Begin typing your search above and press return to search.

రూ.6.24కోట్ల‌తో 300 ఎక‌రాలు కొనే ఛాన్స్‌!

By:  Tupaki Desk   |   22 Jun 2018 5:30 PM GMT
రూ.6.24కోట్ల‌తో 300 ఎక‌రాలు కొనే ఛాన్స్‌!
X
ఇవాల్టి రోజున హైద‌రాబాద్ ప్రైమ్ ఏరియాలో రూ.6.24 కోట్ల‌కు ఎక‌రం భూమి రాని ప‌రిస్థితి. అలాంటిది ఏకంగా 300 ఎక‌రాలా? సాధ్య‌మేనా? అని క్వ‌శ్చ‌న్ వేయొచ్చు. కానీ.. ఈ చిన్న మొత్తానికి 300 ఎక‌రాలు మ‌న దేశంలో కాదు అమెరికాలోనే ల‌భిస్తుంద‌ట‌. ఇంత కారుచౌక‌గా ఎందుకు? దీన్లో మ‌ర్మ‌మేంది? అనుకుంటున్నారా? అక్క‌డికే వ‌స్తున్నాం.

అమెరికాలో 300 ఎక‌రాల స్థ‌లాన్ని కేవ‌లం రూ.6.24 కోట్ల‌కు అప్ప‌గించేందుకు రెఢీగా ఉన్నార‌ట‌. కాకుంటే.. కొనే వారికి కాస్తంత గుండె బ‌లం కూడా ఉండాలంటున్నారు. లాస్ ఏంజిల్స్ కు కేవ‌లం మూడు గంట ప్ర‌యాణ దూరంలో ఉన్న ఒక ప్రాంతాన్ని ఇంత త‌క్కువ ధ‌ర‌కు అమ్మేందుకు రెఢీగా ఉన్నారు. కాకుంటే..కొనాల‌నుకునే వారే కాదు.. ఆస‌క్తి అనిపించిన వారంతా ఈ మొత్తం క‌థ‌నాన్ని చ‌ద‌వాల్సిందే.

కాలిఫోర్నియాలోని సెర్రో గోర్డో ప‌ట్ట‌ణం ఉంది. ఒక‌ప్పుడు ఈ ప్రాంతం చాలా ఫేమ‌స్‌. ఎందుకంటే.. 19వ శ‌తాబ్దంలో ఇక్క‌డ వెండి నిక్షేపాల కోసం భారీ ఎత్తున త‌వ్వ‌కాలు జ‌రిగేవి. అంతేకాదు.. వెండిని అత్య‌ధికంగా ఎగుమ‌తి చేసే ప్రాంతంగా పేరుంది కూడా. అయితే.. ఈ తవ్వ‌కాలు అంత‌కంత‌కూ పెరిగిపోవ‌టంతో ఆ ప్రాంత‌మంతా ఎడారిలా మారిపోయింది. 1938 నాటికి అక్క‌డ వెండి నిక్షేపాలు ఖాళీ కావ‌ట‌మే కాదు.. వెండి ధ‌ర త‌గ్గిపోవ‌టంతో త‌వ్వ‌కాలు ఆపేశారు. దీంతో.. అక్క‌డి ప్ర‌జ‌లు.. కార్మికులు వల‌స‌బాట పట్టారు.

దీంతో స‌ద‌రు ప‌ట్ట‌ణం కాస్తా ఖాళీ అయిపోయి నిర్మానుష్యంగా మారిపోయింది. ఆ స‌మ‌యంలో మైఖేల్ ఫాటెర్స‌న్ అనే వ్య‌క్తి ఈ మొత్తం ప‌ట్ట‌ణాన్ని త‌న సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయ‌న వార‌సులు ఈ ప‌ట్ట‌ణాన్ని అమ్మేయాల‌ని డిసైడ్ అయ్యారు.

బిష‌ప్ ఎస్టేట్ అనే స్థిరాస్తి సంస్థ ద్వారా దీన్ని అమ్మాల‌ని వారు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందుకోసం ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌క‌ట‌ల్ని ఇస్తున్నారు. 300 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న ప‌ట్ట‌ణంలో హోట‌ల్‌.. పెట్రోల్ బంక్ హౌస్‌.. సెలూన్ తో స‌హా నివాసానికి అనువైన 22 భ‌వ‌నాలు ఉన్నాయి. ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంతో పాటు దొంగ‌ల బెడ‌ద లేదు. భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌లు కూడా ఉన్నాయి.. వెండి నిక్షేపాలు ఏమైనా మిగిలి ఉంటే వాటిని త‌వ్వుకునే హ‌క్కులు కూడా భూమితో పాటు ల‌భిస్తాయ‌ని ఊరిస్తున్నారు. ఇంత మంచి డీల్ కు ఆల‌స్యం ఎందుకు? వెంట‌నే కొనేస్తే పోలా? అని తొంద‌ర‌ప‌డితే ఇబ్బందే.

ఎందుకంటే.. ఇన్ని పాజిటివ్ ల‌తో పాటు కొన్ని నెగిటివ్ లు కూడా ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఈ ప‌ట్ట‌ణం నుంచి జ‌న‌సంచారం పూర్తిగా త‌గ్గిన త‌ర్వాత వారానికి ఒక‌రు చొప్పున హ‌త్య‌కు గురైన‌ట్లు చెబుతారు. దీంతో.. ఇక్క‌డ దెయ్యాలు ఉన్నాయ‌ని.. అప్పుడ‌ప్ప‌డు వింత శ‌బ్దాలు వినిపిస్తుంటాయ‌ని చెబుతారు. అందుకే ఈ ప‌ట్ట‌ణాన్ని గోస్ట్ టౌన్ గా పిలుస్తుంటారు. అయితే.. ఈ వింత శ‌బ్దాల‌కు కార‌ణం దెయ్యాలు కాద‌ని.. గ‌తంలో దొంగ‌లు జ‌రిపిన కాల్పుల కార‌ణంగా భ‌వ‌నాల‌కు చిల్లులు ప‌డ్డాయ‌ని.. దీంతో వాటిల్లోకి గాలి పోయి వింత వింత శ‌బ్దాలు వ‌స్తాయే త‌ప్పించి మ‌రింకేమీ లేదంటున్నారు. ఏమైనా.. కారుచౌక‌గా వ‌స్తున్న ఆస్తి సంగ‌తి ఎలా ఉన్నా.. బోలెడంత గుండెధైర్యం మాత్రం కొనేవారికి ప‌క్కాగా ఉండాల్సిందే.