Begin typing your search above and press return to search.

అమెరికాలో అక్ర‌మంగా 30 వేల‌ ఇండియ‌న్లు!

By:  Tupaki Desk   |   24 May 2017 5:19 AM GMT
అమెరికాలో అక్ర‌మంగా 30 వేల‌ ఇండియ‌న్లు!
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలను అనుస‌రించి అక్క‌డ నివ‌సిస్తున్న అనుమ‌తి లేని వారి వివ‌రాల‌ను అధికారులు సేకరించారు. ఈ లెక్క‌ల్లో భార‌తీయు చిట్టా కూడా బ‌య‌ట‌ప‌డింది. 2016లో 1.4 మిలియన్ల మందికిపైగా భారత్‌ నుంచి అమెరికాకు వివిధ వీసాల ద్వారా చేరుకున్నారని కాంగ్రెస్‌కు హోమ్‌ లాండ్‌ సెక్యూరిటీ విభాగం అందచేసిన వార్షిక నివేదికలో వెల్లడించారు. ఇలా వ‌చ్చిన వారిలో అమెరికాలో గత ఏడాది 30 వేలకు పైగా భారతీయులు అక్రమంగా నివాసం ఉన్నారని నివేదికలో తేలింది. అక్రమంగా ఉంటున్న వారిలో వ్యాపారవేత్తలు, పర్యాటకులు, విద్యార్థులు ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. అయితే వలస కార్మికులను ఈ నివేదికలో పేర్కొనలేదు.

హోమ్‌ లాండ్‌ సెక్యూరిటీ విభాగం నివేదిక ప్రకారం గత ఏడాదిలో 50 మిలియన్లకు పైగా వలస కార్మికేతరులు అమెరికాకు చేరుకున్నారు. వీరిలో 7,39,478 మంది అక్రమంగా అమెరికాలోనే ఉండిపోయారని అంచనా. భారతీయుల విషయానికి వస్తే గత ఏడాది భారత్‌ నుంచి 1.4 మిలియన్ల మందికిపైగా వచ్చారు. వీరిలో 30 వేల మంది అమెరికాలోనే వుండిపోయారు. 6 వేల మంది భారతీయులు మాత్రమే వీసా గడువు తీరిపోయిన తరువాత స్వదేశానికి చేరుకున్నారు. గడువు తీరినా అమెరికాలో ఉన్న భారతీయుల్లో విద్యార్థులే ఎక్కువగా ఉన్నట్లు నివేదిక అంచనా వేసింది.

ఇలా గ‌డువు తీరిన‌ప్ప‌టికీ అమెరికాలోనే ఉంటున్న వారి విష‌యంలో త్వ‌ర‌లో చ‌ర్య‌లు ఉంటాయ‌ని తెలుస్తోంది. హోమ్‌ లాండ్‌ సెక్యూరిటీ విభాగం త‌న నివేదిక‌ను త్వ‌ర‌లో అధ్య‌క్షుడు ట్రంప్‌కు స‌మ‌ర్పించ‌నుంద‌ని ఆ త‌దుప‌రి అక్ర‌మ వ‌ల‌స‌దారుల విష‌యంలో క‌ఠిన చ‌ర్య‌లు ఖాయ‌మ‌ని అంటున్నారు.