టీడీపీ కొంప కొల్లేరే!..వైసీపీ వైపు 30 మంది చూపు!

Fri Feb 15 2019 14:18:02 GMT+0530 (IST)

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయం మరింతగా వేడెక్కిపోతోంది. ఇప్పటిదాకా అధికార - విపక్షాల మధ్య మాటల తూటాలతో వేడి రాజుకోగా... ఇప్పుడు పార్టీ జంపింగ్‌లు మరింత వేడిని రాజేశాయి. విపక్షాల నుంచి అధికార పక్షంలోకి కాకుండా... అధికార పార్టీ నుంచి విపక్షంలోకి కొనసాగుతున్న ఈ వలసలు నిజంగానే పొలిటికల్ హీట్‌ను పెంచేస్తున్నాయి. గతంలో టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ తో ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు - ఇద్దరు ఎమ్మెల్సీలు - ముగ్గురు ఎంపీలు చేజారినా... వైసీపీ పెద్దగా కలవరపడలేదు. అధికార పార్టీ దమన నీతిని ఎండగడుతూ తనదైన శైలి పోరాటం చేసిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు పరిస్థితి రివర్సైపోయింది. అధికార పార్టీ నుంచి వైసీపీలోకి చేరుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగేలానే కనిపిస్తోంది. విపక్ష పార్టీ నుంచి కేవలం సీటు ఖరారైతే చాలంటూ టీడీపీ నుంచి స్వచ్ఛందంగా ప్రజా ప్రతినిధులు వైసీపీలో చేరిపోతున్నారు.ఇప్పటిదాకా ఇద్దరు ఎమ్మెల్యేలు - ఓ ఎంపీ టీడీపీకి రాజీనామా చేసేసి... వైసీపీలో చేరిపోయారు. గడచిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోగా... టీడీపీ అభ్యర్థులుగా విజయం సాధించిన రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి - అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు తమ ఎమ్మెల్యే - ఎంపీ పదవులకు కూడా రాజీనామా చేసి పారేశారు. ఈ మాత్రం దెబ్బలకే కుదేలైపోయిన టీడీపీ... ఇప్పుడు ఏదో ఎర వేసి తన పార్టీ నేతలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాగేసుకుంటున్నానని నానా యాగీ చేస్తోంది. అయితే ఈ పార్టీ జంపింగ్ లు ఇంతటితోనే అయిపోలేదని - ఇది కేవలం టీజర్ లాంటిదేనన్న వాదన వినిపిస్తోంది. టీజర్ ను మించిన ట్రైలర్ - ట్రైలర్ ను మించిన అసలు సిసలు సినిమా ముందుందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. టీడీపీకి వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఇసుమంత కూడా లేకపోవడం - గడచిన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు సాగించిన నత్తనడక పాలన - ఆశ్రితపక్షపాతం - రాష్ట్రాన్ని అప్పుల కుప్పలో కూరుకుపోయేలా చేయడమే ఇందుకు కారణాలని తేల్చేసుకున్న టీడీపీ నేతలు ఇప్పుడు వైసీపీలోకి  చేరిపోతున్నారట.

నాడు పెద్ద ఎత్తున డబ్బు - అధికార పార్టీగా మంత్రి పదవులు - ఇతర అభివృద్ధి పనులను ఆశగా ఎరవేసి చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తే... ఇప్పుడు కేవలం వచ్చే ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉన్న సీటులో అవకాశం ఇస్తే చాలంటూ జగన్ వద్దకు టీడీపీ నేతలు క్యూ కడుతున్నారు. అంతేకాకుండా వైసీపీ టికెట్ తో వచ్చిన పదవిని వదులుకునేందుకు నాడు టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు ససేమిరా అంటే... ఇప్పుడు టీడీపీ టికెట్ తో వచ్చిన పదవిని తృణప్రాయంగా వదిలేస్తూ వైసీపీలోకి చేరిపోతున్నారు. ఇక టీడీపీ నుంచి వైసీపీలోకి చేరుతున్న వారి జాబితా చాలా పెద్దదిగానే ఉందన్న వాదన వినిపిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా నుంచి ఓ నలుగురు - ఐదురుగు టీడీపీ ప్రజా ప్రతినిధులు వైసీపీలోకి చేరిపోయేందుకు రెడీ అయిపోయినట్టుగా తెలుస్తోంది.

ప్రకాశం జిల్లా నుంచి కూడా ఇద్దరు - ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారట. ఈ జిల్లాకు చెందిన ఓ సీనియర్ రాజకీయవేత్త - ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న నేత కూడా ఇదే బాటలో ఉన్నారట. గతంలో టీడీపీ బెదిరింపులు - ఇతర తాయిలాలకు తలొగ్గి ఇష్టం లేకున్నా టీడీపీలో చేరిన వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాట పడుతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో టీడీపీ సీనియర్ నేత - మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా వైసీపీలో చేరే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీలో జరిగిన అవమానాలు - తనకు తగ్గిపోతున్న ప్రాధాన్యాన్ని తరచి చూసుకుంటున్న పల్లె... వైసీపీలో చేరే దిశగా ఇప్పటికే తన యత్నాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. మొత్తంగా 30 మందికి పైగానే టీడీపీ నుంచి ప్రజాప్రతినిధులు వైసీపీలో చేరిపోవడం ఖాయమేనన్న వార్తలు ఇప్పుడు చంద్రబాబును తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయట.