కేసీఆర్ కల్లల్లో ఆనందం కోసం ఓవైసీ త్యాగం

Tue Apr 17 2018 09:46:19 GMT+0530 (IST)

ఔను. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లల్లో ఆనందం చూసేందుకు మజ్లిస్ అధినేత - ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భారీ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఎంఐఎం చరిత్రలో ఏనాడు తీసుకోని నిర్ణయానికి ఓకే చెప్పేయడం వెనుక కేసీఆర్ కోసమేనని అంటున్నారు. వచ్చేనెల 12న జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ (ఎస్)కు మద్దతిస్తామని ఏఐఎంఐఎం పార్టీ ప్రకటించించడం వెనుక ఇదే నిర్ణయం అంటున్నారు. ఎన్నికల్లో మద్దతిస్తామని మజ్లిస్ ప్రకటించండం ఇదే తొలిసారి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. తొలుత అక్కడ పోటీచేయాలని భావించిన మజ్లిస్ పార్టీ హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడం వెనుక నిర్ణయం ఇదేనని అంటున్నారు.కర్ణాటక ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయాలని భావించినప్పటికీ మాజీ ప్రధాని దేవేగౌడ నేతృత్వంలోని జేడీఎస్ కు మద్దతు ఇస్తున్నామని సోమవారం మజ్లిస్ అధినేత - ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ కార్యాలయం దారుస్సలాంలో ప్రకటించారు. ఎన్నికల్లో జేడీఎస్ తరఫున ప్రచారం చేస్తామని స్పష్టంచేశారు. ఇప్పటికే కుమారస్వామితో మాట్లాడినట్టు తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతు ఫెడరల్ ఫ్రంట్ కోసమేనని అర్థమతోంది. ఓట్లు చీలి కాంగ్రెస్ - బీజేపీలకు మేలు జరుగుతుందని అంచనావేసి ఆ నిర్ణయాన్ని వెనుకకు తీసుకుంది. ఇదివరకు మహారాష్ట్ర - బీహార్ - యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఓటు బ్యాంకు చీలి బీజేపీకి లాభం చేకూరింది. ఈసారి అలా జరుగకుండా ఫెడరల్ ఫ్రంట్ కోసం టీఆర్ ఎస్ అధినేత - ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలిచేందుకు మద్దతు తెలిపినట్టు స్పష్టమవుతోంది. దీంతోపాటు ప్రజాసమస్యలు పరిష్కరించడం - పాలనాపరంగా కాంగ్రెస్ - బీజేపీలు విఫలమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో సీఎం కేసీఆర్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్ లో టీఎంసీ అధినాయకురాలు - ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారు. తర్వాత హైదరాబాద్ వచ్చిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కేసీఆర్ ను కలిసి మద్దతు తెలిపారు. ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కూడా కేసీఆర్ తో ఫోన్ లో మాట్లాడి ఫ్రంట్ కు సానుకూలత వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల సమయానికి ఫెడరల్ ఫ్రంట్ ను బలంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందులోభాగంగా ఇటీవల బెంగళూరు వెళ్లి జేడీఎస్ అధ్యక్షుడు - మాజీ ప్రధాని దేవేగౌడ - ఆయన కుమారుడు - మాజీ సీఎం కుమారస్వామితో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ పై సమాలోచనలు చేశారు. మరోవైపు జాతికి కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని అందించేందుకు కర్ణాటక శాసనభ ఎన్నికలు వేదికవుతాయని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ నేత కుమారస్వామి అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ కు మద్దతిస్తామని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సోమవారం చేసిన ప్రకటనపై కుమారస్వామి ట్విట్టర్ లో కృతజ్ఞతలు తెలిపారు.