Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు మావోయిస్టుల సవాల్

By:  Tupaki Desk   |   6 Oct 2015 11:11 AM GMT
చంద్రబాబుకు మావోయిస్టుల సవాల్
X
విశాఖపట్నంలో ముగ్గురు టీడీపీ నాయకులను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ఘటన సంచలనం రేపింది. విశాఖ జీకే వీధి మండలం కొత్తగూడలో ముగ్గురు టీడీపీ నాయకులను మావోయిస్టులు కిడ్నాప్‌ చేయడంతో స్థానిక కారణాలే ఉండి ఉంటాయని తొలుత అనుకున్నారు. అయితే... కిడ్నాపైనవారు గ్రామస్థాయి నాయకులేమీ కారు... జీకే వీధి మండల టీడీపీ అధ్యక్షుడు మామిడి బాలయ్య - టీడీపీ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యుడు ముక్కలి మహేశ్ - మరో సీనియర్ లీడర్ వండలం బాలయ్య లను మావోయిస్టులు కిడ్నాప్ చేశారని తెలిసి టీడీపీ శ్రేణులు వణుకుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయాల ఫలితమే వీరి కిడ్నాప్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది.

విశాఖ మన్యంలో బాక్సైట్ గనుల వ్యవహారం ఇప్పటిది కాదు. వైఎస్ టైంలో ఆయన అనుచరులకు గనులు కట్టబెట్టేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలోనూ పెన్నా గ్రూపునకు ఇక్కడ మైనింగ్ కు అనుమతించారు. దీనిపై ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నేతలు కొందరు అభ్యంతరాలు వ్యక్తంచేసినా నిర్ణయం మారలేదు.

గిరిజనులకు నష్టం కలుగుతుందన్న ఉద్దేశం.. మావోయిస్టుల భయంతో స్థానిక టీడీపీ కేడర్ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. అయితే.. లోకేశ్ - సుజనా చౌదరిల ఒత్తిడితో పెన్నా గ్రూప్ నకు ఇక్కడి గనులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి దీనికి సంబంధించిన అన్ని అనుమతులు, దస్త్రాలు అన్ని త్వరగా క్లియరయ్యేలా ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారట. ఇవన్నీ గమనిస్తున్న మావోయిస్టులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీచేశారు. గిరిజనులకు నష్టం కలిగించే బాక్సైట్ మైనింగ్ వద్దంటూ వారు హెచ్చరికలు జారీచేశారు. అన్నలకు భయపడే లోకల్ లీడర్లు బాక్సైట్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు కూడా లోకల్ టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు వారు భయపడినంతా జరిగింది. రాష్ట్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి హెచ్చరికగా మావోయిస్టులు ముగ్గురు టీడీపీ నేతలను కిడ్నాప్ చేశారు. కొద్దికాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న బాక్సైట్ వ్యవహారంలో మావోయిస్టులు పెద్ద స్టెప్పే వేశారు. చాలాకాలంగా కష్టాల్లో ఉన్న మావోయిస్టులు అడపాదడపా ఇన్ఫార్మర్ల పేరుతో గ్రామీణులను హతమార్చడం తప్ప పెద్ద సంఘటనలకు పాల్పడడం లేదు.... తాజాగా బాక్సైట్ విషయంలో వారు ఈ కిడ్నాప్ తో తమ బలమేమీ తగ్గలేదని చెబుతూ సవాల్ విసిరారు.

తాజా పరిణామాలతో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. రాత్రివేళల ప్రయాణాలు.... ఏజెన్సీ, మారుమూల ప్రాంతాలకు వెళ్తేందుకు వారు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.