Begin typing your search above and press return to search.

అమ్మ పార్టీ విలీనంలో ఆఖ‌రి ట్విస్ట్‌

By:  Tupaki Desk   |   19 Aug 2017 4:36 AM GMT
అమ్మ పార్టీ విలీనంలో ఆఖ‌రి ట్విస్ట్‌
X
అన్నాడీఎంకే విలీనం దిశగా చీలిక గ్రూపులు ప్రయత్నిస్తున్నప్పటికీ, చర్చల దశను దాటి పురోగతి కనిపించడం లేదు. ఫలితంగా విలీనానికి మరికొంత సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. శుక్రవారానికల్లా విలీన ప్రకటన వెలువడుతుందని అంతా అనుకున్నప్పటికీ, మరికొన్ని రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్ మేరకు జయలలిత మృతిపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశిస్తున్నట్లు తమిళనాడు సీఎం పళనిస్వామి గురువారం ప్రకటించిన నేపథ్యంలో ఇరుగ్రూపుల మధ్య విలీనానికి మార్గం సుగమమైంది. శుక్రవారం సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం తమ తమ వర్గం నేతలతో చర్చలు జరిపారు. పళనిస్వామి తన క్యాబినెట్ సహచరులతో భేటీ అయ్యారు. విలీనానికి ఉన్న ఆటంకాలతోపాటు, దినకరన్ వైపు నుంచి వచ్చే ఒత్తిళ్లపైనా వారు చర్చించినట్లు సమాచారం. ఇక మద్దతుదారులతో పన్నీర్‌సెల్వం తన నివాసంలో సమావేశమయ్యారు.

మాజీ సీఎం పన్నీర్‌ సెల్వానికి 10మంది శాసనసభ్యులు - 12మంది ఎంపీల మద్దతు ఉంది. జయలలిత మృతిపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని, ఆమె నివాసమైన పోయెస్ గార్డెన్‌లోని వేదనిలయాన్ని స్మృతికేంద్రంగా మార్చాలని పన్నీర్‌సెల్వం వర్గం మొదటినుంచీ డిమాండ్ చేస్తూ వస్తోంది. ఆ షరతులను అంగీకరిస్తూ.. సీఎం పళనిస్వామి గురువారం ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను, ఆమె మేనల్లుడు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్‌ ను పార్టీ నుంచి బహిష్కరించాలన్న మరో డిమాండ్ కూడా నెరవేరిన నేపథ్యంలో ఏఐఏడీఎంకే విలీనానికి అన్ని అడ్డంకులు తొలిగినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. తొలుత సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పన్నీర్‌సెల్వం లాంఛనంగా ఒక ప్రకటన చేసే అవకాశముందని వారు చెప్తున్నారు.

ఏఐఏడీఎంకేలోని పళనిస్వామి వర్గం - పన్నీర్ సెల్వం వర్గం ఒక్కటైనా - విలీనం ఎక్కువ కాలం కొనసాగదని ఏఐఏడీఎంకే (అమ్మ) వర్గం నేత టీటీవీ దినకరన్ అభిప్రాయపడ్డారు. శశికళ జన్మదినం సందర్భంగా ఆమెను కలిసేందుకు శుక్రవారం కర్ణాటక లోని పరంపన అగ్రహార జైలుకు వెళ్లిన దినకరన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. దివంగత నేత జయలలిత నివాసం పోయెస్‌ గార్డెన్‌ ను స్మృతికేంద్రంగా మారుస్తామన్న సీఎం పళనిస్వామి ప్రకటనను జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ తప్పుబట్టారు. దీనిపై కోర్టుకెళ్తామని స్పష్టంచేశారు.

కాగా, ప‌న్నీర్ సెల్వంకు ముఖ్య‌మంత్రి పీఠం లేదా పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టాల‌నే డిమాండ్ కారణంగానే విలీనం నిలిచిపోయింద‌ని తెలుస్తోంది. మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన సెల్వం ఇప్పుడు ఉప‌ముఖ్య‌మంత్రిగా ప‌నిచేయ‌డం స‌రైన సంకేతాలు పంప‌ద‌ని పేర్కొంటూ సీఎం పీఠం కోసం పెల్వం వ‌ర్గం డిమాండ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అలా కాని ప‌క్షంలో పార్టీని న‌డిపించే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి ఇవ్వాల‌ని ష‌ర‌తు విధించ‌గా....ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి వ‌ర్గం డైల‌మాలో ప‌డిన‌ట్లు చెప్తున్నారు. ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌స్తే ఆ వెంట‌నే విలీనం ఉంటుంద‌ని చెప్తున్నారు. కాగా, ప‌న్నీర్ సెల్వం సూచించిన నేత‌ల‌ను కేబినెట్‌ లోకి తీసుకుంటే త‌న టీంలోని ఇద్ద‌రు మంత్రుల‌ను ప‌ళ‌ని తొల‌గించాల్సి వ‌స్తుంద‌ని స‌మాచారం. ఆ ఇద్ద‌రు మంత్రులు ఎవ‌ర‌నే ఉత్కంఠ అమ్మ పార్టీ నేత‌ల్లో నెల‌కొంది.