రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయలేని 14 మంది ఎంపీలు

Mon Jul 17 2017 12:32:39 GMT+0530 (IST)

తుది ఫలితం ఏమవుతుందన్న విషయం తెలిసినా.. అంతిమ విజేత ఎవరన్నది ముందస్తుగా ఖరారు అయినప్పటికీ.. బలం లేని విపక్షం బరిలో ఉన్న వేళ.. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం 10 గంటలకు మొదలైంది. ఢిల్లీలోని పార్లమెంటు భవనంతో పాటు.. పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీలలోనూ ఈ ఎన్నికల పోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికలు తొలిసారి ఏపీ అసెంబ్లీ భవనంలో నిర్వహిస్తున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయటానికి లోక్ సభ.. రాజ్యసభతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ ఎమ్మెల్యేలు రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నిక చేసుకోనున్నారు.

అయితే.. వీరిలో కొందరు ఎంపీలకు ఓటు వేసే అవకావం లేకపోవటం విశేషం. ఎంపీలుగా ఉన్న వారికి ఓటుహక్కు లేకుండా ఎందుకు ఉంటుందని ప్రశ్నించొచ్చు. కానీ.. కొందరికి ఉండదు. ఎందుకంటే.. వారిని ప్రజలు నేరుగా ఎన్నుకోకపోవటం.. లేదంటే నేరుగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ద్వారా ఎన్నిక కాకపోవటంతో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుందని చెప్పాలి.

రాష్ట్రపతి ఎన్నికల్లో  ఓటు వేసే రాజ్యసభ.. లోక్ సభ ఎంపీలలో.. నామినేటెడ్ ఎంపీలకు ఓటుహక్కు లేదు. లోక్ సభలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తారు. వీరితో పాటు.. రాజ్యసభలో 12 మందిని నామినేటెడ్ సభ్యులుగా ఎంపిక చేస్తారు. ఈ 14 మంది ఎంపీలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయటానికి అర్హులు కారు. మరో కీలకమైన విషయం ఏమిటంటే.. మిగిలిన ఎన్నికల సమయాల్లో ఆయా పార్టీలు విప్ జారీ చేస్తుంటాయి.కానీ.. రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం అందుకు భిన్నం. ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో పార్టీలు తమ నేతలకు విప్ పేరిట ఆదేశాలు జారీ చేయవు. ఎవరికి వారు రహస్య పద్ధతిలో ఓటు వేసే వీలుంది. అందుకే.. ఓటు తేడాగా వేసినా.. ఎవరు వేశారన్న విషయం తెలిసే అవకాశం ఉండదు. రహస్య పద్ధతిలో సాగే రాష్ట్రపతి ఎన్నికల వేళలో విపక్ష నేతలు ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని పిలుపునిస్తుంటారు. ఇప్పుడు అర్థమైందా? 14 మంది ఎంపీలకు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ లో ఎందుకు ఓటు వేయరో?