Begin typing your search above and press return to search.

97శాతం మంది ఎమ్మెల్యేలు కోటీశ్వ‌రులే

By:  Tupaki Desk   |   17 May 2018 7:15 AM GMT
97శాతం మంది ఎమ్మెల్యేలు కోటీశ్వ‌రులే
X
దేశం చూపును త‌న‌వైపు తిప్పుకొంటున్న క‌న్న‌డ ఎన్నిక‌లు అనేక ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌ను పంచుతున్నాయి. ఓవైపు సీఎం పీఠంపై ఆయా పార్టీల ఎత్తులు, పై ఎత్తులు కొన‌సాతుండ‌గానే మ‌రోవైపు అక్క‌డి ఎమ్మెల్యేల గురించి కొత్త సంగ‌తులు తెలుస్తున్నాయి. తాజాగా అక్క‌డి ఎమ్మెల్యేల ప్ర‌త్యేక‌మైన రికార్డ్ వెలుగులోకి వ‌చ్చింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన ఎమ్మెల్యేల్లో 97 శాతం మంది కోటీశ్వరులట. ఈ విషయాన్ని కర్నాటక ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పరిశోధన సంస్థ వెల్లడించింది.

క‌ర్ణాట‌క అసెంబ్లీకి తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల ద్వారా కొత్తగా ఎన్నికైన 221 మంది ఎమ్మెల్యేల్లో.. 215 మంది కోటీశ్వరులున్నారని కర్నాటక ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తేల్చింది. ప్రతి ఎమ్మెల్యే సగటు ఆస్తులు సుమారు 35 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 2013లో అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల సగటు ఆస్తుల కన్నా .. ప్రతి ఎమ్మెల్యేకు 11 కోట్ల ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని అని తేలింది. ఈసారి ఎన్నికైన వారిలో సగం మంది ఎమ్మెల్యేల్లో ప్రతి ఒక్కరి ఆస్తి కనీసం 10 కోట్లు ఉంటుందన్నారు. ఎలక్షన్ అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చామ‌ని స‌ద‌రు సంస్థ వివ‌రించింది.

ఇక పార్టీల ప‌రంగా చూస్తే సంపన్న ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఆ పార్టీ నుంచి ఎన్నికైన వారిలో 99 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోని ప్రతి ఎమ్మెల్యే సగటు ఆస్తి సుమారు 60 కోట్లు ఉంటుంది. బీజేపీ పార్టీలో ఉన్న వారిలో 98 శాతం మంది కోటీశ్వరులున్నారు. అందులో ప్రతి ఎమ్మెల్యే ఆస్తి సగటును సుమారు 17 కోట్లు ఉంటుంది. జేడీఎస్‌లో 95 శాతం మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులున్నారు. మొత్తంగా టాప్ టెన్ లిస్టులో కాంగ్రెస్ పార్టీ నుంచే ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండడం గమనార్హం. హోసకోట అసెంబ్లీ స్థానం నుంచి నెగ్గిన ఎన్. నాగరాజు అనే ఎమ్మెల్యే ఆస్తులు అత్యధికంగా రూ.1015 కోట్లు ఉన్నట్లు అంచనా వేశారు. 840 కోట్ల ఆస్తులతో మాజీ కాంగ్రెస్ మంత్రి డీకే శివకుమార్ రెండవ స్థానంలో ఉన్నారు. హెబ్బల్ స్థానం నుంచి గెలిచిన బీఎస్ సురేశ్ 416 కోట్లతో మూడవ స్థానంలో ఉన్నారు.