ఇదేం ఘోరం..సాఫ్ట్ వేర్ ఉద్యోగిని చంపిన హైదరాబాద్ మెట్రో

Sun Sep 22 2019 21:18:20 GMT+0530 (IST)

అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టు అని గర్వంగా భావిస్తున్న హైదరాబాదు మెట్రో ఊహించని రీతిలో ఒక యువతి ప్రాణాన్ని బలితీసుకుంది. టీసీఎస్ లో పనిచేసే 24 సంవత్సరాల మౌనిక అనే యువతి అమీర్ పెట్రో పైకప్పు పెచ్చులూడి దుర్మరణం చెందారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల హైదరాబాదు మెట్రో అమీర్ పేట్ స్టేషన్ పైకప్పు నుంచి కొన్ని ముక్కలు విరిగిపడ్డాయి. అవి మౌనిక తలమీద అంతెత్తు నుంచి పడటంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. తీవ్రగాయాలు కావడంతో వెంటనే స్థానికులు అక్కడి నుంచి ఆమెను ఆస్పత్రికి తరలించారు.బలమైన గాయాలు తగలడంతో మౌనిక ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. యువతి ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఆమె కూకట్ పల్లిలో నివసిస్తున్నారు. అమీర్ పేట వైపు పని మీద వచ్చినపుడు వర్షం పెద్దగా పడటంతో తడవకుండా ఉండొచ్చని స్టేషన్ కింద వేచి ఉన్నారు. ఆమెతో పాటు ఎంతో మంది అక్కడే ఉన్నారు. దురదృష్టవశాత్తూ పెచ్చుల్లో ఒక పెద్ద పలక ఆమె తలపై బలంగాపడింది. దీంతో ఆమె తీవ్రగాయాల పాలై దుర్మరణం చెందింది.

అయినా ఏడాది క్రితమే ప్రారంభమైన అమీర్ పేట మెట్రో స్టేషను పైకప్పులు ఊడిపడటంతో ప్రజలు షాక్ తింటున్నారు. వందేళ్లు నిలబడే నాణ్యతతో కట్టాం అని చెబుతున్న ఈ ప్రాజెక్టులో పైకప్పు పెచ్చులు ఏడాదికే ఊడటం ఏంటో అని అవాక్కయ్యే పరిస్థితి. ఉత్తి పుణ్యాన ఒక ప్రాణం పోయింది. చక్కగా చదువుకుని కుటుంబానికి అండగా నిలబడిన ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయి జీవితంలో అచ్చటముచ్చట తీరకుండానే అర్ధంత రంగా ముగిసంది. ఈ దుర్ఘటన స్థానికంగా ఉన్నవారిని తీవ్రంగా కలచివేసింది.

TAGS: