Begin typing your search above and press return to search.

కసబ్ గ్యాంగ్ ముంబైకి ఎలా వచ్చింది?

By:  Tupaki Desk   |   1 Oct 2016 5:56 PM GMT
కసబ్ గ్యాంగ్ ముంబైకి ఎలా వచ్చింది?
X
కంటి తుడుపు చ‌ర్య అంటే ఇదే! ఉగ్ర‌వాదులుకు ఊతం ఇస్తున్న పాకిస్థాన్ వైఖ‌రిని ప్రపంచ‌దేశాల‌న్నీ త‌ప్పుబ‌డుతున్న త‌రుణం ఇది. ఉగ్ర‌వాద ముఠాల‌ను పాక్ అంతం చేయాల‌ని సూచిస్తున్న వేళ ఇది. భార‌త్ ప‌ట్ల అనుస‌రిస్తున్న ఉగ్ర‌వాద ప్రేరేపిత పాక్ వైఖ‌రిని అంత‌ర్జాతీయ స‌మాజం వేలెత్తి చూపుతున్న సంద‌ర్భం ఇది. స‌రిగ్గా ఇలాంటి ప‌రిస్థితుల మ‌ధ్య‌... 26/11 ముంబై దాడుల కేసు విచార‌ణ‌లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం! అయితే, స్వ‌దేశంలో ఉగ్ర‌వాదుల‌పై ఉన్న కేసుల్లో పాకిస్థాన్ విచార‌ణ నిష్ఫ‌క్ష‌పాతంగా జ‌రుగుతుందంటే న‌మ్మేవారు ఎవ‌రుంటారు చెప్పండి..? అయినా స‌రే... చ‌ట్టం త‌న‌ప‌ని తానే చేసుకుంటుంద‌న్న‌ట్టుగానే ఈ కేసులో కొన్ని కీల‌క ప‌రిణామాల‌కు తెర తీశారు పాకిస్థాన్ అధికారులు.

ముంబై దాడుల కేసులో విచార‌ణ‌లో భాగంగా యాంటీ టెర్ర‌రిస్ట్ కోర్టు నియ‌మించిన న్యాయ‌క‌మిష‌న్ బృందం స‌భ్యులు గురువారం క‌రాచీ పోర్టుకు వెళ్ల‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ల‌ష్క‌ర్ ఉగ్ర‌వాదులు వాడిన బోటును ప‌రిశీలించ‌బోతున్నారు. అజ్మ‌ల్ క‌స‌బ్ తో స‌హా మొత్తం 10 మంది ఉగ్ర‌వాదులు క‌రాచీ నౌకాశ్రయం నుంచి ముంబైకి ఎలా వెళ్లార‌న్న‌ది తాజాగా ద‌ర్యాప్తుచేసి ఓ నివేదిక రూపొందించ‌బోతున్నారు. క‌రాచీలో క‌స‌బ్ ను చూసిన‌వారిని కూడా విచారిస్తార‌ట‌. ఇక‌, పాక్ ఫెడ‌ర‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ ద‌ర్యాప్తు క‌థ‌నం ఏంటంటే... 2006 నవంబ‌ర్ 3న 10 మంది ఉగ్ర‌వాదులు ఏకే 47తోపాటు మ‌రికొన్ని ఆయుధాల‌తో క‌రాచీ పోర్టు నుంచి మూడు బోట్ల‌లో బ‌య‌లు దేరార‌నీ. భార‌త జ‌లాల్లోకి ప్ర‌వేశించాక‌ ఒక చేప‌ల బోటును ఎటాక్ చేసి, దాన్లోని న‌లుగురిని చంపేసి, డ్రైవ‌ర్ ను బెదిరించి ముంబైవైపు వ‌చ్చార‌నీ, నవంబ‌ర్ 26న వారు ముంబైకి చేరుకున్నారు. న‌గ‌రంలో విధ్వంసం సృష్టించి 172 మందిని పొట్ట‌నబెట్టుకున్నారు. అయితే, వీరిని మ‌ట్టుపెట్ట‌డంలో మ‌న ఎన్‌.ఎస్‌.జి. క‌మాండోలు విజ‌యం సాధించారు. మొత్తం ప‌దిమంది ఉగ్ర‌వాదుల్లో 9 మంది కాల్పుల్లో మ‌ర‌ణించారు. అజ్మ‌ల్ క‌స‌బ్ మాత్రం ప్రాణాల‌తో దొరికిపోయాడు.

అయితే, ఈ ఘ‌ట‌న అనంత‌రం భార‌త్ తోపాటు వివిధ అంత‌ర్జాతీయ సంస్థ‌లు ఇచ్చిన నివేదిక‌ల ప్రకారం ముంబై దాడుల సూత్ర‌ధారిగా ల‌ష్క‌రే తొయిబాకు చెందిన జ‌కీర్ ఉర్ ర‌హ్మాన్ తోపాటు, ఇంకో అర‌డ‌జ‌ను మందిని నిందితులుగా పాక్ అరెస్ట్ చేసింది. ఈ దాడి సూత్ర‌ల్లో ఒక‌రైన జ‌కీర్ కి బెయిల్ వ‌చ్చింది! ప్ర‌స్తుతం అత‌గాడు ఎక్క‌డున్నాడో పాకిస్థాన్ అధికారులకే తెలీదట‌! తాజాగా ఏవో కొత్త ఆధారాలు సేక‌రిస్తామంటూ, కేసులో పురోగ‌తిని సాధిస్తామంటూ రంగంలోకి దిగిన న్యాయ క‌మిష‌న్ ఎలాంటి నివేదిక‌ల‌ను స‌మ‌ర్పిస్తుందో వేచి చూడాలి. ఆ నివేదిక‌ల్ని ఎంత సీరియ‌స్ గా తీసుకుని పాక్ త‌న చిత్త‌శుద్ధిని ఏవిధంగా నిరూపించుకుంటుందో వేచి చూడాలి.