Begin typing your search above and press return to search.

టైమ్స్ మెగా పోల్ సర్వే: మోడీకే పట్టం

By:  Tupaki Desk   |   21 Feb 2019 9:02 AM GMT
టైమ్స్ మెగా పోల్ సర్వే: మోడీకే పట్టం
X
ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా నరేంద్రమోడీకి పేరుంది. ఇప్పుడు మోడీ మెడలో మరో కలికితురాయి చేరింది. దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన ‘టైమ్స్’ మెగా పోల్ సర్వే నిర్వహించింది. ఫిబ్రవరి 11-20 మధ్య దేశంలో అత్యంత విశ్వసనీయత, నమ్మకం కలిగిన నేత ఎవరు అని ఓటింగ్ పెట్టింది. ఈ పోల్ లో దేశంలోనే అత్యంత విశ్వసనీయత గల రాజకీయ నాయకుడిగా మోడీ నిలవడం విశేషం. మూడింట రెండు వంతుల మంది మోడీకే ఓటేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మోడీయే తదుపరి పీఎం అంటూ వారంతా స్పష్టం చేయడం గమనార్హం.

మోడీ తన ఐదేళ్ల పాలనలో చెరగని ముద్ర వేశారు. జనాల్లో భారీ ఆశలు రేపి కొంతవరకు నెరవేర్చాడు. ఈ పోల్ లో దాదాపు 83శాతం మంది తదుపరి ప్రధానమంత్రిగా ఎంచుకున్నారంటే మోడీ స్టామినాను అర్తం చేసుకోవచ్చు. దేశంలోని వివిధ వర్గాలు, జనాభా నుంచి సేకరించిన ఈ సర్వే ప్రకారం.. దేశంలోని అందరు రాజకీయ నేతల కంటే కూడా మోడీ ముందున్నారు. మోడీ దరిదాపుల్లో కూడా మరో నాయకుడు లేకపోవడం విశేషంగా చెప్పవచ్చు.

ఇక టైమ్స్ మెగా పోల్ సర్వేలో రెండో స్థానంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలిచారు. ఈయనకు 8.33శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక మూడో స్థానంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 1.44శాతం ఓటింగ్ తో నిలిచారు. 2014 ఎన్నికలతో పోలిస్తే రాహుల్ స్టామినా మరింత దిగజరాడం విశేషం. అప్పుడు 31శాతం మంది రాహుల్ నాయకత్వాన్ని సమర్థించగా.. ఇప్పుడు ఆ స్థాయి మరింత పడిపోయింది.

టైమ్స్ పోల్ దేశవ్యాప్తంగా 9 భిన్న భాషలు కలిగిన రాష్ట్రాల్లో ఈ సర్వే నిర్వహించింది.. ఈ ఐదేళ్లలో నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మేళ్లు, పథకాలపై ప్రశ్నలు అడిగారు. దీనికి ఆశ్చర్యకరంగా దాదాపు 59.51శాతం మంది మోడీ పాలన చాలా బాగుందని కితాబివ్వడం విశేషం. మోడీని సపోర్టు చేయడానికి ప్రధాన కారణం ఏంటని మెజార్టీ ప్రజలను అడిగినప్పుడు .. ‘34.39శాతం మంది మోడీ పేద ప్రజలకు ప్రవేశపెట్టిన పథకాలు, వాటి సౌకర్యాల వల్లనే మద్దతిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక రామమందిర నిర్మాణాన్ని మోడీ నెరవేర్చలేదని.. అందుకే మద్దతివ్వడం లేదని 35.72శాతం మంది పేర్కొన్నారు.

ప్రస్తుతం ట్రెండింగ్ వివాదమైన రాఫెల్ పై సర్వేలో ప్రశ్నించగా.. ఇది 17.5శాతం రానున్న ఎన్నికల్లో ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలున్నాయని చెప్పారు.. ఇక 74.6శాతం మంది మాత్రం రాఫెల్ బీజేపీ కొంప ముంచడం ఖాయమని కుండబద్దలు కొట్టారు.