Begin typing your search above and press return to search.

సీఎం సార్...! టర్కీ లో మీరు జాగ్రత్త

By:  Tupaki Desk   |   1 Aug 2015 10:21 AM GMT
సీఎం సార్...! టర్కీ లో మీరు జాగ్రత్త
X
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుటుంబసమేతంగా టర్కీ వెళ్లి వారం రోజుల పాటు రిలాక్సవుతారంటున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఆయనకు జాగ్రత్తలు చెబుతున్నాయి. కొందరైతే ఏకంగా ఆయన టర్కీని తన పర్యటనకు ఎంచుకోకపోవాల్సిందని కాదని కూడా అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టర్కీ కుటుంబసమేతంగా పర్యటించడానికి అనుకూలమైన దేశం కాదని.. మరీ ముఖ్యంగా చంద్రబాబు వంటి ప్రముఖులకు అది ఏమాత్రం సురక్షితమైన దేశం కాదని అంటున్నారు. చంద్రబాబు టర్కీలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని... రక్షణ, భద్రత విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉండరాదని సూచిస్తున్నారు.

ప్రపంచంలో ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదులు ఎవరైనా ఉన్నారంటే వారు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ ఐఎస్) టెర్రరిస్టులే. వారు ఇరాక్, సిరియా దేశాల్లో చాలా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ప్రపంచమంతా విస్తరించడానికి వ్యూహాలు రచిస్తున్నారు. వారి అరాచకాలు అన్నీఇన్నీ కావు. తాజాగా లిబియాలో నలుగురు భారతీయులను అపహరించారు. అందులో ఒకరు ఆంద్రప్రదేశ్ కు చెందిన వ్యక్తే. అంతేకాదు... హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల్లోనూ ఐఎస్ ఐఎస్ టెర్రరిస్టులు, సానుభూతి పరులు పలుమార్లు దొరికారు. ప్రపంచవ్యాప్తంగా యువతను ఆకర్షించి తమతో చేర్చుకుంటున్న ఈ టెర్రరిస్టులు మారణహోమం సృష్టిస్తున్నారు.

ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టుల ప్రధాన కేంద్రం ఇరాక్, సిరియాల్లోని ప్రాంతమే. ఆ ప్రాంతాన్నేవారు ఆక్రమించుకుని దానికి ఇస్లామిక్ స్టేట్ గా నామకరణం చేసి ప్రపంచమంతా ఇస్లామిక్ స్టేట్ చేయాలనే లక్ష్యంతో అరాచకాలకు తెరతీస్తున్నారు. చంద్రబాబు ఇప్పుడు పర్యటించబోతున్న టర్కీ దేశం.. సరిగ్గా ఇరాక్, సిరియాలపైనే ఉంది. టర్కీ సరిహద్దులో అధిక ప్రాంతం ఈ రెండు దేశాలతోనే ఉంది. అంతేకాదు... ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు టర్కీలో భారీ స్థాయిలో ఉన్నారు. అక్కడా వారి కార్యకలాపాలున్నాయి.టర్కీ, టర్కీ చుట్టుపక్కల దేశాలన్నీ ఇప్పుడు ప్రమాదకరంగానే ఉన్నాయి. టర్కీ భౌగోళికంగా పశ్చిమాసియా ప్రాంతంలోనే అధికంగా ఉన్నప్పటికీ ఆగ్నేయ ఐరోపాలోనూ కొంత భాగం ఉంది.. ఆఫ్రికా దేశాలూ ఇక్కడి సమీపంలోనే ఉంటాయి. ఈ ప్రాంతంలోని దేశాలన్నీ ఉగ్రవాదం, అంతర్యుద్ధాలతో అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్తితుల్లో అక్కడికి వెళ్తున్న తమ నేత అప్రమత్తంగా ఉండాలని టీడీపీ నాయకులు సూచిస్తున్నారు.