Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ట్వీట్స్ పై ఆర్కే లీగ‌ల్ నోటీసులు

By:  Tupaki Desk   |   25 April 2018 4:22 AM GMT
ప‌వ‌న్ ట్వీట్స్ పై ఆర్కే లీగ‌ల్ నోటీసులు
X
కొద్ది రోజులుగా మీడియా అధినేత‌లే ల‌క్ష్యంగా చేసుకొని వ‌రుసపెట్టి ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఆంధ్ర‌జ్యోతి ఎండీ  రాధాకృష్ణ లీగ‌ల్ నోటీసులు జారీ చేశారు. త‌న ప‌రువు ప్ర‌తిష్ఠ‌ల‌కు భంగం వాటిల్లేలా ప‌వ‌న్ ట్వీట్లు ఉన్నాయ‌ని చెప్పిన ఆయ‌న‌.. ట్విట్ట‌ర్ లో చేసిన అనుచిత వ్యాఖ్య‌ల్ని తొల‌గించి.. బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని లేనిప‌క్షంలో తాను ప‌రువున‌ష్టం దావా వేస్తానంటూ లీగ‌ల్ నోటీసులు పంపారు.

ఈ ప‌రిణామంతో ప‌వ‌న్ వ‌ర్సెస్ కొన్ని మీడియా సంస్థ‌ల అధినేత‌ల మ‌ధ్య న‌డుస్తున్న పోరు మ‌రింత ఉధృత‌మ‌వుతుంద‌ని చెప్పాలి. ఆర్కే పంపిన నోటీసుల్లో త‌న మీదా.. త‌న సంస్థ మీదా నిరాధార ఆరోప‌ణ‌ల్ని.. ట్వీట్ల‌ను భేష‌రతుగా ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఒక‌వేళ ప‌వ‌న్ తాను చెప్పిన‌ట్లుగా చేయ‌ని ప‌క్షంలో సివిల్‌.. క్రిమిన‌ల్ ప‌రువు న‌ష్టం దావాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని పేర్కొన‌టం గ‌మనార్హం.

ప‌వ‌న్ కావాల‌ని చేస్తున్న ట్వీట్ల‌లో వీస‌మెత్త‌యినా వాస్త‌వం లేద‌ని స్ప‌ష్టం చేసిన ఆర్కే.. ఆంధ్ర‌జ్యోతి-ఎబీఎన్ వార్తా సంస్థ‌లు నియంత్ర‌ణ సంస్థ‌ల నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ప‌ని చేస్తాయ‌ని పేర్కొన్నారు. ప‌వ‌న్ ఆరోపించిన‌ట్లుగా టీఆర్పీ కోసం మ‌హిళ‌ల్ని దూషించే అల‌వాటు వాటికి లేద‌ని స్ప‌ష్టం చేశారు.  స‌మాజానికి మీడియా చేసే మేలును త‌గ్గించి చూపించ‌టం రాజ‌కీయ నాయ‌కుల‌కు అల‌వాటైన ప‌నేన‌ని.. లింగ అస‌మాన‌త‌పై తాము చేస్తున్న పోరు గురించి మ‌ర్చిపోవ‌టం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు త‌గ‌ద‌న్నారు.

ప‌డిపోతున్న రాజ‌కీయ ప్ర‌తిష్ఠ‌ను పున‌రుద్ద‌రించుకోవ‌టానికే ప‌వ‌న్ త‌న‌పై ఊహాజ‌నిత‌.. వండివార్చిన ట్వీట్ల‌ను పోస్టు చేస్తున్నట్లు చెప్పారు. నేర‌పూరిత కుట్ర‌తోనే మ‌రికొంద‌రితో క‌లిసి ప‌వ‌న్ ట్వీట్లు చేస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు. ప‌వ‌న్ చేసిన ట్వీట్ల వ‌ల్ల త‌న‌కు.. త‌న సంస్థ‌ల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లింద‌ని..ఎన్నో ప్ర‌శ్న‌ల‌ను.. అవ‌హేళ‌న‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌న్నారు. మ‌రి.. ఆర్కే పంపిన లీగ‌ల్ నోటీసుల‌కు ప‌వ‌న్ రియాక్ష‌న్ ఏమిటి?  రోజురోజుకీ ఉధృత‌మ‌వుతున్న ప‌వ‌న్ ట్వీట్ల దాడి మ‌రింత ఉధృత‌మ‌వుతుందా?  లేక‌.. త‌గ్గుతుందా?  అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌లుగా మారాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.