Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ వార్నింగ్‌ కు భ‌య‌ప‌డ‌న‌న్న ఆర్కే!

By:  Tupaki Desk   |   10 Dec 2017 5:09 AM GMT
ప‌వ‌న్ వార్నింగ్‌ కు భ‌య‌ప‌డ‌న‌న్న ఆర్కే!
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ నాలుగు రోజుల ఏపీ ప‌ర్య‌ట‌న ముగిసింది. త‌ర్వాతి కార్య‌క్ర‌మం ఏమిట‌న్న దానిపై క్లారిటీ లేకున్నా.. నాలుగురోజుల వ్య‌వ‌ధిలో ఆయ‌న చాలా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టివ‌ర‌కూ మీడియా మీద ఎలాంటి ఆవేశ‌పూరిత వ్యాఖ్య‌లు చేయ‌ని ప‌వ‌న్ అందుకు భిన్నంగా త‌న నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న‌లో రెండో రోజున ఆంధ్ర‌జ్యోతి అధినేత ఆర్కేను ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేశారు.

త‌న‌పై కుల‌ముద్ర వేయడానికి ఆంధ్ర‌జ్యోతి ప్ర‌య‌త్నించింద‌ని చెప్ప‌టంతో పాటు.. తాను మీడియా సంస్థ‌ల్లో కుల లెక్క‌ల్ని బ‌య‌ట‌పెడ‌తాన‌ని హెచ్చ‌రించారు కూడా. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ప‌వ‌న్ ఏపీ ప‌ర్య‌ట‌న‌ను భారీగా క‌వ‌రేజ్ చేసిన ప్రింట్ మీడియా సంస్థ ఏదైనా ఉందంటే అది ఆంధ్ర‌జ్యోతినే. అలాంటి ప‌త్రిక య‌జ‌మాని మీద‌నే ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చేయ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అనుకున్న‌ట్లే.. త‌న వారాంతం కొత్త ప‌లుకు కాల‌మ్ ను ప‌వ‌న్‌కు డెడికేట్ చేశారు ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ‌. ప్ర‌తి వారం తాను రాసే దాని కంటే కూసింత ఎక్కువ రాసిన ఆయ‌న‌.. ఆర్టిక‌ల్ మొత్తాన్ని ప‌వ‌న్ గురించి విశ్లేష‌ణ చేశారు. త‌న‌కు ప‌వ‌న్ వార్నింగ్ ఇచ్చిన‌ట్లుగా తాను భావిస్తున్న‌ట్లుగా చెప్పిన ఆర్కే.. ప‌వ‌న్ త‌మ మీద అన‌వ‌స‌రంగా వ్యాఖ్య‌లు చేశార‌న్న‌ట్లుగా చెప్పుకున్నారు.

తాను అన్న మాట‌ల్ని ప‌వ‌న్ త‌ప్పుగా అర్థం చేసుకున్న‌ట్లుగా చెప్పారు. ఈ ఆర్టిక‌ల్ లో గుర్తించాల్సిన మ‌రో విష‌యం ఏమిటంటే.. ప‌వ‌న్ మంచోడే కానీ అంటూ ప‌వ‌న్ పై ప్ర‌శంస‌లు.. విమ‌ర్శ‌లు రెండూ చేశారు. ఏపీలోని కులాల అభిమానం మీద‌ గ‌తంలో తాను ఏ విష‌యాల్ని అయితే ప్ర‌స్తావించానో దాదాపు అలాంటి విష‌యాల్నే ప‌వ‌న్ నోటి నుంచి వ‌చ్చాయ‌న్నారు. ఇంత‌కీ.. ప‌వ‌న్ వార్నింగ్ పై ఆర్కే ఎలా రియాక్ట్ అయ్యారు. ఆయ‌నేమ‌న్నార‌న్న‌ది ఆయ‌న మాటల్లోనే చూస్తే..

పవన్‌ కల్యాణ్‌ తన రెండవ రోజు పర్యటన సందర్భంగా రాజమండ్రిలో మాట్లాడుతూ, నాపై ఒక నింద వేశారు. నేను ఆయనకు కులం ఆపాదించే ప్రయత్నం చేశానన్నది ఆయన ఆరోపణ సారాంశం. నిజానికి 2015 జూలై 12వ తేదీన నేను రాసిన ఈ కాలమ్‌లో చెప్పిందేమిటంటే, ‘‘పవన్‌ కల్యాణ్‌ మంచివాడు మాత్రమే కాదు. ఆవేశపరుడు కూడా. రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణాలను ఆయన ఇంకా వంటబట్టించుకోలేదు.

రాజధాని గ్రామాల పర్యటనకు వెళ్లినప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన యువత ఎక్కువగా హడావుడి చేసింది. నిజానికి పవన్‌ కల్యాణ్‌కు కుల పిచ్చి లేదు. అందరివాడుగా ఉండాలనే ఆయన కోరుకుంటారు. కానీ కొందరి అత్యుత్సాహం వల్ల కొందరివాడుగా ముద్ర వేయించుకునే ప్రమాదం ఉంది’’ అని! ఇందులో ఆయనకు నేను కులం ఆపాదించింది ఎక్కడో తెలియడం లేదు.

