Begin typing your search above and press return to search.

టీడీపీ ర‌చ్చ త‌ట్టుకోలేక 144 సెక్ష‌న్

By:  Tupaki Desk   |   28 July 2017 7:25 AM GMT
టీడీపీ ర‌చ్చ త‌ట్టుకోలేక 144 సెక్ష‌న్
X
అధికార తెలుగుదేశం పార్టీ నేత‌ల్లో నెల‌కొన్న విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఏకంగా పోటాపోటీ శంకుస్థాప‌న‌ల స్థాయికి చేరింది. రెండు వ‌ర్గాలకు చెందిన వంద‌లాది మంది రోడ్డెక్క‌డంతో పోలీసులు 144 సెక్ష‌న్ విధించాల్సి వ‌చ్చింది. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో సుదీర్ఘ‌కాలంగా కరణం బ‌ల‌రాం - గొట్టిపాటి ర‌వి వర్గాల మధ్య ఉన్న‌ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. వైసీపీ నుంచి గెలిచిన‌ టీడీపీలోకి వ‌చ్చిన‌ ఎమ్మెల్యే గొట్టిపాటి హ‌ల్ చ‌ల్ నేప‌థ్యంలో ఆధిపత్య పోరు జరుగుతోంది. దీనికి క‌ర‌ణం కౌంట‌ర్ అటాక్ సిద్ధం చేయ‌డంతో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

అద్దంకి పట్టణంలో ప్రభుత్వ వైద్యశాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు - పోతురాజుగండి వద్ద ఏర్పాటు చేసిన సిసి రోడ్డు, దామావారిపాలెం నుంచి సంతమాగులూరు వరకు ఏర్పాటు చేసిన తారురోడ్డు నిర్మాణాలు పూర్తిచేసి ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్న తరుణంలో స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం ఆయా అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయాలన్న తలంపుతో అధికారులతో చెప్పి ముందుగా ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. అద్దంకి నియోజకవర్గంలో ప్రభుత్వం అధికారంలో లేని సమయంలో పదేళ్లపాటు టీడీపీని కాపాడి, ఎమ్మెల్సీగా పదవి పొందిన కరణం బలరామకృష్ణమూర్తి ప్రభుత్వం నుంచి తాను తెప్పించిన నిధులతో పనులు జరిగాయ‌ని పేర్కొంటూ ఆయా అభివృద్ధి పనులకు తానే ప్రారంభోత్సవాలు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందుగా గురువారం ఉదయం వేకువజామున 3 గంటల ప్రాంతంలో ప్రభుత్వ వైద్యశాల, పోతురాజుగండి, దామావారిపాలెం కూడలితో కలిపి మూడు ప్రాంతాల్లో తన అనుచరులు ఏర్పాటు చేసిన శిలాఫలకాలతో ప్రారంభోత్సవం చేశారు.

అయితే శుక్రవారం ఎమ్మెల్యే చేతులమీదుగా ప్రారంభోత్సవం చేయాల్సిన అభివృద్ధి పనులకు బలరాం ప్రారంభోత్సవాలు చేయడంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదముందని గమనించిన పోలీసులు, అధికారులు బలరాం ప్రారంభోత్సవాలు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేశారు. అద్దంకి మున్సిపాలిటీ అనుమతి లేకుండా ప్రారంభోత్సవాలు చేయకూడదంటూ నగరపాలకసంస్థ కమిషనర్ నారాయణ - డిఎస్‌ పి రాంబాబు పర్యవేక్షణలో శిలాఫలకాలను ధ్వంసం చేశారు. బలరాం ప్రారంభోత్సవం చేసిన శిలాఫలకాలు ధ్వంసం చేశారని ప్రచారం కావడంతో అద్దంకి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కరణం వర్గీయులు, గొట్టిపాటి వర్గీయులు వందలాదిగా తరలివచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సిఐ హైమారావు ఆధ్వర్యంలో 144 సెక్షన్ విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొనడంతో ఎప్పుడు ఏమవుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.