Begin typing your search above and press return to search.

పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు

By:  Tupaki Desk   |   4 Aug 2015 4:52 AM GMT
పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు
X
ఫ్రెండ్లీ పోలీసింగ్ మీద తరచూ మాట్లాడే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరికి భిన్నమైన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఒక వ్యక్తి పడిన గొడవకు.. పోలీసులు రియాక్ట్ అయిన తీరు సదరు వ్యక్తి మరణానికి కారణం కావటమే కాదు.. పోలీస్ స్టేషన్ మీద దాడి వరకూ వెళ్లి.. వాహనాల్ని ధ్వంసం చేయటం.. పోలీసుల్ని చితకబాదటం వరకూ వెళ్లింది.

ఇలాంటి ఘటన ఎక్కడో మారు మూల ప్రాంతంలో కాదు.. హైదరాబాద్ మారేడ్ పల్లిలో చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన బోనాల సందర్భంగా ఒక హోం గార్డుతో బన్నప్ప అనే ఆటో డ్రైవర్ గొడవ పడ్డాడు. మద్యం సేవించిన అతగాడు.. మత్తులో తమపై దాడి చేశాడంటూ సదరు హోంగార్డు ఫిర్యాదు చేయటంతో.. మారేడ్ పల్లి పోలీసులు బన్నప్పను అదుపులోకి తీసుకున్నారు.

ఆదివారం ఉదయం దాడి జరిగితే రాత్రికి అదుపులోకి తీసుకున్న అతన్ని పోలీసులు తీవ్రంగా కొట్టి గాయపరిచారని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆదివారం ఉదయం బంధువుల జోక్యంతో బన్నప్పను విడుదల చేశారని చెబుతున్నారు. అయితే.. తీవ్ర గాయాలతో ఉన్న అతన్ని.. స్థానిక ఆర్ ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళితే.. గాయాల తీవ్రత ఎక్కువగా ఉందని.. అతన్ని వెంటనే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.

అతన్ని ఆసుపత్రికి తీసుకెళుతున్న సమయంలోనే.. మరణించాడు.దీంతో అగ్రహం చెందిన బన్నప్ప బంధువులు సోమవారం రాత్రి పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. బన్నప్ప మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకొచ్చిన వారు.. పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు. కంప్యూటర్లు మొదలు.. స్టేషన్ లో తక్కువగా ఉన్న సిబ్బంది పై దాడికి దిగారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. స్టేషన్ బయటున్న వాహనాలకు నిప్పు పెట్టారు. బోనాల బందోబస్తుకు సిబ్బంది వెళ్లిపోవటంతో.. స్టేషన్ లో నలుగురైదుగురు పోలీసులు మాత్రమే ఉన్నారు. ఈ సందర్భంగా స్టేషన్ లో ఉన్న ఎస్ ఐ లపై దాడి చేసి గాయపర్చినట్లుగా చెబుతున్నారు.

ఈ ఘటనపై స్పందించిన పక్క పోలీస్ స్టేషన్ పోలీసులు వచ్చే సరికి.. స్టేషన్ పై దాడికి దిగిన వారంతా పరారైనట్లు చెబుతున్నారు. ఈ హడావుడిలో స్టేషన్ లోని ఆయుధాలు పోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. అలాంటిదేమీ లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ దాడి సమయంలో నిందితులు తెలివిగా వ్యవహరించి.. సీసీ కెమేరా ఫుటేజ్ బాక్స్ ను కూడా తమతో తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ పై దాడి ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దాడి చేసిన వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటన పట్ల పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర అగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు.