Begin typing your search above and press return to search.

పడవ ప్రమాదంలో 38 శవాలు అక్కడేనా?

By:  Tupaki Desk   |   17 Sep 2019 6:18 AM GMT
పడవ ప్రమాదంలో 38 శవాలు అక్కడేనా?
X
గోదావరిలో పడవ మునిగి రెండు రోజులు కావస్తుంది. అయితే ఇప్పటివరకు కేవలం 16మంది మృతదేహాలు మాత్రమే వెలికితీశారు. నేవీ, డెహ్రడూన్ నుంచి వచ్చిన ప్రత్యేక దళం, ఏపీ పోలీసులు, గజ ఈతగాళ్లు, ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది వెతికినా మృతుల జాడ మాత్రం కనిపించడం లేదు. తాజాగా ధవళేశ్వరం దిగువన ఒక శవం కొట్టుకుపోయినట్టు గుర్తించారు. దీంతో దవళేశ్వరం బ్యారేజీని కిందకు దించి అక్కడ నైలాన్ వలను ఏర్పాటు చేశారు. కొట్టుకు వచ్చిన మృతదేహాలు అక్కడ చిక్కుబడిపోయేలా ఏర్పాట్లు చేశారు. ఇక గోదావరి ప్రవాహంపై నేవీ హెలిక్యాప్టర్లతో గాలించినా మృతదేహాల జాడ కనిపించడం లేదట..

మరి దాదాపు 65మందితో ప్రయాణించిన పడవలో 27మంది వరకు వెలుగుచూశారు. మరి మిగతా 38 మంది ఏమైనట్టు అన్న సందేహాలు వెంటాడుతున్నాయి..

తాజాగా భారత నౌకాదళం దగ్గర ఉన్న అత్యాధునిక సెర్చింగ్ సిగ్నల్స్ తోపాటు యంత్రాలను, గజ ఈతగాళ్లు కూడా పడవ మునిగిన ప్రాంతంలో దించి వెతికారు. దాదాపు 60 అడుగుల లోతులోకి వెళ్లి చూశారు. కిందకు వెళ్లడం సాధ్యం కావడం లేదట... మునిగిపోయిన బోటు 315 అడుగల లోతులో ఉన్నట్టు గుర్తించారు.

అయితే మృతదేహాలు అన్నీ పడవలోనే మునిగిపోయినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఆ మునిగిన బోటులో ఏసీ క్యాబిన్ ఉందని.. అందులో చుట్టూ గ్లాసులతో సీల్ చేయడంతో అందులో ఉన్న వారంతా పడవ మునిగినప్పుడు బయటకు రాలేక జలసమాధి అయినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఏసీ క్యాబిన్ లోంచి మునిగిపోయినప్పుడు తప్పించుకోవడం కష్టమని.. ఆ ఏసీ ప్రయాణమే భారీగా మృతదేహాలు బయటపడకపోవడానికి కారణమని.. వారంతా బోటులోనే మునిగిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు.

అయితే 315 అడుగుల లోతులో ఉన్న బోటును వెలికితీయడం అంత సాధ్యం కాదన్న మాట వినిపిస్తోంది. నేవీ, మత్య్సకారులు ప్రయత్నాలు చేస్తున్నా అక్కడ సుడిగుండాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది. కనీసం 60 అడుగుల లోతుకు వెళ్లగానే నేవి సెర్చింగ్ పరికరాలు , గజ ఈతగాళ్లు ఉధృతికి కిందకు వెళ్లలేకపోయారట.. సో పడవను వెలికితీస్తే కానీ మృతదేహాల జాడ తెలుస్తుందని భావిస్తున్నారు.