యోగీజీ..పిల్లల మరణాలకు అడ్డకట్ట వేయండి!

Sat Aug 12 2017 14:43:50 GMT+0530 (IST)

దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో మరణ మృదంగం మార్మోగుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రంలో మృత్యువు కరాళ నృత్యం చేస్తోంది. గడిచిన నాలుగు రోజుల్లో ఒకే ఒక్క ఆస్పత్రిలో 63 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అది కూడా ఆ రాష్ట్ర సీఎం యోగీ ఆదిత్యనాథ్ కు అత్యంత ముఖ్యమైన గోరఖ్ పూర్ లోని ఆస్పత్రిలోనే జరగడంతో ఒక్కసారిగా దేశం మొత్తం నివ్వెరపోయింది. అసలు అక్కడ ఏం జరిగింది?  ఇప్పుడు ఏం జరుగుతోంది? అని ప్రతి ఒక్కరూ నోరెళ్లబెట్టి మరీ ఎదురు చూస్తున్నారు. ఇక గోరఖ్ పూర్ లో అయితే రోదనలు మిన్నంటుతున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు.

అసలేం జరిగిందంటే.. గోరఖ్ పూర్ లోని అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ. ఈ ఆస్పత్రికి.. రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుంది. దీంతో స్థానికంగానే కాకుండా  చుట్టుపక్కల జిల్లాలకు చెందిన అనేకమంది పేదలు వైద్యం కోసం వస్తుంటారు. ఆస్పత్రిలో రోగులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా కాంట్రాక్టును ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. అయితే కొద్ది నెలలుగా చెల్లింపులు లేకపోవడంతో సుమారు రూ.70 లక్షల బకాయిలు పేరుకుపోయాయి. పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో సదరు ప్రైవేటు సంస్థ.. ఆగస్టు 9 నుంచి ఆక్సిజన్ సరఫరా నిలిపివేసింది.

దీంతో ఇక్కడ వైద్యం కోసం వచ్చిన చిన్నారులకు ఆక్సిజన్ లభించలేదు. ఫలితంగా శనివారం ఉదయం 11 గంటల వరకు చనిపోయినవారి సంఖ్య 63కు పెరిగిందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా చిన్నారుల మెదడు వాపు వ్యాధికి చికిత్స అందిస్తున్న వార్డుల్లోనే ఈ ఘోరం ఎక్కువగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఒక్క శుక్రవారమే 60 మంది మృతి చెందారని తెలిపారు. ప్రభుత్వం నిధులు చెల్లించడంలో చేసిన నిర్లక్ష్యంతోనే చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టింది. దీనికి బాధ్యత వహిస్తూ.. సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అయితే ఈ పరిస్థితిపై సమీక్షించిన సీఎం యోగీ ఆదిత్యనాథ్ హుటాహుటిన ఆక్సిజన్ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏదేమైనా దేశంలో అతిపెద్ద రాష్ట్రంలో ఇలా జరగడం అందునా బీజేపీ పాలనా పగ్గాలు చేపట్టి పట్టుమని 10 నెలలు కూడా కాకముందే ఇంత మంది కుటుంబాల్లో చిచ్చు రేగడం అందరినీ కలిచి వేస్తోంది. దీనిపై ప్రధాని మోడీ ఎలా స్పందిస్తారో చూడాలి.