Begin typing your search above and press return to search.

మల్లన్నసాగర్ ముంపు బాధితుల్ని ఆ కొట్టుడేంది?

By:  Tupaki Desk   |   25 July 2016 4:48 AM GMT
మల్లన్నసాగర్ ముంపు బాధితుల్ని ఆ కొట్టుడేంది?
X
మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ఆందోళన రోజురోజుకి ముదురుతోంది. నిన్నటి వరకూ మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్దన్న బాదిత ప్రజానీకం తమ నిరసనను తీవ్రతరం చేయటం ఒక ఎత్తు అయితే.. పోలీసుల వైఖరి ఇష్యూను మరింత ముదిరేలా చేస్తోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్పేసిందని చెప్పాలి. మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాల బాధితులు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా భారీ ధర్నా.. రాస్తారోకో చేపట్టాలని ప్రయత్నించారు.

ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 11 గంటలకు రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేయటానికి వెళుతున్న సింగారం.. ఎర్రవల్లి.. పల్లె పహాడ్.. వేముల ఘాట్ గ్రామాల ప్రజల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. కొందరు యువకులు ఒంటి మీద కిరోసిన్ పోసుకోవటం లాంటి ఘటనలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి. మరోవైపు.. ఆందోళకారుల సంఖ్య క్రమక్రమంగా ఎక్కువ కాసాగింది.

ఆయా గ్రామాల ప్రజలు.. వారి గ్రామాల్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవటంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం మొదలైంది. గ్రామాల నుంచి జాతీయ రహదారి మీదకు గ్రామస్తులు చేరుకోకుండా ఉండేందుకు వీలుగా లాఠీఛార్జ్ చేయటంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పోలీసులపై రాళ్లు.. ఇటుకలు.. కర్రలు విసిరారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.

దీంతో ప్రజలు చెల్లాచెదురు కావటంతో పాటు.. పరిస్థితి అదుపు తప్పింది. తెలంగాణ రాష్ట్ర సర్కారుకు.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ప్రజలు.. తమ ప్రాణాలు పోయినా మల్లన్నసాగర్ కోసం తమ భూముల్ని ఇచ్చేది లేదంటూ తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. లాఠీ ఛార్జ్ తో పలువురు మహిళలకు.. యువకులకు గాయాలయ్యాయి. ఈ లాఠీ ఛార్జ్ కార్యక్రమం నాలుగైదు సార్లు చోటు చేసుకోవటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల లాఠీ ఛార్జ్ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. లాఠీ దెబ్బలకు ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా లాఠీ ఛార్జ్ కారణంగా 60 నుంచి 70 మంది వరకు గాయాలు అయినట్లు చెబుతున్నారు.

పోలీసుల లాఠీ ఛార్జ్ సందర్భంగా కొందరు మహిళా కానిస్టేబుళ్లు అత్యుత్సాహాన్ని ప్రదర్శించినట్లుగా చెబుతున్నారు. ఇళ్లల్లోకి వెళ్లి మరీ.. మహిళల్ని బయటకు తీసుకొచ్చి మరీ కొట్టినట్లుగా ఆరోపిస్తున్నారు. ఇది పరిస్థితిని మరింత తీవ్రంగా మార్చినట్లుగా చెబుతున్నారు. ఈ ఘటనను రాజకీయ పక్షాలు.. ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. సోమవారం మెదక్ జిల్లా బంద్ కు పిలుపునివ్వటం గమనార్హం. మల్లన్నసాగర్ ఇష్యూ రోజురోజుకీ ముదురుతున్న నేపథ్యంలో ఆందోళనకారుల్ని శాంతించేలా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందంటున్నారు. పోలీసుల లాఠీలతో ఆందోళనలను కంట్రోల్ చేయాలని భావిస్తే తప్పులో కాలేసినట్లే అవుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మల్లన్నసాగర్ ముంపు ప్రాంతబాధితుల ఆందోళనకు సంబంధించి ఆదివారం చోటు చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు ఒక్కసారి ఉలిక్కిపడిన పరిస్థితి. ఈ ఇష్యూలో ఇప్పటికైన రచ్చ ఇక్కడితో ముగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఇష్యూ సీరియస్ నెస్ ను అర్థం చేసుకోగలుగుతారా..?