Begin typing your search above and press return to search.

ఘోర ప్రమాదం; బస్సు లాఠీ ఢీ.. 15 మంది మృతి

By:  Tupaki Desk   |   7 Oct 2015 12:16 PM GMT
ఘోర ప్రమాదం; బస్సు లాఠీ ఢీ.. 15 మంది మృతి
X
మరో ఘోరం చోటు చేసుకుంది. ఒకరి నిర్లక్ష్యం 15 ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయేలా చేయటమే కాదు.. మరికొందరి పరిస్థితి ఆందోళనకరంగా మార్చింది. మితిమీరిన వేగం.. నిబందనలు పాటించని ఒక లారీ డ్రైవర్ మృద్యువుగా మారి భారీ ఎత్తున ప్రాణాలు తీసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.

ఎక్కడ జరిగింది; నల్గొండ జిల్లా రామన్న పేట మండలం ఇంద్రపాలెం నగరం.. గ్రామ సమీపంలో..

ఎలా జరిగింది?; భువనగిరి నుంచి నల్గొండ వెళుతున్న నార్కెట్ పల్లి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు తుమ్మల పాలెం సమీపంలో మూల మలుపు తీసుకుంది. ఎదురుగా మితిమీరిన వేగంతో వచ్చిన లారీ ఢీ కొంది.

తీవ్రత ఎంత?; ఈ ప్రమాద తీవ్రతను పరిశీలిస్తే.. బస్సును ఢీ కొన్న లారీ ఎంత వేగంగా వచ్చిందో అర్థం అవుతుంది. లారీ ఢీ కొన్న ఘటనలో బస్సులోని డ్రైవర్ భాగం మొత్తం ఊడిపోవటమే కాదు.. ముందు భాగమంతా నామరూపాల్లేకుండా పోయింది.

మృతి చెందింది ఎంతమంది?; కడపటి సమాచారం ప్రకారం ఆర్టీసీ బస్సు డ్రైవర్ తో సహా 15 మంది మృతి చెందారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం మరో ముగ్గురు.. నలుగురికి పైనే మృతి చెందినట్లు చెబుతున్నారు. అధికారికంగా మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.

ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు?; ఈ భయానక దుర్ఘటనకు కారణం లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా చెబుతున్నారు.

ఘటనాస్థలం ఎలా ఉంది?; భారీగా డ్యామేజ్ అయిన బస్సుతో పాటు.. బస్సులో పెద్ద సంఖ్యలో ఇరుక్కుపోవటం.. తీవ్రగాయాలతో రక్తం ఓడుతున్న వారు.. బాధితుల ఆర్తనాదాలతో ప్రమాద స్థలి భయానకంగా మారింది.

ఎంత బీభత్సం అంటే..; జరిగిన ఘటనతో బస్సులో ప్రయాణికులు వణికిపోయి.. స్పృహ తప్పి పడిపోయారు. వారికి ప్రధమ చికిత్స అందించేందుకు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.

అపద్భాందవులుగా మారినోళ్లు; భారీ ప్రమాదం చోటు చేసుకోవటంతో అందరి కంటే ముందుగా ఘటనస్థలానికి చెందిన స్థానికులు స్పందించారు. వెనువెంటనే.. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించటం.. 108కి సమాచారం అందించటం.. ప్రమాద తీవ్రత గురించి పోలీసులకు వివరించటం లాంటివి చేశారు.

టీ సర్కారు స్పందనేమిటి?; ప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రులు మహేందర్ రెడ్డి.. జగదీశ్ రెడ్డి.. నాయిని నర్శింహారెడ్డిలు బయలుదేరి వెళ్లారు.

తాజా పరిస్థితి ఏమిటంటే..?; తీవ్రంగా గాయపడిన బాధితులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. మరణించిన వారి వివరాల్ని పోలీసులు సేకరిస్తున్నారు.