Begin typing your search above and press return to search.

ఏపీలో శంకుస్థాపన సందడి మొదలైంది

By:  Tupaki Desk   |   7 Oct 2015 5:35 AM GMT
ఏపీలో శంకుస్థాపన సందడి మొదలైంది
X
పెళ్లింట్లో ఎంతటి హడావుడి ఉంటుందో.. ఏపీలో అచ్చు అలాంటి హడావుడే కనిపిస్తోంది. ఏపీ రాజధాని శంకుస్థాపనను నభుతో.. నభవిష్యతి అన్న చందంగా నిర్వహించాలని.. శంకుస్థాపన కార్యక్రమాన్ని భారీగా నిర్వహించటం ద్వారా.. అందరి కన్ను ఏపీ మీద పడాలన్న లక్ష్యంతో పని చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. అందుకు తగ్గట్లు భారీగా పనులు చేపట్టారు.

ఈ భారీ కార్యక్రమానికి సంబంధించి అన్ని అంశాలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటమే కాదు.. భారీ ఏర్పాట్లు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. వీవీవీఐపీ అతిధులు దాదాపు 1600 మంది వరకు వచ్చే అవకాశం ఉన్నందున.. వారందరికి మర్చిపోలేని అతిధ్యం ఇవ్వాలని ఏపీ సర్కారు భావిస్తోంది. వారి రాకపోకల కోసం.. వారు బస చేసేందుకు.. విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా పలు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లకు సిద్ధమైంది.

శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించే ప్రాంతానికి వచ్చే రహదారుల వెడల్పు నుంచి.. తిరిగి వెళ్లేంతవరకూ అతిధుల విషయంలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో పక్కాగా డిసైడ్ చేస్తున్నారు. శంకుస్థాపనకు సంబంధించిన చేపట్టిన పనుల గురించి చూస్తే..

రవాణా; శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా ఏపీకి దాదాపు వంద వరకూ విమానాలు రావొచ్చని భావిస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో విమానాలు వస్తున్న నేపథ్యంలో.. ఇవన్నీ నిలిపేందుకు వీలైన స్థలం గన్నవరంలో లేనందున.. విమానాల్ని గన్నవరం.. రాజమండ్రి.. విశాఖపట్నం.. తిరుపతిలో నిలిపి ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఊహించిన దాని కంటే మరిన్ని ఎక్కువ విమానాలు వస్తే. కొన్నింటిని హైదరాబాద్ కు తరలించాలని భావిస్తున్నారు.

విదేశీ అతిధులు వచ్చే భారీ విమానాల్ని నిలిపే సౌకర్యం గన్నవరం విమానాశ్రయంలో లేని నేపథ్యంలో.. వాటిని శంషాబాద్ లో నిలిపివేసి.. అక్కడ నుంచి హెలికాఫ్టర్లలో శంకుస్థాపన వేదిక వద్దకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇక.. అత్యంత ముఖ్యమైన వీవీవీఐపీలు శంకుస్థాపన జరిగే ప్రాంతానికే నేరుగా వచ్చేందుకు వీలుగా.. 13 హెలిపాడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక.. ముఖ్యులైన వీఐపీలు ఎయిర్ పోర్ట్ నుంచి శంకుస్థాపన జరిగే ప్రాంతానికి చేరుకునేందుకు వీలుగా 1000 కార్లు.. వంద వరకు ఏసీ బస్సుల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటికి ట్రావెలింగ్ వ్యాన్లు అదనం కానున్నాయి. దేశ.. విదేశీ ప్రముఖుల కోసం ఆడి.. బీఎండబ్ల్యూ.. బెంజ్ వంటి కంపెనీ కార్లను అద్దెకు తీసుకోనున్నారు.

బస; శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే అతిధులకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా చూసేందుకు వీలుగా బస ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు.. విజయవాడలోని స్టార్ హోటల్స్ తో పాటు.. అతిథి గృహాల్ని ముందస్తుగా బుక్ చేసేశారు. ఇక.. విదేశీ అతిధుల అభిరుచులకు తగ్గట్లుగా ఆహారం ఏర్పాటు చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. ఏయే వంటకాల్ని వండాలన్న అంశంపై వారు బస చేసే హోటళ్లకే బాధ్యతలు అప్పజెప్పారు.

భావోద్వేగ బంధం; శంకుస్థాపన కార్యక్రమంలో అతిధుల విషయంలో ఇలాంటి ఏర్పాట్లు చేస్తుంటే.. శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ మొత్తం భాగస్వామ్యం అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమరావతి మన మట్టి.. మన నీరు అనే నినాదంలో భాగంగా ఏపీలోని 16వేల గ్రామాల నుంచి కిలో చొప్పున మట్టి.. లీటరు చొప్పున నీటిని శంకుస్థాపన ప్రాంతానికి తరలిస్తున్నారు. వాటిని తీసుకొచ్చి.. పైలాన్ నిర్మాణంలో వినియోగించాలని భావిస్తున్నారు. మట్టి..నీరు సేకరణ ను ఈ నెల 15 మొదలు పెట్టి.. 18 నాటికి పూర్తి చేయాలని.. వాటిని గుంటూరుకు తీసుకొచ్చి 19 నాటికి శంకుస్థాపన జరిపే ప్రదేశానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

మట్టి.. నీటితో పాటు అమరావతి జ్యోతులు ఏపీకి ఆ చివర ఉన్న అనంతపురం నుంచి.. ఈ చివర ఉన్న శ్రీకాకుళం నుంచి మొదలై.. గుంటూరుకు చేరుతాయి. రెండు వైపుల నుంచి వచ్చే జ్యోతుల్ని 20 తేదీ నాటికి నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఉన్న ప్రాంగణానికి చేరుకుంటాయి. వీటిని ఏపీ ముఖ్యమంత్రి స్వయంగా స్వీకరిస్తారు.