Begin typing your search above and press return to search.

ఫోర్బ్స్ లివింగ్ బిజినెస్ మైండ్స్‌లో మ‌న‌కు 3 స్థానాలు!

By:  Tupaki Desk   |   20 Sep 2017 2:53 PM GMT
ఫోర్బ్స్ లివింగ్ బిజినెస్ మైండ్స్‌లో మ‌న‌కు 3 స్థానాలు!
X
ఫోర్బ్స్‌... పేరు వింటేనే చాలు... ఇదేదో సామాన్యుల‌కు సంబంధించిన‌ది కాదులే... ఏదో గొప్ప గొప్ప పారిశ్రామిక‌వేత్త‌లు, కోట్లాది ఆస్తుల‌ను మూట‌గ‌ట్టేసిన వాళ్లు, వంశ‌పారంప‌ర్యంగా కోటీశ్వ‌రులుగా కొన‌సాగుతున్న వారు... ఈ త‌ర‌హా వ్య‌క్తుల‌కు చెందిన వారి విశేషాలే ఉంటాయి క‌దా ఆ ప‌త్రిక‌లో అనుకుంటాం. నిన్న‌టిదాకా ఈ మాట నిజ‌మే. ఇప్పుడైతే కాదు. ఎందుకంటే సంప‌ద సృష్టిని త‌న‌దైన స్టైల్లో చెప్పేందుకు ఏర్ప‌డ్డ ఈ ప‌త్రిక ఇటీవ‌లి కాలంలో విభిన్న రంగాల్లో బ‌య‌ట‌కు వ‌స్తున్న విభిన్న ఆవిష్క‌ర‌ణ‌ల‌ను, స‌ద‌రు ఆవిష్క‌ర‌ణ‌ల‌కు కార‌కులైన వ్య‌క్తుల‌ను, స‌ద‌రు ఆవిష్క‌ర‌ణ‌ల కార‌ణంగా స‌మాజానికి ఒన‌గూడే ప్ర‌యోజ‌నాలు త‌దిత‌రాల‌పైనా దృష్టి సారించింద‌నే చెప్పాలి.

ఎటు నుంచి ఎటు చూసినా... ఫోర్బ్స్ పుస్త‌కం నిండా సంప‌ద సృష్టే క‌నిపించినా... ఇటీవ‌లి కాలంలో ఆ ప‌త్రిక విడుద‌ల చేస్తున్న జాబితాలు చూస్తుంటే మాత్రం సామాన్య జీవికి కూడా అమితాస‌క్తి క‌లుగుతోంద‌నే చెప్పాలి. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... నిత్యం ఎవ‌రి సంప‌ద ఎంతో చెప్పే ఈ ప‌త్రిక ఈ సారి ఓ స‌రికొత్త జాబితాను విడుద‌ల చేసింది. ఈ జాబితాలో ఆయా దేశాల‌కు చెందిన వంద మంది పారిశ్రామిక‌వేత్త‌ల‌కు స్థాన‌మిచ్చిన ఫోర్బ్స్‌... తాను రూపొందించిన స‌ద‌రు జాబితాలో ముగ్గురు భార‌తీయులు కూడా ఉన్నారంటూ మ‌న‌కు తీపి క‌బురు పంపింది. అయినా ఆ జాబితా ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... ప్ర‌పంచ పారిశ్రామిక య‌వ‌నిక‌పై గ్రేటెస్ట్ లివింగ్ బిజినెస్ మైండ్స్ ఎవ‌ర‌న్న విష‌యంపై ప్ర‌త్యేక జాబితాను రూపొంచింది.

వంద మంది ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌ల‌తో రూపొందించిన ఈ జాబితాలో భారత దేశానికి చెందిన ముగ్గురు పారిశ్రామిక‌వేత్త‌లు చోటు సంపాదించారు. వారిలో టాటా స‌న్స్ చైర్మ‌న్ ర‌త‌న్ టాటా, ఆర్సెలర్‌ అధినేత ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్‌, సన్‌ మైక్రో సిస్టమ్స్‌ సహ వ్యవస్థాపకులు వినోద్‌ ఖోస్లా ఉన్నారు. త‌న ప్ర‌స్థానం వందేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్బాన్ని పుర‌స్క‌రించుకుని ఫోర్బ్స్ ఈ జాబితాను విడుద‌ల చేసింది. ఈ జాబితాతో కూడిన ప్ర‌త్యేక సంచిక‌లో.... వ్యాపార చరిత్రలో సంచలనాలు.. కొత్త పెట్టుబడులు ఎలా పెట్టాలి? వ్యాపారస్తుడి విజన్‌ ఎలా ఉండాలి? వంటి అంశాలతో ప్రపంచవ్యాప్తంగా 100 వంది వ్యాపారస్తుల ఆలోచనలను.. వారి వ్యక్తగత, వ్యాపార విశేషాలను అందులో పొందుపరిచింద‌ట‌.