సెక్రటేరియట్ ముందే ఆత్మహత్యాయత్నం!

Thu Oct 12 2017 10:58:51 GMT+0530 (IST)

ఏపీ ప్రజలకు దగ్గరగా ఉండి వారి సమస్యలను తీర్చేందుకే తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించి.. ఆగమేఘాలపై ఉద్యోగులను తరలించాం అని చెబుతుంటారు సీఎం చంద్రబాబు!! కానీ ప్రజలకు ఏపీ సచివాలయానికీ మధ్య దూరం పెరిగిపోతోంది! సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విన్నవించు కుందామని ఆశపడి వస్తున్న వారికి చివరకు నిరాశే మిగులుతోంది! కనీసం సమస్య ఏమిటో తెలుసుకునే సమయం కూడా ముఖ్యమంత్రితో పాటు ఇతర అధికారులకు లేకపోతోంది!  కానీ ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి.. ఎంతో దూరం నుంచి న్యాయం కోసం వచ్చినా.. న్యాయం జరగకపోగా కనీసం పట్టించుకునేవారు కరువవడంతో.. అక్కడే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.మొన్నటిమొన్న ఒక ఆర్ ఎంపీ డాక్టర్ సచివాలయం ముందు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన సంఘటన మరువక ముందే.. ఇప్పుడు ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడం అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది. ఆమె ఎవరు? ఎందుకు సచివాలయానికి వచ్చింది. ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందో తెలిస్తే `అయ్యో` అనిపించక మానదు! ఆమె పేరు వసుధ! ఆమెను విజయనగరానికి చెందిన శ్రవణ్ ప్రేమించాడు. తర్వాత ఆమెను మోసం చేశాడట. వెంటనే ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసినా ఎవరూ పట్టించుకోలేదట.

ఇక సీఎంకే నేరుగా సమస్య వివరించి.. న్యాయం పొందాలని సచివాలయానికి వచ్చింది. కానీ ఆమెను అక్కడి సిబ్బంది లోపలికి అనుమతించలేదట. దీంతో వెంటనే ఆమె తనతో తెచ్చుకున్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొద్దిసేపు సచివాలయం గేటు ముందే వసుధ కళ్లు తిరిగి పడిపోయిందట. హుటాహుటిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. మరి సామాన్యులకు సీఎం దర్శనభాగ్యం ఎప్పుడు కలుగుతుందో.. వారి సమస్యలు ఎప్పుడు తీరతాయో!!