తమ్ముళ్లూ.. ఏపీ భవన్ మీ పార్టీ సొత్తు కాదు!

Mon Feb 11 2019 11:55:05 GMT+0530 (IST)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దిల్లీలో సోమవారం ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రాన్ని కేంద్రం మోసం చేసిందంటూ ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై గరం గరంగా ప్రసంగించారు.అయితే - చంద్రబాబు ధర్మ పోరాట దీక్షపై ప్రశంసల కన్నా విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. సీఎం వైఖరి - టీడీపీ తమ్ముళ్ల అత్యుత్సాహమే అందుకు కారణం. తన దీక్షకు భారీ యెత్తున ప్రచారం దక్కాలన్న ఆశతో చంద్రబాబు ప్రభుత్వం దాదాపు పది రోజులుగా ముమ్మర ఏర్పాట్లు చేసింది. దిల్లీ వీధుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటుచేసింది. గోడలకు పోస్టర్లు అతికించింది. దీక్షపై ప్రచారం కోసం రూ.కోట్లు తగలేసింది. దీంతో అదొక లగ్జరీ దీక్ష అని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తాయి.

ధర్మ పోరాట దీక్ష కోసం ఏపీ భవన్ వద్ద చేసిన ఏర్పాట్లపై కూడా తాజాగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ భవన్ పసుపు మయంగా చేసిన వైనం చూస్తే అది టీడీపీ భవనా అనే సందేహం కలుగుతోందని విమర్శకులు ధ్వజమెత్తుతున్నారు. టీడీపీ తమ్ముళ్లు అక్కడ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శకులు దుయ్యబట్టారు.

దీక్ష నేపథ్యంలో చంద్రబాబు ఆర్మీ పేరిట ఉన్న టీ షర్టులతో ఏపీ భవన్ ప్రాంగణంలో టీడీపీ కార్యకర్తలు హల్ చల్ చేస్తున్నారు. టీడీపీ పోస్టర్లు - ఫ్లెక్సీలను భారీగా అంటించారు. భవనం లోపల కూడా అంతా పసుపుమయమైంది. అధికారులు కూడా వారితో జత కలిసి చంద్రబాబు భజనలో మునిగి తేలుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అక్కడికి వచ్చిన ఏపీ - తెలంగాణ ఉమ్మడి భవన్ సందర్శకులు తెగ ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ భవన్ తమ పార్టీ సొత్తయినట్లు టీడీపీ వాళ్లు భావిస్తున్నారేంటి అంటూ విసుక్కుంటున్నారు. పార్టీ ప్రచారానికి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.