Begin typing your search above and press return to search.

ఓర్నీ.. సీఎం కారు నెంబ‌ర్ని కొట్టేశారు

By:  Tupaki Desk   |   14 Jun 2018 5:19 AM GMT
ఓర్నీ.. సీఎం కారు నెంబ‌ర్ని కొట్టేశారు
X
బ‌రితెగింపున‌కు ప‌రాకాష్ఠ‌. బొత్తిగా భ‌యం.. భ‌క్తి లేనిత‌నానికి ఇంత‌కు మించిన ఉదాహ‌ర‌ణ మ‌రింకేమీ ఉండ‌దేమో. ఏకంగా తెలంగాణ‌ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అధికారికంగా ప్ర‌యాణించే కారు నెంబ‌ర్ని కొట్టేసిన ఘ‌నులు హైద‌రాబాద్ రోడ్ల మీద ద‌ర్జాగా తిరుగుతున్న వైనం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌రింత‌మంది ట్రాఫిక్ పోలీసులు.. పోలీసు ఉన్న‌తాధికారులు.. ఆర్టీవో అధికారులు ఏం చేస్తున్న‌ట్లు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. సంచ‌ల‌నంగా మారిన వైనం లోతుల్లోకి వెళితే..

సీఎం కాన్వాయ్ లో ఆరు కార్లు ఉంటాయి. ఒకే రంగులో.. అచ్చుగుద్దిన‌ట్లు ఒకేలా ఉండే ఈ కార్ల‌కు.. ఒకే నెంబ‌ర్ని ఉంచుతారు. భ‌ద్ర‌తా చ‌ర్య‌ల్లో భాగంగా ఈ విధానాన్ని పాటిస్తారు. సీఎం ప్ర‌యాణించే ఆరుకార్ల‌కు ఒకే నెంబ‌రు ఉన్న‌ప్పుడు.. అదే నెంబ‌ర్ని మేం మాత్రం ఎందుకు పెట్టుకోకూడ‌ద‌ని భావించారేమో కానీ.. దాదాపు అదే నెంబ‌రుతో మ‌రిన్ని కార్లు రోడ్ల మీద ద‌ర్జాగా తిరుగుతున్న వైనం సాక్ష్యంతో స‌హా బ‌య‌ట‌కువ‌చ్చింది.

సీఎం కారు నెంబ‌ర్ని కొట్టేసిన ఈ కేటుగాళ్ల బ‌రితెగింపు ఎంత‌వ‌ర‌కూ వెళ్లిందంటే.. దొంగ కారు నెంబ‌రుతో రోడ్ల మీద ఇష్టారాజ్యంగా ప‌రుగులు తీస్తూ.. చ‌లానాల మీద చ‌లానాలు న‌మోద‌య్యేలా చేస్తున్నాయి. ప‌రిమితికి మించిన వేగంతో రాజ‌ధాని రోడ్ల మీద దూసుకెళుతున్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
చాలామందికి సుప‌రిచిత‌మైన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప్ర‌యాణించే అధికారిక కారు నెంబ‌రు టీఎస్ 09 కె 6666. సామాన్యుల‌కే బాగా తెలిసిన ఈ కారు నెంబ‌ర్ని త‌మ కార్ల‌కు పెట్టేసుకొని ద‌ర్జాగా తిరుగుతున్నా అధికారులు ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం ఇప్పుడు షాకింగ్ గా మారింది. సీఎం కారు నెంబ‌రును న‌కిలీ ప్లేట్లను బిగించుకున్న ఏడు కార్లు హైద‌రాబాద్‌లో తిరుగుతున్న‌ట్లుగా అనుమానిస్తున్నారు.

అయితే.. ఇది కేవ‌లం అంచ‌నా మాత్ర‌మే. ఎందుకంటే.. సీఎం కారు నెంబ‌ర్ని కొట్టేసి త‌మ వాహ‌నాల‌కు పెట్టుకొని తిరుగుతున్న‌వారిలో ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డిన‌ట్లుగా గుర్తించి ఫైన్లు వేశారు. ఫైన్లు ప‌డిన కార్లు కావ‌టంతో వీరి భాగోతం బ‌య‌ట‌కు వ‌చ్చింది. గుట్టుచ‌ప్పుడు కాకుండా సీఎం కారు నెంబ‌ర్లను మ‌రికొంద‌రు ఇదే రీతిలో దుర్వినియోగం చేస్తున్నారా? అన్న‌ది ఇప్పుడు సందేహంగా మారింది.

సీఎం భ‌ద్ర‌త‌కు సైతం పెను ముప్పుగా ప‌రిణ‌మించే ఈ వ్య‌వ‌హారంపై పోలీసులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న పేరుంది. సీఎం కాన్వాయ్ లోని వాహ‌నాల నెంబ‌ర్ ప్లేట్లు వేరే వాహ‌నాల మీద‌కు ఎందుకు వ‌చ్చింది? ఎవ‌రు ఇంత బ‌రితెగింపున‌కు పాల్ప‌డ్డారు? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ల‌భించ‌ని దుస్థితి.

తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల రికార్డుల ప్ర‌కారం సీఎం కారు నంబ‌రుతో ఏడు న‌కిలీ వాహ‌నాల‌పై చ‌లాన్లు జారీ అయ్యాయి. టీఎస్‌09 కె 6666 పేరు మీద ఏడు చ‌లానాలు ఉన్నాయి. ఇందులో ఆరు అతి వేగానికి సంబంధించిన చ‌లానాలు. మ‌రి.. ఈ మొత్తాన్ని ఎవ‌రు చెల్లిస్తార‌న్న‌ది ఒక ప్ర‌శ్న అయితే..సీఎం కారు నెంబ‌ర్ని కొట్టేసి ద‌ర్జాగా తిరుగుతున్న కేటుగాళ్ల‌ను అదుపులోకి తీసుకోవాల‌ని పోలీసుల ఉన్న‌తాధికారులు సిబ్బందికి ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశారు.

సీఎం కేసీఆర్ ప్ర‌యాణించే కార్ల కాన్వాయ్ లో రెండు టొయోటో ఫ్రొడో.. కాగా.. నాలుగు పార్చూన‌ర్ వాహ‌నాలు. అయితే.. సీఎం కారు నెంబ‌రును కొట్టేసి త‌మ కార్ల‌కు పెట్టేసుకున్న కార్ల‌ను చూస్తే.. అవ‌న్నీ బెంజ్‌.. ఫార్చున‌ర్.. వోల్వో.. వోక్స్ వాగ‌న్ లాంటి ఖ‌రీదైన కార్లు కావ‌టం గ‌మ‌నార్హం. ఇవేమీ సీఎం కాన్వాయ్ లోని కార్లు కాక‌పోవ‌టం గ‌మ‌నార్హం. ట్రాఫిక్ చ‌లానాల్ని త‌ప్పించుకోవ‌టానికి ఈ త‌ర‌హా విధానాన్ని అనుస‌రించి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. అయితే.. ఇది సీఎం భ‌ద్ర‌త‌కు పెను ముప్పుగా ప‌రిణ‌మించే అవ‌కాశం ఉంద‌ని భ‌య‌ప‌డుతున్నారు. అయినా.. సీఎం కారు నెంబ‌ర్ని కొట్టేసిన ఘ‌న‌ల తీరు.. వారి ద‌ర్జా చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే.