Begin typing your search above and press return to search.

60 గంట‌లు శ్ర‌మించినా ఆ చిన్నారిని కాపాడ‌లేక‌పోయారు

By:  Tupaki Desk   |   25 Jun 2017 9:59 AM GMT
60 గంట‌లు శ్ర‌మించినా ఆ చిన్నారిని కాపాడ‌లేక‌పోయారు
X
మూడు రోజుల కింద‌ట గురువారం సాయంత్రం రంగారెడ్డి జిల్లాలోని మూతలేని బోరుబావిలో పడ్డ 14 నెలల చిన్నారిని ఏ ప్ర‌య‌త్న‌మూ కాపాడ‌లేక‌పోయింది. ఘ‌ట‌న జ‌రిగిన‌ప్ప‌టి నుంచి అధికారులు - స్థానికులు - ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా అవేమీ ఫ‌లించ‌లేదు. పైగా పాప‌ను ఎలాగైనా కాపాడాల‌న్న తాప‌త్ర‌యంలో చేసిన కొన్ని ప్ర‌య‌త్నాలు విక‌టించ‌డంతో ఆమె మ‌రింత లోతుకు ప‌డిపోయి కాపాడే అవ‌కాశం లేకుండా అయింది. చివ‌ర‌కు పాప శవం కూడా పూర్తిగా దొర‌క‌ని ప‌రిస్థితుల్లో త‌ల్లిదండ్రులు గుండెల‌విసేలా రోదిస్తున్నారు.

నిజానికి పాప బోరుబావిలో ప‌డిన‌ప్పుడు 10 అడుగుల లోతునే ఉండేది. చిన్నారి బావిలో పడిన తరువాత పావు గంట వ్యవధిలోనే తల్లిదండ్రులకు - స్థానికులకూ తెలియగా - కేవలం 10 అడుగుల లోతున ఆమె ఉన్నట్టు గుర్తించి, తాళ్ల సాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నం బెడిసికొట్టగా, పాప మరింత లోతుకు జారిపోయి - 40 అడుగుల లోతున ఉన్న సబ్ మెర్సిబుల్ మోటారుపై పడింది. ఆపై అధికారులు రంగంలోకి దిగగా - సహాయక చర్యలు ముమ్మరం అయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకూ పాప 40 అడుగుల లోతునే ఉంది. మోటారు బయటకు తీస్తే, పాప కూడా బయటకు వస్తుందన్న అంచనాతో మోటారును బయటకు లాగారు. ఈ ప్రయత్నం విఫలమైంది. బావి ఎంత లోతునకు తీశారో అంత లోతుకు పాప జారిపోయింది. మోటారును తెచ్చే క్రమంలోనే పాప ప్రాణాలు పోయుంటాయని ఇప్పుడు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు తప్పులూ జరక్కుండా ఉండివుంటే పాప ప్రాణాలతో దక్కేదని ఇప్పుడు చింతిస్తున్నారు.

చివ‌ర‌కు 60 గంట‌ల ప్ర‌య‌త్నం త‌రువాత‌ పాప మ‌ర‌ణించింద‌ని గుర్తించి మృతదేహాన్ని బయటకు తెచ్చేందుకు వాక్యూమ్ పైప్ విధానాన్ని వాడారు. ఆ వెంటనే పాప ధరించిన దుస్తులతో పాటు ముక్కలైన శరీర అవయవాలు బయటకు వచ్చాయి. ప్రమాదం జరిగిన రోజున పాప ధరించిన డ్రస్ ను చూడగానే ఆ తల్లి షాక్ తో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అధికారులు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఇలాంటి ప్ర‌మాదాలకు గురయిన‌వారిని కాపాడేందుకు స‌రైన విధానాలు మ‌న ద‌గ్గ‌ర లేక‌పోవ‌డం.. పైగా ఎలాగైనా కాపాడాల‌న్న తొంద‌ర‌లో చేసిన చిన్న పొర‌పాట్లు చివ‌ర‌కు విషాదం మిగిల్చాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/