Begin typing your search above and press return to search.

యూఎస్ - యూకే వ‌ద్దు..జ‌ర్మ‌నీ - ఐర్లాండ్ ముద్దు

By:  Tupaki Desk   |   18 Oct 2017 5:16 PM GMT
యూఎస్ - యూకే వ‌ద్దు..జ‌ర్మ‌నీ - ఐర్లాండ్ ముద్దు
X
భార‌తీయ ఐటీ, ఇత‌ర రంగాల వృత్తినిపుణుల ఆలోచ‌న స‌ర‌ళి మారుతోంది. గ‌త ఏడాది వ‌ర‌కు అవ‌కాశాల కోసం ఎక్కువ‌గా అమెరికా - యూకేపై పెద్ద ఎత్తున ఆస‌క్తి చూపిన‌ప్ప‌టికీ రాజ‌కీయ‌ప‌ర‌మైన కార‌ణాల వ‌ల్ల ఇటీవ‌లి కాలంలో మన‌వాళ్లు ఆ దేశాల‌పై ఆస‌క్తిని త‌గ్గించుకుంటున్నారు. యూకేకు వెళ్లేవారి సంఖ్య 42 శాతం - యూఎస్‌ కు వెళ్లేవారి సంఖ్య 38 శాతానికి ప‌డిపోయిందని తాజాగా ఓ స‌ర్వే తేల్చింది. ఇదే విధంగా యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌ లో ప‌ని చేయాల‌నుకునే వారిలో కూడా 21 శాతం త‌గ్గుద‌ల క‌నిపిస్తోంద‌ని వివ‌రించింది. ఇండీడ్ సంస్థ‌ 2016-2017 సంవత్సరానికి సంబంధించి చేసిన స‌ర్వేలో ఈ విష‌యం తేలింది.

ఇందుకు త‌గిన కార‌ణాల‌ను వివ‌రిస్తూ....అమెరికాలో చ‌ట్టాల్లో మార్పులు - అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణ‌యాలు - బ్రెక్జిట్ కార‌ణంగా యూకే వైపు ఆస‌క్తిచూపాల‌ని భావించిన వారు గ‌త ఏడాది నుంచి వెన‌క్కుత‌గ్గుతున్న‌ట్లు వివ‌రించారు. అదే స‌మ‌యంలో జ‌ర్మ‌నీ - ఐర్లాండ్ వెళ్లాల‌నుకున్న వారిలో వృద్ధి క‌న‌బ‌ర్చింద‌ని ఈ స‌ర్వే తేల్చింది. జ‌ర్మ‌నీ విష‌యంలో 10 శాతం - ఐర్లాండ్ విష‌యంలో 20% వృద్ధి ఉంద‌ని వివ‌రించింది. అయితే ఈ త‌గ్గుద‌ల ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ ఉద్యోగాల అన్వేష‌ణ విష‌యంలో అమెరికానే మ‌న వాళ్ల ఫ‌స్ట్ చాయిస్‌ గా ఉంది. దాదాపు 49 శాతం మంది అమెరికాలో జాబ్ చాన్స్ కోసం చూస్తుండ‌గా - యూఏఈలో 16 - కెనడాలో 9 - యూకేలో ఐదు - సింగపూర్‌ లో4 - ఆస్ట్రేలియాలో 3 - ఖ‌తర్‌ లో రెండు - బ‌హ్రెయిన్ & ద‌క్షిణాప్రికాలో అవ‌కాశాల కోసం రెండు శాతం అన్వేష‌ణ సాగుతోంది. 1960లో అమెరికాలో 12,000 భార‌తీయులు ఉండ‌గా...2015 నాటికి వారి సంఖ్య 2.15 మిలియ‌న్ల‌కు చేరింది. త‌ద్వారా మెక్సిక‌న్ల త‌ర్వాత రెండో అతిపెద్ద వ‌ల‌స‌దారుల ప్ర‌త్యేక‌త‌ను చేరుకుంది. యూకేలో 1.50 మిలియ‌న్ల ఇండియ‌న్లు ఉన్నారు.

ఇండీడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ‌శీకుమార్ మాట్లాడుతూ ఐటీ నిపుణుల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగానే కేరాఫ్ అడ్ర‌స్‌ గా ఉన్న భార‌త‌దేశం నుంచి గ‌తంలో అమెరికా - యూకే - ఆస్ట్రేలియా వంటి దేశాల‌కు పెద్ద ఎత్తున వ‌ల‌స‌లు కొన‌సాగేవ‌ని పేర్కొన్నారు. అమెరికా - యూకేలో ఆర్థిక - రాజకీయ అస్థిరత్వం వల్ల ఆయా దేశాలపై భారతీయులు అనాసక్తిని ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. అదే స‌మ‌యంలో భార‌త‌దేశంలోని స్థిర‌మైన విధానాల వ‌ల్ల ఇక్క‌డే ఉండి ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాల వైపు మొగ్గు చూపుతున్న‌ట్లు వివ‌రించారు. స్టార్ట‌ప్ క‌ల్చ‌ర్ పెర‌గ‌టం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. మేకిన్ ఇండియా - స్కిల్ ఇండియా - స్టార్ట‌ప్ ఇండియా వంటి ప‌థ‌కాల ద్వారా దేశంలోని యువ‌త ఇక్క‌డే ఉపాధి అవ‌కాశాల వైపు మొగ్గుచూపుతున్నార‌ని వివ‌రించారు. అంతేకాకుండా యూకే - ఆసియా ప‌సిపిక్ దేశాల్లోని వారు భార‌త్‌కు తిరిగి వ‌చ్చేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నార‌ని పేర్కొన్నారు.