Begin typing your search above and press return to search.

నవ్వుతూ బోరు బావిలో నుంచి బయటకు వచ్చాడు

By:  Tupaki Desk   |   16 Aug 2017 6:21 AM GMT
నవ్వుతూ బోరు బావిలో నుంచి బయటకు వచ్చాడు
X
మృత్యుముఖాలుగా మారాయి బోరుబావులు. ఎడాపెడా తీసేసే బోరు బావుల్ని.. మ‌ళ్లీ క‌ప్ప‌కుండా వ‌దిలేయ‌టంతో ఇప్ప‌టికే ప‌లువురు చిన్నారుల ప్రాణాలు పోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఓపెన్ బోరుబావుల్ని మూసేసే దిశ‌గా ప్ర‌భుత్వాలు అడుగులు ఇంకా ప‌డ‌లేద‌ని చెప్పాలి. ఈ మ‌ధ్య‌నే తెలంగాణ ప్రాంతంలో ఒక చిన్నారి బోరుబావులో ప‌డి ప్రాణాలు పోగొట్టుకోవ‌టం తెలిసిందే. ఈసారి అందుకు భిన్నంగా రెండేళ్ల చిన్నారి ప‌ద‌కొండుగంట‌ల పాటు బోరుబావిలో ఉండి.. ఎలాంటి ఇబ్బంది లేకుండా సేఫ్ గా బ‌య‌ట‌ప‌డిన వైనం తెలుగు ప్ర‌జ‌ల్ని సంతోషానికి గురి చేస్తోంది.

బోరుబావిలో ప‌డిన పిల్లాడ్ని ర‌క్షించేందుకు అధికారులు చేసిన కృషిని ప్ర‌త్యేకంగా అభినందించాల్సిందే. తీవ్ర ఉత్కంట రేపిన ఈ ఉదంతంలోకి వెళితే.. గుంటూరు జిల్లా వినుకొండ మండ‌లం ఉమ్మ‌డివ‌రంలో మంగ‌ళ‌వారం సాయంత్రం బోరుబావిలో ప‌డిపోయాడు. అత‌న్ని ర‌క్షించేందుకు అధికారులు ప‌రుగులు పెట్టిన అధికారులు స‌మ‌యాన్ని.. వ‌ర్షాన్ని ప‌ట్టించుకోకుండా శ్ర‌మించి మ‌రీ ర‌క్షించారు.

ఉమ్మ‌డివ‌రానికి చెందిన మ‌ల్లికార్జున్‌.. అనూష‌ల ఏకైక కుమారుడు రెండేళ్ల‌ చంద్ర‌శేఖ‌ర్‌. ముద్దుగా చందు అని పిలుస్తారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం త‌ల్లితో క‌లిపి ప‌శువుల పాక వ‌ద్ద‌కు వెళ్లాడు. అక్క‌డ ఆడుకుంటూ ప్ర‌మాద‌వ‌శాత్తు స‌మీపంలోని బోరుబావిలో ప‌డ్డాడు. కొడుకు కోసం వెతికిన అనూష‌.. కొడుకు బోరుబావిలో ప‌డిన విష‌యాన్ని గుర్తించింది. వెంట‌నే స్థానికుల‌కు ఈ విష‌యం చెప్ప‌టం.. వారు ఆ స‌మాచారాన్ని అధికారుల‌కు ఇవ్వ‌టంతో చందూను ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు.

13 అడుగుల లోతులో ఉన్న బోరు బావిలో ప‌డిన చందును ర‌క్షించేందుకు స‌మాంత‌రంగా గొయ్యి త‌వ్వుతున్న క్ర‌మంలో రాళ్లు ఎదుర‌య్యాయి. అయినా.. ఆ స‌మ‌స్య‌ను అధిగ‌మించిన అధికారుల‌కు వ‌ర్షం పెద్ద అడ్డంకిగా మారింది. చివ‌ర‌కు 11 గంట‌ల పాటు శ్ర‌మించిన అనంత‌రం చందును సేఫ్ గా బ‌య‌ట‌కు తీశారు. చందును బ‌య‌ట‌కు తీసే క్ర‌మంలో అత‌డికి ఆక్సిజ‌న్ ను అందించారు. బ‌య‌ట‌కు తీసిన వెంట‌నే వైద్య చికిత్స కోసం అంబులెన్స్ ను ఏర్పాటు చేశారు. ఆస‌క్తిక‌రంగా బోరు బావి నుంచి బ‌య‌ట‌కొచ్చిన చందు న‌వ్వుతూ బ‌య‌ట‌కు రావ‌టంతో అక్క‌డి వారంతా ఆనందంలో సంబ‌రాలు చేసుకున్నారు. చందును ర‌క్షించ‌టంలో ఎన్డీఆర్ ఎఫ్ అధికారుల కృషిని ప్ర‌త్యేకంగా చెప్పాలి. సాయంత్రం నుంచి మొద‌లైన ప‌నుల్ని అర్థ‌రాత్రి 2.45 గంట‌ల వ‌ర‌కూ కొన‌సాగించ‌టం.. బాబును ర‌క్షించే వ‌ర‌కూ వెన‌క్కి త‌గ్గ‌ని వైనం అంద‌రి ప్ర‌శంస‌లు పొందేలా చేసింది.