Begin typing your search above and press return to search.

అన్నేసి గంటలు బాబుతో గవర్నర్ మీటింగేంది?

By:  Tupaki Desk   |   21 Oct 2016 10:46 AM GMT
అన్నేసి గంటలు బాబుతో గవర్నర్ మీటింగేంది?
X
ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాజకీయాలకు సంబంధించినంత వరకూ కంటికి కనిపించే విషయానికి.. దాని వెనుక ఉండే అంశానికి అస్సలు సంబంధం ఉండదు. ఒక సంఘటన జరగటానికి ఎక్కడో.. ఏదో జరిగి.. దానికి సంబంధించిన వరుస పరిణామాలు చివరకు మరోలా కనిపిస్తుంటాయి. అందరికి కనిపించే సీన్లు అన్ని.. కథ.. స్క్రీన్ ప్లే.. దర్శకత్వం వహించిన వారి వ్యూహంలో భాగంగానే ఉంటాయే తప్ప.. వాటంతట అవి జరగవు. అన్ని విషయాల్లో అలానే జరుగుతుందని చెప్పలేం కానీ.. జరిగే చాలా విషయాలు ఇలానే జరుగుతాయనటంలో సందేహం లేదు.

ఈ మధ్యన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ గవర్నర్ నరసింహన్ తో భేటీ కావటం తెలిసిందే. ఈ మధ్యన భేటీ అయిన రెండు సందర్భాల్లోనూ ఆయన సచివాలయాన్ని ఏపీ నుంచి తమకు అప్పగించాలన్న విషయాన్ని కోరాలని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ ను రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా కాకుండా.. కేవలం తెలంగాణకు మాత్రమే ఉండేలా మార్చాలని.. ఇందుకు కేంద్ర హోం శాఖ సానుకూలంగా స్పందించాలంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఇలాంటి నేపథ్యంలో ఏపీ రాజధానికి సమీపంలోని విజయవాడలో జరిగే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ హాజరయ్యారు. అనంతరం వారిద్దరూ ఏకాంతంగా భేటీ అయ్యారు. దాదాపుగా రెండున్నర గంటల పాటు సాగిన ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. ఇంత సేపు ఇద్దరు ప్రముఖులు ఏం మాట్లాడి ఉంటారన్నది ఒకప్రశ్నగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఏపీ సచివాలయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలంటూ కోరుతున్న కేసీఆర్ ఆలోచనను గవర్నర్ బాబు దృష్టికి తీసుకొచ్చారని తెలుస్తోంది.

కేసీఆర్ కోరినట్లే ఏపీకి కేటాయించిన సచివాలయ భవనాల్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పినట్లుగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంతో తాను పేచీ పెట్టుకోవాలన్న ఉద్దేశం తనకు మొదటి నుంచి లేదని.. ఇచ్చిపుచ్చుకునే ధోరణికి తాను సిద్దమని బాబు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన గవర్నర్ ను. ఏపీ సచివాలయ భవనాల్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే అంశంపై ప్రశ్నలు అడిగినప్పుడు.. ఎప్పటి మాదిరి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసిన ఆయన.. ఊహాగానాలు వద్దని.. అన్ని అంశాల్నిపరిశీలించి.. చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రెండురాష్ట్రాలు సామరస్యంగానే అన్ని విషయాల్నిపరిష్కరించుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.