Begin typing your search above and press return to search.

ఈ తహశీల్దార్... నిజంగానే లేడీ తిమింగలం

By:  Tupaki Desk   |   11 July 2019 5:56 PM GMT
ఈ తహశీల్దార్... నిజంగానే లేడీ తిమింగలం
X
నిజమే... తహశీల్దార్ గా పనిచేస్తున్న ఈ మహిళా అధికారి భారీ అవినీతి తిమింగలమే. ఎందుకంటే ఓ మండలానికి రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న ఈ మహిళా అధికారి ఇంటిలో సోదాలకు వెళ్లిన ఏసీబీ అధికారులు... ఆమె ఇంటిలో ఎక్కడ చేతులు పెట్టినా నోట్ల కట్టలే తగిలాయట. అక్కడ, ఇక్కడ అన్న తేడా లేకుండా ఇంటి నిండా ఎక్కడికక్కడ కట్టలు కట్టలుగా ఆమె దాచిన మొత్తం కరెన్సీని తీసుకుని లెక్కించగా... ఆ లెక్క ఏకంగా రూ.93.50 లక్షలుగా తేలిందట. నిన్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఈ ఘటన తెలుగు నేల వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ భారీ తిమింగలం ఎవరు?, ఆమె ఎక్కడ పనిచేస్తున్నారు?, ఏమేం అవినీతి కార్యక్రమాలు వెలగబెడుతున్నారు?, ఈ అవినీతి తిమింగలం ఎలా పట్టుబడింది? అన్న వివరాల్లోకెళదాం పదండి.

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి వి. లావణ్య తహశీల్దార్ గా పనిచేస్తున్నారు. చాలా కాలం క్రితమే సర్వీసులోకి వచ్చిన ఆమె... రెండేళ్ల క్రితం ఉత్తమ అధికారిణిగా తెలంగాణ సర్కారు నుంచి పురస్కారం కూడా అందుకున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా... కొందుర్గుకే చెందిన ఓ రైతు తన పేరును ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు వీఆర్వోను సంప్రదించాడు. అందుకు ఆ వీఆర్వో ఏకంగా రూ.9 లక్షల మేర లంచం అడిగాడట. దీంతో చిర్రెత్తుకొచ్చిన సదరు రైతు... నేరుగా ఏసీబీని ఆశ్రయించి కంప్లైంట్ చేశారు. రంగంలోకి దిగిన ఏసీబీ అన్నదాతకు డబ్బులిచ్చి పంపి వీఆర్వోపై వల వేసింది. ఈ వలకు చాలా ఈజీగానే చిక్కేసిన వీఆర్వో... ఆ మొత్తం తనకు ఒక్కడికి మాత్రమే కాదని, అందులో రూ.5 లక్షలు తహశీల్దార్ వాటానేనని అసలు గుట్టు విప్పాడు.

దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో బృందాన్ని రంగంలోకి దింపిన ఏసీబీ ఉన్నతాధికారులు హైదరాబాద్ లోని ఆమె ఇంటికి పంపారు. ఇంకో బృందాన్ని ఏమీ ఎరుగకుండా కార్యాలయంలో కూర్చుని విధులు నిర్వర్తిస్తున్న లావణ్య దగ్గరకు పంపారు. కొందుర్గులో లావణ్యను విచారిస్తుండగానే... హైదరాబాద్ లో ఆమె ఇంటిలో కాలుపెట్టిన ఏసీబీ అధికారులు... ఆ ఇంటిలో ఎక్కడికక్కడ దాచిపెట్టిన నోట్ల కట్టలను చూసి నోరెళ్లబెట్టారట. ఈ వ్యవహారం చాలా పెద్దదేనని గ్రహించిన ఏసీబీ అధికారులు లావణ్య ఇంటిని అణువణువూ పరిశీలించారట.ఈ క్రమంలో నగదు రూపంలోనే ఆమె ఇంటిలో రూ.93.50 లక్షలు పట్టుబడ్డాయట. ఆ నగదుతో పాటు 40 తులాల బంగారం, ఇంకా కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తి పత్రాలు లభించాయట. ఏకంగా నగదు రూపంలోనే రూ.93 లక్షలను ఇంటిలోనే పెట్టుకున్న లావణ్యను లేడి తిమింగలం అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు కదా.