Begin typing your search above and press return to search.

సీఎం సాక్షిగా..డిప్యూటీ స్పీక‌ర్‌..మంత్రి త‌న్నులాట‌

By:  Tupaki Desk   |   23 July 2017 5:21 PM GMT
సీఎం సాక్షిగా..డిప్యూటీ స్పీక‌ర్‌..మంత్రి త‌న్నులాట‌
X
రాజ‌కీయాల్లో సీటుకు ఉండే ప్రాధాన్యం చెప్ప‌లేనిది. కుర్చీ కోసం ఎత్తులు పై ఎత్తులు స‌హ‌జ‌మే. అయితే ముష్టి ఘాతాల స్థాయికి చేరితేనే ఇబ్బంది నుంచి అసహ్యం స్థాయికి చేరుతుంది. త‌మిళ‌నాడు అధికార పార్టీ ఏఐఏడీఎంకే ఇవాళ ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర్కొంది. ఆ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎంజీ రామ‌చంద్ర‌న్ శ‌త జ‌యంతి ఉత్స‌వాల సంద‌ర్భంగా స్టేజ్‌ పై సీఎం ప‌ళ‌నిస్వామి ప‌క్క‌న ఎవ‌రు కూర్చోవాల‌న్న విష‌యంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. దీని కోసం గృహ‌, ప‌ట్ట‌ణ అభివృద్ధి మంత్రి ఉదుమ‌లయ్ రాధాక్రిష్ణ‌న్‌ - డిప్యూటీ స్పీక‌ర్ పొల్లాచి జ‌య‌రామ‌న్ ప‌బ్లిగ్గానే కొట్లాడుకున్నారు.

ఉత్స‌వాల సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన వేదిక‌పై సీఎం ప‌క్క‌న సీటు కోసం ఉప స‌భాప‌తి - మంత్రి నేనంటే నేనంటూ.. సీఎం ప‌క్క‌న కుర్చీ కోసం పోటీ ప‌డ్డారు. దీంతో ఇబ్బందిగా ఫీలైన సీఎం ప‌ళ‌నిస్వామి.. గొడ‌వ‌లో జోక్యం చేసుకున్నారు. ఇద్ద‌రినీ ఆయ‌న శాంతింపజేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. డిప్యూటీ స్పీక‌ర్ జ‌య‌రామ‌న్‌ ను మరో కుర్చీలో కూర్చోవాల్సిందిగా ప‌ళ‌ని చెప్ప‌డంతో ఆయ‌న స‌రే అన్నారు. ఆ త‌ర్వాత కూడా ఇద్ద‌రు నేత‌లు తిట్టుకుంటూనే క‌నిపించారు. స్టేజ్ కింద ఉన్న ఇద్ద‌రు నేత‌ల మ‌ద్ద‌తుదారులు కూడా అర‌వ‌డం ప్రారంభించ‌డంతో గంద‌ర‌గోళం నెల‌కొంది. దీంతో స్పీక‌ర్ ధ‌న‌పాల్ జోక్యం చేసుకొని గొడ‌వ స‌ద్దుమ‌ణిగేలా చేశారు. కానీ అప్ప‌టికే పార్టీకి జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. కుర్చీ కోసం మంత్రి, డిప్యూటీ స్పీక‌ర్ గొడ‌వ‌ప‌డ్డారన్న వార్త చాలామందిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. అంతేకాదు ఈ స‌భ‌లో ఎన్నిక‌ల సంఘం ఎవ‌రికీ కేటాయించ‌కుండా ఫ్రీజ్ చేసిన రెండాకుల గుర్తే స్టేజ్‌ పై క‌నిపించ‌డం గ‌మ‌నార్హం.