Begin typing your search above and press return to search.

అదే సీన్:అప్పుడు ఎంజీఆర్..ఇప్పుడు పన్నీర్

By:  Tupaki Desk   |   18 Feb 2017 5:02 AM GMT
అదే సీన్:అప్పుడు ఎంజీఆర్..ఇప్పుడు పన్నీర్
X
అమ్మ మరణంతో అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలకు.. పళిని స్వామి సీఎంగా ఎంపిక కావటంతో చెక్ పడినట్లుగా భావించినా అదేమీ లేదన్నది తాజాగా చోటు చేసుకున్న పరిణామలు స్పస్టం చేశాయని చెప్పాలి. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పళనిస్వామిని బలనిరూపణ చేసుకోవటానికి గవర్నర్ 15 రోజుల సమయం ఇచ్చారు. దీంతో.. రెండు వర్గాల మధ్య ఎత్తులు పైఎత్తులు మొదలయ్యాయి. ఎమ్మెల్యేల బలం పెద్దగా లేనట్లు కనిపిస్తున్న మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. తన చర్యలతో పళనిస్వామి వర్గంలో టెన్షన్ పుట్టిస్తున్నారు.

ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం మరొకటి ఉంది. ఎంజీఆర్ తో పన్నీర్ ను పోల్వలేం కానీ.. తమిళనాడులో జరిగిన రెండో బలనిరూపణ పరీక్ష సమయంలో డీఎంకే పార్టీకి కోశాధికారిగా వ్యవహరిస్తున్న ఎంజీఆర్ ను.. డీఎంకే అధినేతగా ఉన్న కరుణానిధి పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ సందర్భంలో బలనిరూపణ పరీక్ష ఎదురైంది. తాజాగా.. ఎంజీఆర్ స్టార్ట్ చేసిన అన్నాడీఎంకే పార్టీలో కోశాధికారిగా వ్యవహరిస్తున్న పన్నీర్ ను పార్టీ నుంచి తప్పించటంతో.. శశికళ మీద తిరుగుబాటు చేసిన పన్నీర్ కారణంగా బలనిరూపణ పరీక్ష ఎదురవుతోంది. నాడు ఎంజీఆర్.. నేడు పన్నీర్ ఇద్దరూ ఆయా పార్టీలకు కోశాధికారిగా పనిచేయటం.. అధినేతల వేటు నేపథ్యంలో బలనిరూపణ కావటం గమనార్హం.

ఈ రోజు (శనివారం) మధ్యాహ్నం నిర్వహించే బలనిరూపణలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే.. తమిళనాడులో బలనిరూపణ పరీక్షలు ఇప్పటి వరకూ మూడు మాత్రమే చోటు చేసుకోగా.. తాజాగా జరుగుతున్న నాలుగో బలనిరూపణ పరీక్ష దాదాపు 30ఏళ్లతర్వాత చోటు చేసుకోవటం గమనార్హం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గతంలో జరిగిన బలనిరూపణ పరీక్షల సందర్భంగా ఇప్పటి మాదిరి నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవటం.

దేశంలోనే మొట్టమొదటి బలనిరూపణ పరీక్ష తమిళనాడులోనే జరగటం గమనార్హం. 1952 జులై 3న రాజాజీ నేతృత్వంలోని సర్కారు బలనిరూపణ పరీక్షను ఎదుర్కొంది. ఈ ఫలితాన్ని ఆ రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎదురైన తొలి బలనిరూపణ పరీక్ష కావటంతో.. ఏం జరుగుతుందోనన్న అతృత అందరిలోనూ వ్యక్తమైంది.

తమిళనాడు ఇప్పటివరకూ జరిగిన మూడు బలపరీక్షల్ని చూస్తే..

1. 1952లో రాజాజీ సర్కారుపై వచ్చిన విమర్శల నేపథ్యంలో తమ ప్రభుత్వంపై విశ్వాస పరీక్షను ప్రవేశ పెట్టగా.. మొత్తం 200 మంది ఎమ్మెల్యేల్లో 151 మంది రాజాజీకి వ్యతిరేకంగా ఓటు వేశార.

2. రాజాజీ తర్వాత మళ్లీ బలనిరూపణ పరీక్ష 1972లో అవసరమైంది. డీఎంకే కోశాధికారిగా ఉన్న ఎంజీఆర్ ను పార్టీ నుంచి తప్పిస్తూ కరుణానిధి నిర్ణయం తీసుకోవటంతో బలనిరూపణ పరీక్ష ఎదురైంది. ఈ పరీక్షలో కరుణానిధి 172 ఓట్లతో సులభంగా విజయం సాధించారు. ఆ తర్వాత ఎంజీఆర్ అన్నాడీఎంకే పార్టీని షురూ చేశారు.

3. మూడో బలపరీక్ష 1988లో చోటు చేసుకుంది. అన్నాడీంకే అధినేత ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ రెండుగా చీలిపోయింది. ఎంజీఆర్ సతీమణి జానకి తరఫున 99 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. జయలలిత తరఫున 33 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బలపరీక్ష సందర్భంగానాడు అసెంబ్లీలో పలు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో.. జయ వర్గానికి చెందిన33 మంది ఎమ్మెల్యేలపై నాటి స్పీకర్ వేటు వేశారు. బలపరీక్షలో జానకీ విజయం సాధించినా.. రెండురోజునే అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు.

4. తాజాగా జరుగుతున్న నాలుగో బలపరీక్షను చూస్తే.. గతంలో మాదిరే అన్నాడీఎంకే అధినేత్రి జయ మరణంతోనే ఈ పరిస్థితి ఎదురైంది. మరి.. ఈ పరీక్షలో శశికళ వర్గానికి చెందిన పళనిస్వామి విజయం సాధిస్తారా? తిరుగుబాటు బావుటా ఎగురవేసిన పన్నీర్ సక్సెస్ అవుతారా? అన్నది చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/