అమ్మ పార్టీ ఫ్లెక్సీ రంగు మారటం దేనికి నిదర్శనం?

Thu Oct 12 2017 16:27:48 GMT+0530 (IST)

గడిచిన కొన్ని నెలలుగా తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఎంతగా మారిందో తెలిసిందే. అనారోగ్యంతో అమ్మ ఆసుపత్రిలో చేరటం.. ఆమె మరణం.. తర్వాత పార్టీ పగ్గాలు చిన్న చేతికి వెళ్లటం.. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన పాత కేసు తీర్పు నేపథ్యంలో జైలుకు వెళ్లటం తెలిసిందే.ఇదిలా ఉండగా.. అమ్మ పార్టీ మొదట రెండు ముక్కలై.. ఆ తర్వాత మూడు ముక్కలైంది. మళ్లీ పన్నీర్.. పళినిలు ఇద్దరూ కలిసిపోయారు. వారిద్దరికి చిన్నమ్మ బంధువు దినకరన్ శత్రువయ్యారు. కలిసిపోయిన ఇద్దరు నేతల్లో పళని స్వామి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తుంటే.. పన్నీర్ సెల్వం డిప్యూటీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.

ఇదిలా ఉంటే.. అన్నాడీఎంకేను బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు వీలుగా తెర వెనుక బలంగా పావులు కదులుతున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల సమయానికి దక్షిణాదిన ఎక్కువ సీట్లను దక్కించుకునే దిశగా బీజేపీ వ్యూహం రచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పళని.. పన్నీర్ లతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. మొదట్లో కమలనాథులతో పొత్తు విషయంలో అట్టే ఆసక్తి చూపించని పన్నీర్.. పళనిలు తర్వాతి కాలంలో తమకున్న పరిమితుల్ని గుర్తించి కమలనాథులతో కలిసేందుకు సిద్ధమయ్యారు.

ఇదిలా ఉండగా.. త్వరలోనే అన్నాడీఎంకే అధికారిక మద్దతు బీజేపీకే అన్న విషయాన్ని తమ పార్టీ నేతలు..  కార్యకర్తలకు అర్థమయ్యేలా చేయటం కోసం పళని.. పన్నీర్ లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. గతంలో పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు తయారు చేయిస్తే.. కచ్ఛితంగా ఆకుపచ్చ రంగులో బ్యాక్ గ్రౌండ్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకునేవారు.

తాజాగా మాత్రం అందుకుభిన్నంగా కాషాయరంగుతో ముద్రించిన ఫ్లెక్సీలు ఉండటం విశేషం. త్వరలోనే బీజేపీ నేతలతో చెట్టాపట్టాలు వేసుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలోనే ఫ్లెక్సీల రంగు మారుతుందన్న మాట డీఎంకే నేతల నోట్లో నుంచి వస్తోంది. ఇదిలా ఉంటే.. తాము బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నించటం లేదని.. ఆకర్షణీయంగా ఉంటుందనే ఎరుపు రంగులో ఫ్లెక్సీలు ముద్రించినట్లుగా చెబుతున్నారు. కాషాయం అంటున్న వారు.. దాని అసలు రంగును గుర్తించాలన్నారు

చూడగానే ఆకట్టుకునేలా ఎరుపు రంగు ఉంటుందని.. అందుకే తామీ రంగును ఎంచుకున్నట్లు అన్నాడీఎంకే మంత్రి జయకుమార్ చెబుతున్నారు. ఇంతకీ అమ్మ దండు తయారు చేయించిన ఎర్రరంగు ఫ్లెక్సీల్లో ఏముందంటే.. డెంగ్యూ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పేర్కొన్నారు. అన్నాడీఎంకే బీజేపీకి దగ్గరవుతున్న దానికి తగ్గట్లే.. ఫ్లెక్సీ రంగు మారిందంటున్నారు. ఆకుపచ్చ రంగునే వాడే అన్నాడీఎంకే కాషాయానికి దగ్గరగా ఉన్న ఎర్ర రంగు ఫ్లెక్సీలు వాడిన తీరు రానున్న రోజుల్లో కమలనాథులతో చెట్టాపట్టాలు వేసుకోవటం ఖాయమన్న మాటల వినిపిస్తోంది.