Begin typing your search above and press return to search.

ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆయ‌న్ను క‌లిసింద‌ట‌!

By:  Tupaki Desk   |   22 Jan 2019 5:20 AM GMT
ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆయ‌న్ను క‌లిసింద‌ట‌!
X
ఎక్క‌డ లండ‌న్‌?.. ఎక్క‌డ భార‌త్‌.? మ‌రెక్క‌డ అమెరికా? ఒక దానితో మ‌రొక‌టి సంబంధం లేన‌ట్లుగా ఉండే ఈ ప్రాంతాల్లో నివ‌సించిన ఒక వ్య‌క్తి పెట్టిన ప్రెస్ మీట్ ఇప్పుడు పెద్ద ఎత్తున క‌ల‌క‌లం రేపుతోంది. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. నిజ‌మా? అన్న షాక్ ను క‌లిగేలా చేస్తున్నాయి.

సయ్యద్‌ సుజా అనే సైబ‌ర్ నిపుణుడు ఒక‌రు.. ఈవీఎంల‌ను హ్యాక్ చేసి త‌మ‌కు అనుకూలంగా ఫ‌లితాలు వ‌చ్చేలా చేయొచ్చంటూ ఆరోపించ‌టం ఒక ఎత్తు.. అలా చేసిన ప్ర‌య‌త్నంలో భాగంగానే 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించ‌టం జ‌రిగిందంటూ పేల్చిన బాంబు ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈవీఎంల‌ను హ్యాక్ చేయొచ్చంటూ చెబుతున్న ఆయ‌న‌.. త‌న‌ను అన్ని పార్టీలు సంప్ర‌దించిన‌ట్లుగా పేర్కొన్నారు. చివ‌ర‌కు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా త‌న‌ను సంప్ర‌దించార‌ని.. అయితే.. ఈవీఎంల‌ను హ్యాక్ చేసే విధానానికి ఎలా చెక్ పెట్టాల‌న్న‌దే వారి ఉద్దేశ‌మంటూ క్లీన్ చిట్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. మ‌రి.. సుజా చెప్పిన‌ట్లుగా ఆయ‌న్ను సంప్ర‌దించిన రాజ‌కీయ పార్టీలు ఏమేమిటి? ఆయా పార్టీల త‌ర‌ఫున సుజాతో భేటీ అయిన నేత‌లు ఎవ‌ర‌న్న విష‌యాన్ని బ‌య‌ట‌పెడితే మ‌రిన్ని విష‌యాలు బ‌య‌ట‌కొచ్చే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ప్రెస్ మీట్ పేరుతో నిర్వ‌హించిన వీడియో కాల్ లో సుజా మ‌రిన్ని ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌ను అమెరికాలో హ‌త్య చేసేందుకు వ్యూహ ర‌చ‌న చేశార‌న్నారు. న్యూయార్క్ లో త‌న‌ను హ‌త్య చేసేందుకు కొంద‌రు ఆఫ్రిక‌న్ అమెరిక‌న్ల‌ను రంగంలోకి దించిన‌ట్లుగా పేర్కొన్నారు. నాడు భార‌త్ లో ఎన్నిక‌లు ట్యాంప‌రింగ్ చేసిన వైనానికి సంబంధించిన ఆధారాల్ని అమెరిక‌న్ ప్ర‌భుత్వానికి అందించిన‌ట్లుగా చెప్పారు.

అస‌లు సుజా ఈసీఐఎల్ లో ప‌ని చేశారా? అన్న‌ది తేలాల్సి ఉంది. ఒక‌వేళ‌.. ఆయ‌న ఈసీఐఎల్ లో ప‌ని చేసింది వాస్త‌వ‌మే అయితే.. ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌ల‌కు మ‌రింత బ‌లోపేతం కావ‌టం ఖాయం. ఊహించ‌ని పిడుగు మాదిరి మారిన ఈ ప్రెస్ మీట్ రానున్న రోజుల్లో మ‌రెన్ని మ‌లుపులు తిరుగుతుందో చూడాలి.