Begin typing your search above and press return to search.

దేశంలో సంప‌న్నులు ఓ రేంజ్లో పెరుగుతున్నార‌ట‌!

By:  Tupaki Desk   |   26 Sep 2018 5:03 AM GMT
దేశంలో సంప‌న్నులు ఓ రేంజ్లో పెరుగుతున్నార‌ట‌!
X
దేశంలో సంప‌న్నుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. అది కూడా ఎంత‌లా అంటే.. అంచ‌నాల‌కు మించి. ఏడాది వ్య‌వ‌ధిలో వెయ్యి కోట్లకు పైగా సంప‌న్న భార‌తీయుల జాబితాను త‌యారు చేస్తే అందులో 2017లో 617 మంది ఉంటే.. ఈ ఏడాది అది కాస్తా 831కు చేర‌టం గ‌మ‌నార్హం. జాబితాలో ఉన్న సంప‌న్నుల సంప‌ద మొత్తాన్ని క‌లిపితే అది దేశ స్థూల జాతీయోత్ప‌త్తిలో పావు శాతంగా ఉండ‌టం విశేషం.

అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి అంచ‌నాల ప్ర‌కారం భార‌త జీడీపీ 2.85 ట్రిలియ‌న్ డాల‌ర్లుగా చెబుతున్నారు. ఇందులో సంప‌న్నుల సంప‌ద ఏకంగా 719 బిలియ‌న్ డాల‌ర్లు ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇక‌..సంప‌న్న భార‌తీయుల్లో వ‌రుస‌గా ఏడోసారి రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ ఛైర్మ‌న్ ముకేశ్ అంబానీ టాప్ వ‌న్ పొజిష‌న్లో నిలిచారు. ఆయ‌న సంప‌ద ఏకంగా రూ.3,71,000 కోట్లుగా లెక్క తేల్చారు.

ఈ లెక్క‌ల‌న్నింటిని బార్ క్లేస్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2018 లెక్క తీసింది. భార‌తీయ సంప‌న్నుల‌కు సంబంధించి ఎన్నో ఆస‌క్తిక‌ర అంశాల్ని ఈ అధ్య‌య‌నం వెల్ల‌డించింది. వెయ్యి కోట్ల‌కు పైగా సంప‌ద ఉన్న పారిశ్రామిక దిగ్గ‌జాలు 2017లో 617 మంది ఉంటే.. ఈ ఏడాదికి వారి సంఖ్య 831కి పెరిగిన‌ట్లు పేర్కొంది.

గ‌తంలో ఎప్పుడూ లేనంత సంప‌ద సృష్టి జ‌రుగుతోంద‌ని.. గ‌తంతో పోలిస్తే ప్ర‌స్తుతం సంప‌ద‌ను స‌మ‌కూర్చుకోవ‌టానికి ప‌ట్టే వ్య‌వ‌ధి చాలా త‌గ్గిపోయిన‌ట్లు వెల్ల‌డైంది. వెయ్యి కోట్ల‌కు పైగా సంప‌ద ఉన్న భార‌తీయుల సంఖ్య 34 శాతం పెరిగిన‌ట్లు లెక్క క‌ట్టింది. అత్యంత సంప‌న్నుల న‌గ‌రంగా ముంబ‌యి నిలిచింది. వెయ్యి కోట్ల‌కు పైగా సంప‌ద ఉన్న వారు 233 మంది ఉన్న‌ట్లు తేల్చారు. త‌ర్వాతి స్థానం 163 మందితో న్యూఢిల్లీ.. మూడోస్థానంలో బెంగ‌ళూరు 70 మందితో నిలిచిన‌ట్లుగా వెల్ల‌డించింది. వాస్త‌విక అంశాల‌తో పోలిస్తే.. ఈ అంకెలు ఎంత త‌ప్పు అన్న‌వి ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఎక్క‌డివ‌ర‌కో ఎందుకు ఇటు హైద‌రాబాద్‌.. అటు విజ‌య‌వాడ‌.. మ‌రోవైపు ఉన్న విశాఖ‌ప‌ట్నంలో మీకు తెలిసిన టాప్ సంప‌న్నుల ఆస్తుల లెక్క‌ను మార్కెట్ వాల్యూ ప్ర‌కారం చూస్తే.. ఈ అంచ‌నాల‌కు మించిన సంప‌ద దేశంలో ఉన్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ జాబితాలో చోటు సాధించిన అతి పిన్న వ‌య‌స్కుడు ఓయో రూమ్స్ వ్య‌వ‌స్థాప‌కుడు రితేష్ అగ‌ర్వాల్ గా చెబుతున్నారు. అత‌డి వ‌య‌సు కేవ‌లం 24 ఏళ్లు మాత్ర‌మే. ఎండీహెచ్ మ‌సాలా వ్య‌వ‌స్థాప‌కుడు ధ‌ర‌మ్ పాల్ గులాటి అత్య‌ధిక వ‌య‌స్కుడిగా పేర్కొన్నారు. ఆయ‌న వ‌య‌సు 95 ఏళ్లు. ఇక‌.. సంప‌న్నుల జాబితాలో ఉన్న వారి వ్యాపారాల్ని చూస్తే.. ఫార్మా రంగానికి చెందిన వారు అత్య‌ధికంగా 14 శాతం మంది ఉంటే.. ఐటీ.. స‌ర్వీసుల విభాగానికి చెందినోళ్లు 7.9 శాతం ఉన్న‌ట్లుగా తేల్చారు.

భార‌తీయ అప‌ర సంప‌న్నుడు అంబానీ ఫ‌స్ట్ ప్లేస్ లో నిలిస్తే.. రెండో స్థానంలో ఎస్ పీ హిందూజా కుటుంబం (రూ.1.59ల‌క్ష‌ల కోట్లు).. మూడో స్థానంలో ల‌క్ష్మీ మిత్త‌ల్ (రూ.1.14 ల‌క్ష‌ల కోట్లు) నిలిచారు. 2017లో జాబితాతో పోలిస్తే.. గ్రాఫైట్‌ ఇండియా యాజమాని కృష్ణ కుమార్‌ బంగూర్‌ సంపద ఏకంగా 430 శాతం వృద్ధి చెంద‌టం గ‌మ‌నార్హం.