Begin typing your search above and press return to search.

నల్లధనం తేవటం తర్వాత..పన్ను బకాయిలు చేస్తే.?

By:  Tupaki Desk   |   1 Aug 2015 9:16 AM GMT
నల్లధనం తేవటం తర్వాత..పన్ను బకాయిలు చేస్తే.?
X
నిత్యం ఏదో ఒక దేశం ముందుకో.. ప్రపంచ బ్యాంకు ముందుకో వెళ్లి దేహీ అంటూ కొత్త అప్పుల కోసం అడుక్కునే మనం.. ప్రభుత్వానికి పన్ను బకాయిల పడినోళ్ల మీద దృష్టి సారిస్తే.. లక్షల కోట్లు ఖజానాలోకి వచ్చి చేరే పరిస్థితి.

తాజాగా పన్ను బకాయిలకు సంబంధించిన పార్లమెంటులో చెప్పిన అంకెల్ని విని మతి పోయే పరిస్థితి. దేశంలో కేవలం 17 మంది చెల్లించాల్సిన పన్ను బకాయి ఎంతో తెలుసా..? అక్షరాల రూ.2.14లక్షల కోట్లు. కొంచెం అంటూఇటూగా ఆంధ్ర.. తెలంగాణ రెండు రాష్ట్రాల వార్షిక బడ్జెట్ మొత్తం కేవలం 17 మంది దగ్గర ఆగిపోయిన దుస్థితి. ఇంతా చేస్తే.. అది ప్రభుత్వానికి కట్టాల్సిన అధికారిక పన్ను బకాయిలు. కానీ.. ఆ మొత్తాన్నికట్టాల్సిన వారు కట్టరు.. కట్టించుకోవాల్సిన వారు ప్రయత్నించరు.

తాజాగా ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా రాజ్యసభలో మాట్లాడుతూ.. ఈ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. కేవలం 17 మంది చెల్లించాల్సిన పన్ను బకాయి రూ.2.14లక్షల కోట్లుగా ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. వెయ్యి కోట్లకు పైనే పన్ను చెల్లించాల్సిన కంపెనీల సంఖ్య 35కు చేరుకుందని.. వారు చెల్లించాల్సిన బకాయి మొత్తం రూ.90,568కోట్లుగా తేల్చారు.

ఇక.. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ప్రత్యక్ష పన్నుల వరకు వసూలు కావాల్సిన బకాయిల విలువ ఏకంగా రూ.8,27,680కోట్లకు ఉందని చెప్పుకొచ్చారు. గత మూడేళ్ల వ్యవధిలో రూ.10కోట్లకు పైనే పన్ను బకాయిలు పడిన వారి సంఖ్య 69 శాతానికి పెరిగిందని చెప్పుకొచ్చారు. అంటే.. పన్ను బకాయిదారులు పెరగటం అంటే.. ప్రభుత్వాధికారులు ఏ స్థాయిలో పని చేస్తున్నారో ఇట్టే అర్థమయ్యే పరిస్థితి. నిత్యం వడ్డీలకు భారీ మొత్తంలో అప్పులు తెచ్చే కన్నా.. బకాయిల మీద ప్రత్యేక ఫోకస్ పెడితే భారీగా నిధులు సమకూరవా? విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని తీసుకురావటానికి చాలానే ఇబ్బందులు అనుకుందాం. మరి.. దేశంలో పన్నులు కట్టాల్సిన వారి నుంచి ఇంత భారీ మొత్తాన్ని వసూలు చేయకుండా ఎందుకు ఉన్నట్లు..?