ఆయనకు కులం లేదనే చెప్పాను. అయినా ఆయన ఎందుకు అలా అర్థం చేసుకున్నారో తెలియదు. దీనిపై అప్పట్లోనే పవన్‌ కల్యాణ్‌ పరోక్షంగా స్పందించారు. అప్పుడు కూడా 2015, ఆగస్టు 30వ తేదీన రాసిన కాలమ్‌లో వివరణ ఇచ్చాను. ‘‘పవన్‌ కల్యాణ్‌ పర్యటన సందర్భంగా ఒకామె ఆయనను ఉద్దేశించి.. ‘మన వంగవీటి రంగా వస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ వస్తున్నారు. ఆయనకు మన గోడు చెబుతాను’ అని అన్నారు. తనను ఆవిడ వంగవీటి రంగాతో పోల్చినప్పుడే పవన్‌ కల్యాణ్‌ అభ్యంతరం చెప్పవలసింది. కానీ ఎందుకో ఆయన మౌనంగా ఉండిపోయారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల నష్టం జరిగేది పవన్‌ కల్యాణ్‌కు మాత్రమే! అందరివాడుగా ఉండాలనుకుంటున్న పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ? రంగా ఎక్కడ? విజయవాడలో రంగా– రాధా ఒకవైపు, నెహ్రూ– గాంధీ ఒక వర్గంగా కొన్నేళ్లపాటు రౌడీ రాజకీయాలు చేశారు’’ అని ఆ కాలమ్‌లో రాశాను.

అంతేకాకుండా పవన్‌ కల్యాణ్‌లో ఆవేశంతోపాటు, అభ్యుదయ భావాలు కూడా ఎక్కువ. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ రాజకీయాలను సంస్కరించాలని ప్రయత్నించే ముందు అక్కడ నెలకొన్న కుల జాడ్యాన్ని నిర్మూలించడానికి కృషి చేస్తే మరింత మంచి పేరు తెచ్చుకుంటారని కూడా అప్పుడే చెప్పాను. ఇప్పుడు ఆయన కూడా ఈ కుల జాడ్యం పోవాలని చెప్పారు కనుక అభినందిస్తున్నాను.

నేను చేసిన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్న ఆయన రాజమండ్రిలో మాట్లాడుతూ, ‘‘వరంగల్‌ వెళ్లాను. ఆదిలాబాద్‌ వెళ్లాను. అక్కడ నా కులం ఉందా? తెలుగుదేశానికి మద్దతు ప్రకటించినప్పుడు మీరు ఎందుకు కులం గురించి రాయలేదు. మీకు సౌకర్యంగా ఉంటే ఒక మాట. లేకపోతే మరొక మాటా? నేను చిరంజీవిలా మంచి మనిషిని కాదు. మెతక మనిషిని కాదు. నాకు చావంటే భయం లేదు. ఇంకోసారి కులం గురించి మాట్లాడితే ఎవరెవరి సంస్థల్లో ఎవరెవరు ఉన్నారో లెక్కలు తీస్తా. ఆఫీసు బాయ్‌ నుంచి మేనేజర్‌ వరకు ఎవరెవరు ఏ కులమో లెక్కలు తీస్తా’’ అని అంటూ పరోక్షంగా నన్ను హెచ్చరించే ప్రయత్నం ఆయన చేశారు.

ఇప్పుడు మళ్లీ మళ్లీ పవన్‌ కల్యాణ్‌కు స్పష్టంచేస్తున్నది ఒక్కటే! ఆయనకు కులాభిమానం లేదని నేను గట్టిగా నమ్ముతున్నాను. నాకు సంబంధించినంత వరకు రాజకీయాలు వేరు. వ్యక్తిగత సంబంధాలు వేరు. ఇక నన్ను హెచ్చరించడానికి ఎవరు ప్రయత్నించినా వృథానే! పవన్‌ కల్యాణ్‌ కంటే బలవంతులే నన్ను తొక్కేయాలని చూశారు. వాటన్నింటినీ తట్టుకుని ఎదురొడ్డి నిలబడ్డాను. ఎవరెవరి సంస్థల్లో ఏయే కులాల వాళ్లు ఎంత మంది ఉన్నారో లెక్కలు తీస్తాను అని కూడా పవన్‌ పరోక్షంగా నాకు వార్నింగ్‌ ఇచ్చారనే అనుకుంటున్నాను.

‘చలోరే చలోరే చల్‌’ ప్రోగ్రామ్‌ ఆఖరి దశ పూర్తయ్యింది కనుక ఆయనే స్వయంగా మా కార్యాలయాలకు వెళ్లి కులాలవారీగా లెక్కలు తీసుకోవచ్చు. ఆయన వస్తానంటే నేనే గుమ్మం వద్దకు వెళ్లి స్వాగతిస్తాను. ఎవరి కులం ఏమిటో తెలుసుకుని ఉద్యోగాలు ఇవ్వడం మా సంస్థకు తెలియదు. ప్రాంతాలు, కులాలకు అతీతంగానే మేం వ్యవహరిస్తున్నాం. నిజానికి మా సంస్థలలో పనిచేసే చాలా మంది కులం ఏమిటో సహచరులకు కూడా తెలియదు. అలాంటి మమ్మల్ని లెక్కలు తీస్తానని భయపెడితే భయపడిపోవడానికి మేం ఏ తప్పూ చేయలేదు. చేయబోము కూడా! నిజానికి పవన్‌ కల్యాణ్‌ తొలి దశ పర్యటనకు అత్యధిక ప్రచారం ఇచ్చింది కూడా మేమే! పవన్‌ కల్యాణ్‌ మెచ్చి మేక తోలు కప్పుతాడని ఆ పని చేయలేదు. మార్పు కోసం పెట్టిన పార్టీ అంటున్నారు కనుక పవన్‌ కల్యాణ్‌ ఏమి మాట్లాడతారా అన్న కుతూహలం అందరిలోనూ ఉంటుంది. అందుకే ఎక్కువ కవరేజ్‌ ఇచ్చాం. ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత విమర్శలను సంయమనంతో స్వీకరించాలి. అలా కాకుండా విమర్శించే వారికి వార్నింగ్‌లు ఇవ్వాలనుకుంటే నష్టపోయేది ఆయనే!