బీ అలెర్ట్! తెలుగు రాష్ట్రాలపై వాన పంజా!

Sun Jul 22 2018 10:09:26 GMT+0530 (IST)

జూన్ వచ్చి వెళ్లిపోయి.. జులై చివర్లోకి వస్తున్నా ఇప్పటివరకూ వాన జాడ లేని వైనం తెలిసిందే. మధ్య మధ్యలో వానలు కురిసినా.. గట్టిగా కురిసిన దాఖలాలు లేవన్నది మర్చిపోకూడదు. ఈ ఏడాది వర్షాలు బాగానే ఉంటాయన్న అంచనాలకు భిన్నమైన పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది.తెలుగు రాష్ట్రాల చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో వానలు బాగానే పడుతున్నా.. వరుణుడి కరుణ మాత్రం ఏపీ.. తెలంగాణల మీద పెద్దగా లేదని చెప్పాలి. ఇలాంటివేళ.. తాజాగా వాతావరణ శాఖ అధికారులు వాన హెచ్చరికను జారీ చేశారు. వచ్చేరెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే వీలుందని.. పలు చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఈసారి వానాకాలం సీజన్లో ఈ తరహా మాట ఇప్పటివరకూ వినిపించపలేదని చెప్పకతప్పదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని.. దీని ప్రభావంతో భారీ వర్షాలకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తా ఆంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. తీరం వెంట గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో వానలు పడే వీలుందని చెబుతున్నారు.

మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏపీతో పాటు.. తెలంగాణ మీదా వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న మాటను వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సో.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇందుకు తగ్గట్లుగా ప్లానింగ్ తో ఉండటం మంచిది.