Begin typing your search above and press return to search.

రాక్షసుల నీడన పిల్ల పిశాచాల ఆరాచకమిది

By:  Tupaki Desk   |   28 Aug 2016 5:57 AM GMT
రాక్షసుల నీడన పిల్ల పిశాచాల ఆరాచకమిది
X
గడిచిన కొద్దిరోజులుగా కామ్ గా ఉన్నట్లు కనిపించిన ఇస్లామిక్ స్టేట్ కు సంబందించిన ఒక వీడియో తాజాగా విడుదలై ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. పురాణాల్లో కనిపించే రాక్షసుల కంటే దారుణంగా వ్యవహరించే ఈ డిజిటల్ మానవ మృగాలు ఎంత ప్రమాదకరమైన వారన్న విషయం మరోసారి స్పష్టమైంది. తెలిసీ తెలియని వయసులో ఉన్న చిన్నారుల చేత తుపాకులు పట్టించిన ఈ దుర్మార్గులు.. వారి చేతనే బందీలను దారుణంగా కాల్చి చంపేసే వీడియో ఒకటి విడుదల చేశారు.

ఈ భయంకరమైన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రపంచానికి ఇస్లామిక స్టేట్ ఎంత ప్రమాదకారి అన్న విషయం మరోసారి స్పష్టమైందని చెప్పాలి. ఈ వీడియోలో మొత్తం ఐదుగురు బాలురు ఉండగా. . వారి వయసు 10 నుంచి 13 ఏళ్ల మధ్యలో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.ఈ ఐదుగురు పిల్లలు.. బందీలుగా ఉన్న నలుగురు కుర్దిష్ తిరుగుబాటు దారుల్ని దారుణంగా కాల్చి చంపారు. ఈ అకృత్యంలో పాలు పంచుకున్న పిల్లల్లో ట్యునీషియన్.. కుర్దిష్.. ఈజిప్ట్.. ఉజ్బెకిస్తాన్ కు చెందిన పిల్లలు పాల్గొన్నట్లు భావిస్తున్నారు.

తమ ముందున్న బందీలను కాల్చి చంపే సమయంలో ‘అల్లాహు అక్బర్’ అంటూ గట్టిగా నినాదాలు చేసిన పిల్లలు.. ఆ తర్వాత ఐదుగురిని చంపేశారు. ఈ వీడియోలో ఉన్న నలుగురు పిల్లల్లో ఒకరు బ్రిటన్ కు చెందిన అబూ (అబు అబ్దుల్లా ఆల్ బ్రిటాని)గా భావిస్తున్నారు. ఇతగాడు మాట్లాడుతూ.. అమెరికా.. ఫ్రాన్స్.. బ్రిటన్.. జర్మనీ ఇలా ఎవరి సహకారంతో అయినా కుర్దుల్నిఎవరూ కాపాడలేరంటూ అరబిక్ భాషలో చెప్పుకొచ్చాడు. పిల్లాడి చేతుల్లో గన్ను పెట్టటమే కాదు.. వారితో ఇంత ఆరాచకం జరిపించటం.. పలు దేశాలకు వార్నింగ్ ఇప్పించిన తీరు చూస్తే ఐఎస్ ఎంత ప్రమాదకారి అన్న విషయం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.