Begin typing your search above and press return to search.

కొలొంబో పేలుళ్లు: జేడీఎస్ లో విషాదం

By:  Tupaki Desk   |   22 April 2019 8:40 AM GMT
కొలొంబో పేలుళ్లు: జేడీఎస్ లో విషాదం
X
శ్రీలంకలో ఉగ్రమూకలు చేసిన విధ్వంసాల తాలూక అనర్థాల పరంపర దేశంలోనూ కలకలం రేపుతోంది. ఎంతో మంది భారతీయులు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారన్న విషయం మెల్లమెల్లగా బయటపడుతోంది. శ్రీలంకలో జరిగిన బాంబు దాడిలో కర్ణాటకలో అధికారంలో ఉన్న జనతాదళ్ (జేడీయూ) పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు దుర్మరణం పాలయ్యారన్న సంగతి తాజాగా బయటపడింది. మరో ఆరుగురు అదృశ్యమయ్యారు. వారి జాడ ఇప్పటికీ తెలియరాలేదు.

శ్రీలంక బాంబు దాడిలో జేడీయూ కార్యకర్తల మరణంపై కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డీ కుమారస్వామి స్పందించారు. ఇద్దరు కార్యకర్తలు చనిపోయారని.. ఆరుగురు గల్లంతయ్యారని తనకు సమాచారం అందిందని పేర్కొన్నారు. వారి మరణం తనను కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గల్లంతైన వారి సమాచారాన్ని సేకరించడానికి తాను కొలొంబోలోని రాయబార కార్యాలయాన్ని సంప్రదించినట్లు తెలిపారు.

కర్ణాటకలో ఈనెల 18న తొలి దశ పోలింగ్ ముగిసింది. ఈ ప్రచారంలో పాల్గొన్న జేడీఎస్ కార్యకర్తలు కేజీ హనుమంతరాయప్ప - ఎం రంగప్ప - శివకుమార - లక్ష్మీనారాయణ - మారే గౌడ - పుట్టరాజు - మరో ఇద్దరు విశ్రాంతి కోసం రెండు రోజుల కిందటే శ్రీలంకకు వెళ్లారు. రాజధాని కొలొంబోలో బస చేశారు. షాంగ్రిలా హోటల్ పై ఆత్మాహుతి దాడిలో నేలమంగలకు చెందిన హనుమంతరాయప్ప - కాంట్రాక్టర్ రంగప్ప దుర్మరణం చెందారని సమాచారం. మిగతా వారి జాడ తెలియడం లేదు.

ఇక కొలొంబోలో జరిగిన బాంబు దాడిలో హనుమంతరాయప్ప - ఎం రంగప్ప చనిపోయారని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ధ్రువీకరించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని తెలిపారు.