Begin typing your search above and press return to search.

ఇవాల్టి రోజు ప్రత్యేకత మీకు గుర్తుందా?

By:  Tupaki Desk   |   2 May 2016 6:26 AM GMT
ఇవాల్టి రోజు ప్రత్యేకత మీకు గుర్తుందా?
X
ఎక్కడో ఏదో జరిగితే ప్రపంచం మొత్తం ప్రభావానికి గురి అవుతుందా? అని చాలామంది ప్రశ్నిస్తుంటారు కానీ.. ప్రపంచానికి పెద్దన్న అమెరికా తీసుకునే కొన్ని నిర్ణయాలు అలాంటి పరిస్థితిని కలిగిస్తుంటాయి. అమెరికా ఒకసారి కానీ పగపడితే అదెంత తీవ్రంగా ఉంటుందన్న విషయానికి ప్రపంచానికి చెప్పటమే కాదు.. దేశాల సార్వభౌమాధికారం.. చట్టాలు లాంటి వాటిని లెక్క చేయకుండా తన అవసరాన్ని పూర్తి చేసుకుపోయే తత్వం ప్రపంచానికి చాటిచెప్పిన రోజుగా మే 2ను చెప్పాలి. సరిగ్గా 5 ఏళ్ల కిందట తమకు భయంతో వణికించిన ఒక వ్యక్తిని అంతర్జాతీయ చట్టాలకు భిన్నంగా మట్టుబెట్టిన వైనం అందరికి విస్మయానికి గురి చేసింది.

తన ఉగ్రవాద కార్యకలాపంతో వందలాది అమెరికన్లను పొట్టనబెట్టుకున్న అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ను అత్యంత కిరాతకంగా మట్టుబెట్టిన రోజుగా ‘మే 2’ను చెప్పాలి. 2001 సెప్టెంబరు 11న అమెరికా అగ్రరాజ్య ప్రతిష్ఠను మసకబారేలా చేయటమే కాదు.. అమెరికా చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజుగా నమోదు చేసేలా చేసిన బిన్ లాడెన్ అంతు చూడాలని ప్రతినబూనిన విషయం తెలిసిందే.

విమానాలతో దాడి చేసి అమెరికాను.. అమెరికా ప్రజల్ని భయంతో గజగజలాడేలా చేసిన లాడెన్ ను పట్టుకోవాలని.. అతడ్ని చంపేందుకు ప్రపంచాన్ని జల్లెడ పట్టిన అమెరికా.. లాడెన్ పాక్ లోని అబోటాబాద్ లో ఉన్నట్లు గుర్తించింది. దేశం కాని దేశంలో రహస్యంగా బతుకుతున్న లాడెన్ ను చట్టం ప్రకారం శిక్షించటం సాధ్యం కాదని తేల్చేసిన అమెరికా అగ్రనాయకత్వం.. మూడో కంటికి తెలీకుండా సినిమాటిక్ గా లాడెన్ ను మట్టుబెట్టే ఆపరేషన్ ను షురూ చేసింది.

లాడెన్ ఉన్న ప్రాంతాన్ని.. ఆ సమాచారాన్ని పాకిస్థాన్ కు ఇవ్వకుండా.. సుశిక్షితులైన మెరికల్లాంటి బలగాలతో లాడెన్ నివాసం ఉన్న భవనంలోకి అర్థరాత్రి వేళ నేవీ సీల్స్ ఆపరేషన్ షురూ చేశారు. లాడెన్ నివాస మీద దాడి చేసి.. 40 నిమిషాల వ్యవధిలో అతడ్ని.. అతని కొడుకును మట్టుబెట్టటమే కాదు.. మరో ముగ్గురు ఉగ్రవాదుల్ని చంపేశారు.

అనంతరం లాడెన్ మృతదేహాన్ని గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి ముస్లిం మతాచారం ప్రకారం అరేబియా సముద్రంలో పడేసినట్లుగా ప్రకటించారు. ఈ మొత్తం అపరేషన్ ను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా లైవ్ లో వీక్షించటం గమనార్హం. తమ భూభాగంలోకి తమకు సమాచారం ఇవ్వకుండా అమెరికా సైనిక దళాలు ప్రవేశించి ‘ఆపరేషన్’ నిర్వహించటంపై పాక్ ఆగ్రహం వ్యక్తం చేసినా.. పెద్దన్న ప్రతీకారం ముందు అవేమీ వినిపించని పరిస్థితి. పెద్దన్న మజాకానా?