Begin typing your search above and press return to search.

రేపటి నుంచే అసెంబ్లీ స‌మావేశాలు...షెడ్యూల్ ఇదే

By:  Tupaki Desk   |   11 Jun 2019 8:19 AM GMT
రేపటి నుంచే అసెంబ్లీ స‌మావేశాలు...షెడ్యూల్ ఇదే
X
ఏపీలో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అధికారం చేప‌ట్టిన తర్వాత తొలి అసెంబ్లీ స‌మావేశాల‌కు రంగం సిద్ధ‌మైపోయింది. జ‌గ‌న్ సీఎం అయ్యాక తొలిసారిగా భేటీ కానున్న అసెంబ్లీలో వైసీపీకి ఫుల్ మెజారిటీ ఉండ‌గా... విప‌క్ష టీడీపీకి చాలా త‌క్కువ బ‌ల‌మే ఉంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ త‌న‌దైన శైలిలో రాణించాల‌ని అనుకుంటూ ఉంటే... వైసీపీ నుంచి ఎదుర‌య్యే దాడుల‌ను ఎలా త‌ప్పికొట్టాల‌న్న కోణంలో టీడీపీ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. మొత్తంగా అసెంబ్లీ స‌మావేశాల కోసం వైసీపీ ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా... టీడీపీ మాత్రం ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయింది. ఈ నేప‌థ్యంలో ఈ స‌మావేశాలు చాలా ఆస‌క్తిక‌రంగా జ‌ర‌గ‌నున్నాయ‌ని మాత్రం చెప్ప‌క తప్ప‌దు.

ఇక జ‌గ‌న్ సీఎం అయ్యాక జ‌రుగుతున్న తొలి అసెంబ్లీ స‌మావేశాల‌కు సంబంధించి ఇప్పుడు మ‌రింత క్లారిటీతో కూడిన షెడ్యూల్ వ‌చ్చింది. రేపు ఉద‌యం 11.05 నిమిషాల‌కు ప్రారంభం కానున్న అసెంబ్లీ స‌మావేశాల్లో ప్రొటెం స్పీకర్‌గా ప్ర‌మాణం చేసిన అప్ప‌ల‌నాయుడు స‌భ‌లో మిగిలిన ఎమ్మెల్యేల‌తో ప్ర‌మాణం చేయిస్తారు. ఈ కార్య‌క్ర‌మం పూర్తి అవ‌గానే స‌భ ఎల్లుండికి వాయిదా ప‌డ‌నుంది. స‌భ‌లో స‌భ్యుల ప్ర‌మాణం పూర్తి కాగానే ఎల్లుండి కొత్త స్పీక‌ర్ ను ఎన్నుకునే ప్ర‌క్రియ మొద‌ల‌వుతుంది. ఏపీ అసెంబ్లీలో కొత్త స్పీక‌ర్‌గా త‌మ్మినేని సీతారాంను జ‌గ‌న్ ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. స్పీక‌ర్ గా సీతారాం ఎన్నిక‌ను ఎల్లుండి పూర్తి చేస్తారు. ఆ త‌ర్వాత 14న ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించిన గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ప్ర‌సంగిస్తారు. ఆ త‌ర్వాత 15, 16 తేదీల్లో అసెంబ్లీకి సెల‌వు ప్ర‌క‌టించారు. వ‌రుసగా రెండు రోజుల త‌ర్వాత 17, 18 తేదీల్లో స‌భా స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తంగా తొలి అసెంబ్లీ స‌మావేశాలు 5 రోజులు జ‌ర‌గ‌నున్నాయ‌న్న మాట‌.

స‌భ 5 రోజులు జ‌రుగుతున్నా... అందులో మూడు రోజుల స‌మావేశాలు ఎలాంటి ప్రాధాన్యం లేకుండానే కేవ‌లం స‌భ్యుల ప్ర‌మాణం, స్పీక‌ర్ ఎన్నిక‌, గ‌వ‌ర్న‌ర్ ప్రంసంగాల‌తోనే జ‌ర‌గ‌నున్నాయి. అయితే ఆ త‌ర్వాత రెండు రోజుల పాటు జ‌గ‌ర‌నున్న స‌మావేశాల్లో కీల‌క అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. అంతేకాకుండా వైసీపీ, టీడీపీల మ‌ధ్య మాటల యుద్ధానికి కూడా ఆ రెండు రోజుల స‌మావేశాలు వేదిక కానున్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. గ‌డ‌చిన ఐదేళ్ల‌లో టీడీపీ పాల‌న అంతా అవినీతిమ‌య‌మేన‌ని జ‌గ‌న్ స‌హా వైసీపీ నేత‌లంతా ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిధులు లేని రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు త‌మ వంతు య‌త్నాలు చేశామ‌ని టీడీపీ చెబుతోంది. ఈ నేప‌థ్యంలో ఇరు పార్టీల మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంవాదం చోటుచేసుకునే అవ‌కాశాలున్నాయి. అంతేకాకుండా గ‌డ‌చిన ఐదేళ్ల‌లో త‌మ నోరు నొక్కేసిన టీడీపీకి చుక్క‌లు చూపించాలని కూడా చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు క‌సితో ఉన్నట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో స‌భ మొత్తం 5 రోజుల పాటు జ‌ర‌గ‌నున్నా... కేవ‌లం చివరి రెండు రోజుల స‌మావేశాలే వాడీవేడీగా జ‌ర‌గ‌నున్నాయ‌ని చెప్పాలి.