Begin typing your search above and press return to search.

ఇలాంటి కష్టం పగోడికి వద్దు

By:  Tupaki Desk   |   3 Sep 2015 4:24 AM GMT
పేదరికం ఎంత భయంకరంగా ఉంటుందన్న దానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. మానవత్వం ఉన్న ప్రతిఒక్కరిని కదిలించే ఈ ఉదంతం గురించి విన్నప్పుడు.. ఇలాంటి కష్టం పగోడికి కూడా రాకూడదనిపించటం ఖాయం. ఊరి నుంచి బతుకు కోసం నగరానికి వచ్చే వారి బతుకులు ఎంత దారుణంగా ఉంటాయో తెలిపే వైనమిది. చేతిలో డబ్బుల్లేక.. సాయం అందించే అపన్నహస్తం లేక.. ఒక వ్యక్తి పడిన వేదన విన్నప్పుడుకంట కన్నీరు రావటం ఖాయం.

హైదరాబాద్ లోని కాటేదాన్ లో భార్య పిల్లలతో బతుకు బండిని లాగిస్తున్నాడు మమ్మద్ షఫి. లారీ క్లీనర్ గా పని చేసే ఇతడికి ఇద్దరు పిల్లలు. భార్య మరోసారి గర్భవతి అయ్యింది. ఎప్పటి మాదిరే పని కోసం షఫి వెళితే.. నిండు గర్భవతి అయిన 35 ఏళ్ల ముష్రత్ బేగ్ దగ్గర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లింది. ఆడపిల్లకు జన్మనిచ్చిన ఆమె చనిపోయింది. ఆమె వెంట ఎవరూ లేకపోవటంతో ఆసుపత్రి సిబ్బంది ఆమె శవాన్ని ఒక మూలకు పెట్టేశారు.

పని నుంచి తిరిగి వచ్చిన షఫి.. ఆసుపత్రికి వెళ్లాడు. అప్పటికే భార్య చనిపోయిందన్న విషయం తెలుసుకొని భోరున విలపించాడు. శవాన్ని భుజాన వేసుకొని ఇద్దరు కొడుకులు.. పసిగుడ్డు వెంట బెట్టుకొని తన స్వగ్రామాన్ని (ఉట్కూరు) చేరుకునేందుకు రాయచూర్ బస్సు ఎక్కాడు. అయితే జేబులో డబ్బుల్లేక పాలమూరు వరకే టిక్కెట్టు తీసుకున్నాడు. తన భార్య బాలింత అని చెప్పి వెనక సీట్లో పడుకోబెట్టిన అతగాడు.. పాలమూరు బస్టాండ్ లో దిగి.. గేటు పక్కన శవాన్ని పడుకోబెట్టి.. పిల్లలతో కలిసి రోదిస్తూ కూర్చుండిపోయాడు. కట్టెలా బిగుసుకుపోయిన తల్లిని చూస్తూ.. ఏమైందో అర్థం కాక బిక్కముఖం వేసిన పిల్లల్ని చూస్తే.. ఎంత కఠినాత్ముడైనా కరిగిపోయే పరిస్థితి.

సమ్మెలో ఉన్న ఆర్టీసీ సిబ్బంది విషయాన్ని తెలుసుకొని.. చలించిపోయి.. అప్పటికప్పుడు డబ్బు వసూలు చేస్తే రూ.8వేలు వచ్చాయి. అవి షఫి చేతిలో పెట్టి అతడ్ని ఆటోలో స్వగ్రామం ఉట్కూరు పంపారు. ఈ ఘటన గురించి తెలిసి.. సీఐ వచ్చి పసిపాపను ప్రభుత్వ అధికారులకు అప్పజెప్పారు. ఇక.. మృతి చెందిన ముష్రత్ బేగ్ డెలివరీ అయిన ఆసుపత్రి కోసం పోలీసులు వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెకు సరైన వైద్యం కల్పించారా? లేదా? అన్న విషయంతో పాటు.. చనిపోయిన తర్వాత కేసు పెట్టకుండా.. శవాన్ని తీసుకువెళుతున్నా ఏం చేశారన్న ప్రశ్నలపై విచారణ వ్యక్తం చేస్తున్నారు. కేవలం ధనార్జన మాత్రమే మరిగిన ఆసుపత్రులకు కూసింత మానవత్వం ఉంటుందనుకోవటం అత్యాశే అవుతుందేమో.