Begin typing your search above and press return to search.

ఎట్టకేల‌కు బాబు వెన‌క్కు త‌గ్గారు

By:  Tupaki Desk   |   27 Oct 2016 5:00 AM GMT
ఎట్టకేల‌కు బాబు వెన‌క్కు త‌గ్గారు
X
అమరావతి రాజధాని నిర్మాణానికి స్విస్ చాలెంజ్ ప‌ద్ద‌తిని అనుసరించాల‌నే వివాదాస్ప‌ద‌ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. స్విస్‌ చాలెంజ్ కింద కాంపిటీటివ్ బిడ్స్ నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అమరావతి రాజధాని నిర్మాణంపై తాజా నోటిఫికేషన్ జారీ చేస్తామని కోర్టుకు తెలిపింది. ఏపీ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ ఈ విషయాన్ని హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు.

రాజధాని నిర్మాణ ప‌నుల్లో భాగంగా క్యాపిటల్ రీజియన్ డెవలప్‌ మెంట్ అథారిటీ (సీఆర్‌ డీఏ)ఈ ఏడాది జూలై 17వ తేదీన అమరావతి రాజధాని నగరంలో స్టార్టప్ ఏరియా నిర్మాణం నిమిత్తం స్విస్‌ చాలెంజ్ కింద నోటిఫికేషన్ జారీ చేసింది. సింగపూర్ కన్సార్టియం ఒరిజనల్ ప్రపోజల్‌ ను ఆఫర్ చేసింది. కాగా ఆదిత్య హౌసింగ్ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌ మెంట్ - మెసర్స్ ఎన్వైన్ ఇంజనీర్స్ సంస్థ ఈ నోటిఫికేషన్‌ ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ నోటిఫికేషన్‌ లో అంశాలు న్యాయసమ్మతంగా లేవని పిటిషనర్లు పేర్కొనడంతో, సిఆర్‌ డిఏ సంస్థ ఆగస్టు 28వ తేదీన సవరణ చేస్తూ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పిటిష‌న్ల‌ను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథం - జస్టిస్ దుర్గా ప్రసాద్ రావు విచారించారు. అంతకు ముందు హైకోర్టు సింగిల్ జడ్జి కోర్టు పిటిషనర్ల వాదనలను విన్న తర్వాత స్టే ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ ఏపి ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనం ఎదుట అప్పీల్ కు వెళ్లింది. ఈ అప్పీల్ ను హైకోర్టు విచారిస్తుండగా, ఏపీ ఏజీ జోక్యం చేసుకుని గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ లో నిబంధనలను సవరణ చేసి తాజాగా నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. ఏపీ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌ మెంట్ చట్టానికి కొన్ని సవరణలను ప్రభుత్వం తీసుకువస్తుందని తెలిపారు. ఈ చట్టానికి సవరణలు చేయనున్నందున నోటిఫికేషన్‌ లో మార్పులు ఉంటాయన్నారు. ప్రభుత్వమే నోటిఫికేషన్లను ఉపసంహరించుకుంటున్నందువల్ల పిటిషనర్ల అప్పీల్ ను మూసివేయాలని ఏజి కోరారు. కాగా ఏపీ ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ ఇస్తే అందులో అభ్యంతరాలు ఉంటే సవాలు చేసేందుకు వీలుగా తమకు అవకాశం ఇవ్వాలని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఏజి స్టేట్‌ మెంట్‌ ను హైకోర్టు నమోదు చేసింది. ఈ కేసులో పిటిషనర్ల పిటిషన్‌ ను - రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను మూసివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/