Begin typing your search above and press return to search.

చెన్నై కుర్రాళ్ల లగ్జరీ బలుపు రేసింగ్

By:  Tupaki Desk   |   27 Feb 2017 12:54 PM GMT
చెన్నై కుర్రాళ్ల లగ్జరీ బలుపు రేసింగ్
X
అంతులేని సంపద.. అంతకు మించిన అధికారం ఉంటే చాలు.. కళ్లు తలెకెక్కిపోవటం మామూలే. ఇలాంటి వారికి బలుపు కూడా యాడ్ అయితే.. పట్టపగ్గాలు ఉండవు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే.. తమకు ఎదురే లేరన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. వారికి తమ పరపతి పవర్ చూపించి దడ పుట్టిస్తుంటారు. అలాంటి వారిలో కొందరికి చెన్నై పోలీసులు చుక్కలు చూపించారు. అయితే.. అంతకు ముందు సంపన్నుల పిల్లలు చాలా వేషాలు వేశారని చెప్పాలి.

అసలేం జరిగిందన్న విషయాన్ని చెప్పే ముందు ముందు ఈసీఆర్ రోడ్డు గురించి కాసింత చెప్పాలి. చెన్నై నుంచి పుదుచ్చేరికి వెళ్లే ఈసీఆర్ రోడ్డు మార్గం ఉంది. విశాలమైన రోడ్లతో పాటు.. తళతళలాడేలా నున్నగా ఉండే రహదారులు.. ఓపక్క సముద్రంతో సీన్ అదిరిపోయేలా ఉంటుంది. అలాంటి రమణీయతను సంపన్నుల పిల్లలు తమ డబ్బు బలుపును ప్రదర్శించుకునేందుకు కార్ రేసింగ్ నిర్వహిస్తుంటారు.

అనుకోని రీతిలో ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే స్పందించే పోలీసులు..విడి రోజుల్లో పెద్దగా పట్టించుకోరు. ఎవరిని టచ్ చేస్తే.. ఎక్కడి నుంచి ఫోన్ వస్తుందన్న భయంతో కాస్త ఆచితూచి వ్యవహరిస్తుంటారు. తాజాగా ఇలాంటి పరిస్థితే ఉంది. కాకుంటే.. పదిహేను లగ్జరీ కార్లు (ఒక్కొక్కటి లక్షలాది రూపాయిలు ఉంటాయన్నది అంచనా) రేసింగ్ పెట్టుకున్నాయి. రోడ్డు పక్కన కాదు.. దూరాన ఉండే వారికి కూడా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే వేగంతో దూసుకెళ్లిన వైనం.. అక్కడి స్థానికుల్లో గుబులు రేపింది. వెంటనే వారు.. ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు.

ఎప్పుడూ లేని విధంగా ఫిర్యాదుల జోరు ఎక్కువగా ఉండటంతో.. లగ్జరీ రేసింగ్ మీద దృష్టి పెట్టారు. మితిమీరిన వేగంతో పోలీసులకే వణుకు పుట్టించేలా ప్రయాణిస్తున్న వైనాన్ని గుర్తించి ఉన్నతాధికారులు.. పోలీసులు రంగంలోకి దిగారు. కార్లను నిలువరించే ప్రయత్నం చేస్తే.. వారిని అస్సలు లెక్క చేయలేదు. దీంతో.. పోలీసులకు ఒళ్లు మండింది. వెంటనే కానాత్తూరు దాటాక వచ్చే టోల్ గేట్ వద్ద కార్లు వచ్చే సమయానికి వాటిని అడ్డుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.

అప్పటికే ఐదు కార్లు టోల్ గేట్ ను దాటిపోవటంతో పదికార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమను చుట్టుముట్టటంపై సంపన్నుల పిల్లలకు ఈగో హర్ట్అయ్యింది.పోలీసులపై ఒంటికాలిపైన లేచారు. అంతలో ఒక కారులో వ్యక్తి అయితే.. ఏకంగా పోలీసు మీదకే కారును దూసుకెళ్లేలా చేసి.. అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనలో పోలీసు గాయపడటంతో పోలీసులకు కాలిపోయింది. వెంటనే.. తమ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ.. తొమ్మిది కార్లను చుట్టుముట్టి..అందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు భారీ వార్నింగ్ లు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉన్నతస్థానాల్లో ఉన్న వారి చేత ఫోన్లు చేయించారు. అయినప్పటికీ పోలీసులు వెనక్కి తగ్గలేదు. వెబ్ సైట్లలోనూ.. ఫారిన్ ఛానళ్లలో మాత్రమే కనిపించే లగ్జరీ కార్లు తమ కళ్ల ముందు కనిపించటంతో.. ఈ కార్లను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. పోలీస్ స్టేషన్ వరకూ విజయవంతంగా తీసుకెళ్లిన ఈ బలుపు కుర్రాళ్లపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

http://www.tupaki.com/photogallery/actress/Pragya-Jaiswal-New-Photos/2489