Begin typing your search above and press return to search.

జగన్ ఫుడ్ పార్క్ మాటకు ఏపీ సర్కారు కౌంటర్!

By:  Tupaki Desk   |   21 Oct 2016 5:29 AM GMT
జగన్ ఫుడ్ పార్క్ మాటకు ఏపీ సర్కారు కౌంటర్!
X
వివాదాస్పద అంశాల విషయంలో సానుకూల వాదనను వినిపించే విషయంలో ప్రభుత్వాలు.. అధికారులు ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. అయితే.. ఇలాంటి విషయాల్లో తొందరపడటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మామూలే. తాజాగా అలాంటి తొందరపాటును ఆయ‌న‌ ప్రదర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మెగా అక్వా ఫుడ్ పార్క్ పై తాజాగా ఏపీ సర్కారు ఒక వివరణను విడుదల చేసింది. అక్వాఫుడ్ పార్క్ పై అర్థం లేని అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారని.. ఈ పార్కును వ్యతిరేకిస్తున్న వారికి కౌంటర్ ఇచ్చేలా విడుదల చేసిన ప్రకటనను చూస్తే కూసింత ఆశ్చర్యపోవాల్సిందే.

చిత్రమైన వాదనను తీసుకొచ్చిన ప్రభుత్వం.. కీలకమైన విషయాన్ని మర్చిపోయినట్లు కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ కానీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు ఫుడ్ పార్క్ ను వ్యతిరేకించటం లేదన్న విషయాన్ని వదిలేశారు. వారిద్దరూ చాలా స్పష్టంగా ఫుడ్ పార్క్‌ను తాము వ్యతిరేకించటం లేదని.. కాకుంటే ఈ పార్క్ ఏర్పాటు చేసిన స్థలం సరికాదన్నది మాత్రమే వారి వాదన. అయితే.. వారి వాదనలోని కీలక విషయాన్ని వదిలేసి.. ఫుడ్ పార్క్ ను సమర్థించేలా చేసిన వ్యాఖ్యలు చూస్తే.. బాబుకు ఎంత మొండితనమో ఇట్టే అర్థమవుతుంది.

పలువురు వ్యతిరేకిస్తున్న గోదావరి మెగా అక్వా ఫుడ్ పార్క్ కు అరెంజ్ కేటగిరి ఇచ్చారని.. కానీ సిమెంట్ పరిశ్రమకు కాలుష్య నియంత్రణ మండలి రెడ్ కేటగిరి ఇస్తుందని.. దాంతో పోలిస్తే అక్వా ఫుడ్ పార్కు నుంచి చాలా తక్కువ స్థాయిలో ఉండే కాలుష్యాలే విడుద‌ల‌వుతాయ‌ని పేర్కొన్నారు. ఈ మాటను చెప్పిన ఏపీ అధికారులు... సిమెంట్ ఫ్యాక్టరీని పచ్చటి పొలాల మధ్యన ఏర్పాటు చేస్తారా? ఎక్కడైనా ఏర్పాటు చేశారా? లాంటి మాటను కూడా చెబితే సరిపోయేది. కానీ.. అదేమీ చెప్పని అధికారులు.. ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన అక్వా ఫుడ్ పార్క్ వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నట్లుగా ప్రకటన విడుదల చేయటం గమనార్హం.

అక్వా పరిశ్రమ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ కూడా అవసరం లేదని.. అనుమతులు ఇవ్వొచ్చని కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల్లో స్పష్టంగా ఉందని చెబుతున్న ఏపీ సర్కారు.. ఆరెంజ్ కేటగిరిలో తాజా పరిశ్రమను పెట్టటం ద్వారా ఇది కాలుష్యం లేని పరిశ్రమగా అర్థమవుతుందని పేర్కొంది. రాష్ట్రంలో 69అక్వా ప్రాసెసింగ్ ఫ్లాంట్లు ఉన్నాయని.. ఇందులో పశ్చిమగోదావరి జిల్లాలోనే 17.. విశాఖలో 16.. నెల్లూరులో 11.. తూర్పుగోదావరి జిల్లాల్లో 10.. ప్రకాశంలో 9.. కృష్ణా జిల్లాలో ఆరు ఉన్నట్లుగా పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో అక్వా రంగానికి సంబంధించి రూ.31 వేల కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి చేసినట్లుగా వెల్లడించారు.

ఫుడ్ ప్రాసెసింగ్ అంటే.. రొయ్యలు.. చేపల్ని శుద్ధి చేయటమని.. వాటిని మంచినీటితో శుభ్రంగా కడుగుతారని.. అదే సమయలో ప్రాసెసింగ్ కు వచ్చే చేపలు.. రొయ్యల తల.. తోక.. వ్యర్థాల్ని.. వ్యర్థ శుద్ధి ఫ్లాంటుకు పంపి శుద్ధి చేయనున్నట్లుగా వెల్లడించారు. రొయ్యల తల.. తోకల్లో కైటిన్ అనే పదార్థం ఉంటుందని.. దీన్ని మందుల తయారీలో వాడతారని.. వ్యర్థంగా వదిలేస్తున్న దీన్ని మందుల తయారీలో వాడేలా చర్యలు తీసుకుంటే అదనపు ఆదాయం వస్తుందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ మాటలు వింటే.. ఈ ఫుడ్ పార్క్ తో ఎలాంటి ఇబ్బందులు లేవన్నట్లుగా కనిపించక మానదు. అదే నిజమైతే.. ఫుడ్ పార్క్ నుంచి సముద్రానికి ప్రత్యేక పైపులైన్ వేసి.. వ్యర్థజలాల్ని సముద్రంలోకి విడవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఎందుకు జారీ చేసినట్లు..? వివాదాస్పద అంశాల మీద సానుకూల ప్రకటనను విడుదల చేసే ముందు.. క్షుణ్ణంగా పరిశీలించి విడుదల చేస్తే కొత్త తలనొప్పులు ఎదురుకాకుండా ఉంటాయి. చూస్తుంటే.. ఏపీ సర్కారుకు ఈ సోయి ఉన్నట్లు కనిపించట్లేదన్న విమర్శ వినిపిస్తోంది.