రుగులు తీయిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై ఏపీ స‌ర్కారు మ‌రోసారి త‌న పాత వాద‌న‌ను తెర మీద‌కు తెచ్చింది. కాళేశ్వ‌రం ప్రాజెక్టు రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టానికి వ్య‌తిరేక‌మ‌ని.. అలాంట‌ప్పుడు ఈ ప్రాజెక్టుకు సాంకేతిక అనుమ‌తులు ఎలా ఇస్తార‌ని ప్ర‌శ్నించింది.

కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై త‌న‌కున్న అభ్యంత‌రాల‌పై ఇప్ప‌టికే ఏపీ స‌ర్కారు కేంద్రానికి ఎనిమిది లేఖ‌లు రాసింది. తాజాగా తొమ్మిదో లేఖ‌ను రాసింది. గోదావ‌రిపై క‌డుతున్న కాళేశ్వ‌రం ప్రాజెక్టును నిర్మించ‌టం నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని.. ఇలాంటి ప్రాజెక్టుల‌కు సాంకేతిక ఆమోదం ఎలా ఇస్తారంటూ ప్ర‌శ్నిస్తూ తాజాగా తొమ్మిదో లేఖ‌ను కేంద్రానికి ఏపీ స‌ర్కారు సంధించింది.

ఈ ప్రాజెక్టుకు కేంద్ర జ‌ల సంఘం స‌ల‌హా క‌మిటీ ఇచ్చిన పాల‌నాప‌ర‌మైన ఆమోదాన్ని త‌క్ష‌ణ‌మే పునఃస‌మీక్షించాల‌ని డిమాండ్ చేసింది. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం వ‌చ్చే వ‌ర‌కూ ప్రాజెక్టు ప‌నులు జ‌ర‌గ‌కుండా చూడాల‌ని కోరింది. కాళేశ్వ‌రం ప్రాజెక్టు కొత్త‌ద‌ని.. దానితో ఏపీ ప్ర‌యోజ‌నాలు దెబ్బ తింటాయ‌ని గ‌డిచిన రెండేళ్ల‌లో ఇప్ప‌టికి ఎనిమిది లేఖ‌లు రాసిన ఏపీ స‌ర్కారు.. తాజాగా తొమ్మిదో లేఖ‌ను మ‌రింత బ‌లంగా రాశారు. ఇటీవ‌ల కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిస్థాయిలో ప‌చ్చ జెండా ఊపుతూ కేంద్రం చివ‌రి అనుమ‌తిని ఇచ్చిన నేప‌థ్యంలో.. దానికి కౌంట‌ర్ గా ఏపీ స‌ర్కారు తాజాగా లేఖాస్త్రాన్ని సంధించింది. ఓప‌క్క తాను ప‌ర్స‌న‌ల్ గా తీసుకున్న ప్రాజెక్టుపై బాబు స‌ర్కారు మోకాల‌డ్డే ప్ర‌య‌త్నం చేయ‌టంపై కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

కాళేశ్వ‌రంపై ఏపీ స‌ర్కారు సంధించిన తాజా లేఖాస్త్రంపై కేసీఆర్ ఘాటుగా రియాక్ట్ కావటం ఖాయ‌మ‌ని.. ఈ లేఖ రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య మ‌రిన్ని పంచాయితీల‌కు తెర తీస్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.