డేరాను చూసేందుకు ఒక్కళ్లు రాలేదట

Thu Sep 14 2017 10:57:29 GMT+0530 (IST)

ఎప్పటికైనా పాపం పండాల్సిందే. కాలం నడిచినప్పుడు దైవంగా పూజలందుకున్న వ్యక్తి.. చేసిన తప్పులు బయట పడ్డాక పరిస్థితి ఎలా ఉంటుందన్నది  డేరా సచ్ఛా సౌధ్ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. కోట్లాది మంది అభిమానుల్ని.. ఆరాధకుల్ని సంపాదించుకున్నప్పటికి మనిషి చేయకూడని పాపాలు చేసిన అతగాడిని కలిసేందుకు ఇప్పుడు ఎవరూ ఇష్టపడటం లేదట.

ఇద్దరు సాధ్వీలను అత్యాచారం చేసిన కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నారు. జైలుశిక్షను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పిన వెంటనే భారీ ఎత్తున ఆందోళనలు.. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మరి.. అలాంటి డేరా బాబా జైల్లో 15 రోజులు గడిపినప్పటికి అతన్నిచూసేందుకు ఎవరూ ఇప్పటివరకూ ముందుకు రాలేదట.

గుర్మీత్‌ను కలిసేందుకు అవకాశం ఉన్న పది పేర్లను జైలు అధికారులు సిద్దం చేశారు. ఈజాబితాలో గుర్మీత్ కుమారుడు జస్మిత్ తో పాటు.. దత్తపుత్రికగా చెప్పే (?) హనీప్రీత్ సింగ్ కూడా ఉన్నారు. అయితే.. జాబితాలో పేర్కొన్న పది మందిలో ఎవరూ డేరా బాబాను కలిసేందుకు ఇప్పటివరకూ రాలేదని చెబుతున్నారు. గుర్మీత్ ను తప్పించేందుకు కుట్ర పన్నారని.. హింసాత్మక ఘటనలకు కారణమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న హనీప్రీత్ పై హర్యానా పోలీసులు కేసు నమోదు చేసి.. లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆమెను అరెస్ట్ చేసేందుకు హర్యానా పోలీసులు ప్రయత్నిస్తుండటంతో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. ఆమెను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టినా ఆమె ఆచూకీ మాత్రం లభించటం లేదు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. డేరా బాబాకు జైలుశిక్ష విధించిన తర్వాత నుంచి అతడి పాపాలపుట్ట పగిలి ఒక్కొక్క విషయం బయటకు వస్తూ అందరిని విస్మయానికి గురి చేస్తోంది. ఇంత దారుణ నేరాలకు గుర్మీత్ పాల్పడ్డాడా? అన్న షాక్ కు గురి అవుతున్నారు. ఇదిలా ఉంటే.. జైల్లో ఉన్న గుర్మీత్ అనారోగ్యానికి గురైనట్లు జైలు అధికారులు చెబుతున్నారు.

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (పీజీఐఎంఎస్)  వైద్య బృందం వచ్చి డేరాబాబాకు వైద్యపరీక్షలు నిర్వహించినట్లు చెబుతున్నారు. గుర్మీత్ కోసం పీజీఐఎంఎస్ లో ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్లుగా చెబుతున్నారు. అనుమతి లభిస్తే ఆయన్ను జైలు నుంచి తరలిస్తారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆసుపత్రి దగ్గర భద్రతా దళాలు కవాతు నిర్వహిస్తున్న వైనం చూస్తుంటే.. గుర్మీత్ ను జైలు నుంచి ఆసుపత్రికి తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది.