Begin typing your search above and press return to search.

80ల‌క్ష‌ల మందిని వ‌ణికిస్తున్న కొమెన్

By:  Tupaki Desk   |   3 Aug 2015 11:51 AM GMT
80ల‌క్ష‌ల మందిని వ‌ణికిస్తున్న కొమెన్
X
అలా వ‌చ్చి ఇలా పోతుంద‌ని భావించిన కొమెన్ తుపాను కొంప‌ముంచింది. ప‌శ్చిమ‌బెంగాల్‌.. ఒడిశా.. జార్ఖండ్‌.. మ‌ణిపూర్.. రాజ‌స్థాన్.. గుజ‌రాత్ రాష్ట్రాలను తీవ్ర ప్ర‌భావితం చేసిన కొమెన్‌.. ప‌శ్చిమ‌బెంగాల్ ను ఒక ఊపు ఊపేసింది.

జాతీయ ర‌హ‌దారుల మీద ప‌ది అడుగుల నీరు నిలిచిపోయిందంటే ప‌రిస్థితి తీవ్ర‌త ఇట్టే తెలుస్తుంది. అంతేకాదు.. బెంగాల్ ముఖ్య‌మంత్రి ఆదివారం రాత్రి మొత్తం కోల్ కతాలోని త‌న ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలోనే ఉండి.. స‌హాయ‌క చ‌ర్య‌లు ఊపందుకునే చ‌ర్య‌లు మొద‌లు పెట్టారు.

కొమెన్ తీవ్ర‌త తెలియాలంటే మ‌రో గ‌ణాంకాన్ని ప్ర‌స్తావించాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ తుఫాను కార‌ణంగా మొత్తం ఐదు రాష్ట్రాల్లో దాదాపు 80 ల‌క్షల‌కు పైగా ప్ర‌జ‌ల నిరాశ్ర‌యుల‌య్యార‌ని చెబుతున్నారు. ఎడ‌తెగ‌కుండా పడుతున్న వాన‌ల‌తో దాదాపు వంద‌ మందికి పైనే మ‌ర‌ణించార‌ని చెబుతున్నారు. మృతుల్లో ఎక్కువ‌గా ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నార‌ని చెబుతున్నారు.ఈ రాష్ట్రంలో దాదాపు 50 మందికి పైనే మ‌ర‌ణించి ఉంటార‌ని ఒక అంచ‌నా.

ఇక‌.. మ‌ణిపూర్ లో కొండ‌చ‌రియ‌లు విరిగి ఇర‌వై మంది ప్రాణాలు కోల్పోయార‌ని చెబుతున్నారు. ఇళ్లు.. దేవాల‌యాలు.. ఆఫీసులు.. వాణిజ్య ప్రాంతాలు ఇలా ఒక‌ట‌ని కాకుండా అన్నీ ప్రాంతాల్లోకి వ‌ర‌ద నీరు నిలిచిందంటే.. తుపాను కార‌ణంగా ప‌డిన వ‌ర్షం ఎంత భారీగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక న‌దులు ప్ర‌మాద‌క‌ర స్థాయిలో పొంగిపొర్లుతుంటే.. లోత‌ట్టు ప్రాంతాలు పూర్తిగా జ‌ల‌మ‌య‌మైన ప‌రిస్థితి. స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు కోసం ఎంత‌గా ప్ర‌య‌త్నిస్తున్నా.. వాతావ‌ర‌ణం స‌హ‌క‌రించ‌టం లేదంటున్నారు. దీనికితోడు.. తుపాను తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో.. బాధితుల సంఖ్య సైతం భారీగా ఉండ‌టంతో.. స‌హాయ చ‌ర్య‌లు అంద‌టం ఆల‌స్య‌మ‌వుతోంది. తుపాను ప్ర‌భావిత రాష్ట్రాల్లో అధికార‌యంత్రాంగం బాధితుల‌కు సాయం అందే విష‌యంలో ప్ర‌త్యేక దృష్టి సారించి.. సాయం అందించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.