Begin typing your search above and press return to search.

పాక్ ను ఎలా డీల్ చేయాలంటే..

By:  Tupaki Desk   |   24 Sep 2016 1:02 PM GMT
పాక్ ను ఎలా డీల్ చేయాలంటే..
X
ఉరీ సైనిక స్థావరం మీద పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడి నేపథ్యంలో పాకిస్థాన్ అంటేనే భారతీయులు మండిపడుతున్న పరిస్థితి. దాయాది దేశాన్ని దెబ్బ తీయాలన్నట్లుగా ప్రతిఒక్క భారతీయుడు తపిస్తున్నారు. అత్యంత దారుణంగా జరిపిన ఉగ్రదాడిలో మొత్తంగా 20 మంది సైనికులు మరణించటంపై జాతి యావత్ తీవ్ర ఆగ్రహానికి.. భావోద్వేగానికి గురైంది.

ఈ ఘటనపై మోడీ సర్కారు సీరియస్ కావటమే కాదు.. పాక్ కు తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు ఉన్న మార్గాలన్నింటి మీదా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక ప్రముఖ న్యూస్ యాప్ ఆన్ లైన్లో ఒక సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో పాక్ తో భారత్ ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలన్న ప్రశ్నతో పాటు.. దౌత్య సంబంధాల్ని తెంచుకోవాలని భావిస్తున్నారా? అన్న ప్రశ్నను సంధించారు. వీటితో పాటు.. దేశంలో జరుగుతున్న ఉగ్రదాడులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైనదా? అన్న ప్రశ్నతో పాటు.. ఉరీ ఘటనపై భారత్ ఎలా రియాక్ట్ అయితే బాగుండన్న ప్రశ్నను కూడా వేశారు.

వేలాదిగా పాల్గొన్న ఈ సర్వేలో వెల్లడైన అంశాల్ని తాజాగా సదరు యాప్ వెల్లడించింది.పాక్ తో భారత్ కు ఉన్న అన్నిదౌత్య సంబంధాల్ని తెంచుకోవాలని 70 శాతం మంది అభిప్రాయపడగా.. 21 శాతం మాత్రం మంచిది కాదని పేర్కొన్నారు. 9 శాతం మంది తాము ఏమీ చెప్పలేమన్నారు.

ఇక.. దేశంలో జరుగుతున్న ఉగ్రదాడుల మీద ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తమైంది. 58 శాతం మంది ప్రభుత్వ తీరు సరిగాలేదని వ్యాఖ్యానించారు. ఇక.. ఉరీ ఘటనపై భారత్ ఎలా రియాక్ట్ అయితే బాగుండన్న ప్రశ్నకు.. 49 శాతం మంది కోవర్ట్ ఆపరేషన్ చేపట్టాలని చెబితే.. 44 శాతం మంది మిలటరీ ఆపరేషన్ చేయాలని పేర్కొన్నారు. 7 శాతం మంది మాత్రం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాక్ సాయం తీసుకోవాలన్నారు. ఈ ఆన్ లైన్ సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు మెట్రో నగరాల(ఢిల్లీ.. బెంగళూరు.. ముంబయి.. చెన్నై.. కోల్ కతా.. ఫూణె.. హైదరాబాద్)కు చెందిన వారు ఉండటం గమనార్హం.